19, డిసెంబర్ 2020, శనివారం

బాపు గారి పుట్టినరోజు సందర్భంగా…

 





15-12-2020; మంగళవారం

 

బాపు గారి జన్మదినం సందర్భంగా ప్రత్యేక ప్రణాళిక (చిత్రం పై పద్యం - 72)


జానకీ మాత యిచ్చిన‌ సరము లోన

కాంచ గుంటినినీ రూపు కొంచె మైన

నీవు లేకున్న కూడదు నెమ్మి‌ నాకు

సతము యీ హనుమ మదిలో సంతసముగ

దాగి యుండగ వలయును దశరధ సుత

 

పెద్ద వాడిని ముద్దాడి ప్రేమ తోడ

నెత్తు కొని తిరు గాడంగ నీకు న్యాయ

మా, బుడత నైన నాపైన  మనసు పెట్టి

కని కరము జూపగ వలయు జనని యిపుడు

 

చిలకలకొలికి యేలనో చిర్రు‌ బుర్రు

లాడు చుండెనీ దినమున, రమ్య మైన

రేయి గడచి పో చుండె,హరిణ నయనకు

విన్న వించుము నీవైన నన్ను గాచ

 

వందనములు తల్లీ నీకు డెంద మలర

పండి తోత్తములకు నాదు వందనములు

భరత మాతకు  నిరతము వందనములు

పెట్టు చుంటిని యిప్పుడు ప్రేమ తోడ

 

అలసి పోతివి గిరిధరా ,నిలువ రింతు

రక్కసుని‌ శరమును బూని రణము లోన,

సత్య భామ మారె‌నిపుడు చండి వోలె,

భంగ పడబోను వలదయ్య బెంగ‌ నీకు

 

రుక్మిణీ సతి నన్ను‌ పిలుచు చు‌నుండె

సత్యభామయూ రమ్మనె సరస మాడ

జాంబవతి కోరె నాపొందు సంతసముగ

వచ్చితిని గాదె రాధకై వలపు కలుగ

 

భారతీ దేవి చల్లగా పామ రులను

కాచి నంతనే నెల్లరు ఘనత నొప్పు

పండితులుగ పేరును పొంది ప్రస్తు తింప

బడుదురు గాదె నిక్కమున్‌ భరణి లోన

 

జలధి లంఘించ వెడలెను జనక‌ సుతను

కాంచ ,కాయమున్ పెంచి యా కసమున నెగు

రంగ నంజనీ సుతుని పరాక్రమమును

కాంచి దీవెంచె‌ సురలెల్ల కరుణ తోడ 


**************** 



#బాపు

#bapu

 

ఆయన బొమ్మలేసారు...

ఆయన సినిమాలకి దర్శకత్వం చేసారు

ఆయన సినిమాలు తీసారు

ఆయన మంచి మనిషి

ఆయన భోలామనిషి

ఆయనలా స్టోరీ బోర్డ్ మరి ఎవరూ రాస్కోరు..

రామరాజ్యానికి ఏకంగా సీన్లనే గీసేసారాయన...(శ్రీరామరాజ్యం స్టోరి బోర్డు మచ్చుకు చూడండి )

ఆయనొక పెర్ఫెక్షనిస్టు

ఆయనో మొహమాటస్తుడు

ఆయన- #రమణ ఆత్మ-శరీరం..

ఇంకా చాలా ఉన్నాయి...

ఎప్పుడూ చూడని నాకే అందరూ చెప్తూంటే ఇన్ని తెలుసాయంటే....

మరి ఆయనతో కలిసి పనిచేసినవాళ్ళకి...

బ్రతికినవాళ్ళకి ఇంకెంత బాగా తెలుసో కదా...

బొమ్మలు....న భూతో న భవిష్యత్...ఆయన నిత్య విద్యార్థి....

బొమ్మ ఆయనకి నచ్చేదాకా రక రకాలుగా వేసుకుని చూసుకునేవారట...

ఆయన నా బొమ్మ బాగుంటుంది తాను బాగా వేస్తాన్లే అని ప్రాక్టీస్ మానలేదు...

ఆయన రూం మరి పుస్తకాలు స్కెచ్ లు కాన్వాసులూ పెయింటింగ్ సామగ్రి తోనే నిండి ఉండేదట...ఆ మధ్యలో ఎక్కడో పాత పాటలు వింటూ.... బొమ్మలు ప్రాక్టీస్ చేసుకుంటూ ఈయన....

 

#బాపు #బొమ్మ

సీతా పిన్నిగారా గోపాళమా బామ్మా బుడుగా పెసూనాంబా ఎవర్ని చూడండి వాళ్ళొక ఉదాహరణ... రిఫరెన్స్...   నాలాటి ఓనామకులకు....

ఆయన గీయని కేరక్టర్ లేదు...చేయని #ఇలస్ట్రేషన్ లేదేమో....

చిదఖ్కొట్టేసుకునే మొగుడు పెళ్ళాలు... సర్దిచెప్పుకునే మొగుడూ పెళ్ళాలూ ....ప్రేమించుకొనే రాధాగోపాళం ....దెబ్బాడేసే పక్కింటి లావుపాటి పిన్ని గారు వినే ఆవిడ మొగుడు...

ఆయన బర్డ్స్ ఐ వ్యూ కార్టూన్లలో కాని స్కెచ్చులలో గాని....ఎవరూ సాధించలేరు....పెర్ స్పెక్టివ్  ఆయనంత పెర్ ఫెక్షన్ ...అబ్బో ఆ లోతులు,ఎత్తులూ  ఆ వెడల్పులూ....నలుపు తెలుపవనీ రంగులవనీ దేన్లోనైనా గాని ఆయన ఏ తరుగూ లేకుండా చక్కగా ఒద్దికగా ఓపికగా గీసినవే....

 

దేవుళ్ళు ఇంతందంగా చూడగానే రెండుచేతులూ జోడించేలా భక్తిగా గీసి చూపెట్టినది ఈయనే....

పసలపూడి కథలూ...వంశీ సీరియల్ పేరు ఇంకొకటి గుర్తు లేదు... బొమ్మలు అద్భుతం... అందరూ ఉన్నారు ఆయన కార్టూన్లలో నేతల నుంచి వాతల దాకా అన్నిరకాల బొమ్మలు కనపడతాయి....

 

ఒక్కో చిత్తరువులలో ఎన్ని విశేషణాలో లెక్కచూస్తే అచ్చెరువే....అంత ఓపిక అన్ని సంగతులు గీయడం ఇంకా ఎవరికీ సాధ్యం కాదు....ఆకులనుంచి కాకులదాకా....

పిల్లలనుంచి పువ్వులదాకా వామనుడి నుంచి కామనుడి దాకా...

గోవుల నుండి గోపికలదాక...  చాలా వివరంగా గీసారు.

 చేతి వ్రాత ఒక టైపింగ్ ఫాంట్ గా మారిందంటే మరి?!?! ఆ గౌరవం మరి ఆయన చేతివ్రాత కి తప్ప ఇంకెవరికీ  రాలేదేమో..బహుశా రాదేమౌ...

 

సినిమాలు ఎవరూ తీయనంత బాగా తీసారు...  కొందరు హీరోలని పిండి మరీ ఔను వీడు ఇలాగ కూడా చేయగలడని చూపారు... హీరోయిన్లన గురించి నేను ఎంత చెప్పినా తక్కువే...

ఒద్దికగా పొందికగా అందంగా అల్లరిగా తెలుగు దనం అంటే అహో ఇచ్చోటనే అని అనిపించేలా....   అలాగని మిగిలిన కేరక్టర్ లని అర్రీబుర్రీగా వదల్లేదు.... ముత్యాల ముగ్గు లో సంగీత ఎంత ఇంపార్టెంటో మరి రావుగోపాల్రావూ అంతే సమానం.... ఆ సినిమా లలో అన్ని పాత్రలు అలా గుర్తుండిపోతాయ్ అంతే...

 

సినిమాలు కొన్ని హిట్లు... కొన్ని ఫట్లూ... ఆయన తప్పు కాదు చూసే వాళ్ళ అభిరుచులు అలా మారి ఏడ్చాయి....

 . . . . ఓ జోకు . . . ఓ ఇల్లాలు యావండీ బాపుగారి ఫలానా సినేమా వచ్చింది వెళ్దామండీ . . . ఈరోజే . . అని నొక్కి చెప్పిందట భర్తగారు మరి ఈ రోజు కుదరదూ ఆదివారం చూదాంలే అన్నాట్ట . . .

 

మరి ఆవిడ జవాబు . . . ఏమోండి అన్నిరోజులు ఉండదేమోండీ అని . . .

వారిద్దరి పైన వారే జోకులేసుకోడం మరి . . . .

ఏదో సందర్భంలో వారు మాకు ఖాళీ హాళ్ళు అలవాటే అని చమత్కరిచు కున్నారట కథ ఎంపిక . . . . కథానాయకుడు నాయికల ఎంపిక . . . సంగీతకారుల , సాహిత్య కారుల ఎంపికలలో మనకు ఆయన మనస్సు తెలుస్తుంది ఆయన పుట్టిన రోజుకు నాకున్న ఓ బండగుర్తు . . . . మా సమీర కన్నా ఓరోజు చిన్నవాడాయన . . . . - నెలగంటకి ముందు పుట్టినాయన . . .

పుట్టిన వెంటనే మరి ధనుర్మాస శోభ పరిచయం వలన ఆయనకి అన్ని అలా అబ్బాయేమో . . . .

ముగ్గులలోని సొంపులూ . . .

చలికాలం సొబగులూ . . . .

హరిదాసు కీర్తనలు . . . .

తిరుప్పావై పఠనాలూ . . . .

మరేమో . . . . . . ఇంకా ఏవో చెప్పాలన్నా ఈపాటికి అంతమంది అభిమానులూ చెప్పేసే ఉంటారు . . . . అయినా ఆయన నాలాంటి వాళ్ళ మాటల్లో పోస్టుల్లో అమరడు . . . ఆయన తన గీతలలోనూ రాతలలోనూ అభిమానుల గుండెలలోనూ అమరుడు

 

( అన్వర్ గారి గీతలలో బాపుగారు - సౌజన్యం గో తెలుగు )

  


ఆటవెలది

 

అలుపెరుగని బాపు నాకసం బేగెనే

" పెళ్ళి పుస్తకంబు"  పెన్నిదయ్యె   

నిచ్చెనంత బొమ్మ  నిలువెత్తు సంతకం     

అచ్చ తెనుగు బాపు కంజలిడుదు 

 

పి.ఎల్.నాగేశ్వరరావు

 

బాపు గారు అందించిన తెలుగు "జడ" అందాలకు చిన్న చంపకమాల

 

అల "జడ" అందముల్ చిగురు హోయ మిటారపు వెల్గునింపగన్

 

జిలుగుల భావమాలికల చెల్వము

మిక్కిలి లాస్యమీయగన్   

 

మలయజ తీరముల్ హరువు

మల్లెలు చందనమద్దినట్లుగా

 

"తెలుగు వనమ్ములో" సొబగు ఠేవలు

జూపిన "కుంచె" నీదయా

 

కస్తూరిశివశంకర్

 

 

ఆటవెలది

ఆలిచిప్ప కన్నులపరంజి రూపమై 

నీలియంచు వోణి నీలవేణి  

వాలుజడల సొబగు వయ్యారమొలికించ

రంగవల్లులద్దె రమ్యరీతి 

హేమలత

 

తెలుగువాకిళ్ళ కళ్ళాపి వెలుగులందు 

రంగవల్లుల దరహాస లాస్యమందు 

వాలుకన్నుల జిల్గులు జాలువార 

వేణికల ఠేవ జాల్వారు వైనమందు 

నిత్య సుకుమారమైన సున్నితపు ఠీవి 

బాపుకుంచెలో చిక్కిన  "స్వాతిచినుకు" !!

 

 

బాపు

నవరసాలను రంగులతో  చక్కగా కలిపి,చిక్కగా చిలికి

వెన్నపూసలాంటి మనసుతో తన కుంచెని కాగితాలపై నృత్యం చేయిస్తూ ,

అనేకానేక తలంపులతో గీసే గీతలే ,ప్రాణాలు పోసుకు

బయటకొచ్చే బాపు బొమ్మలు. అలా బొమ్మలతో బాపు

బొమ్మల్లో బాపు ,బాపూనే బాపు !

 

జి మురళి మోహన్ రావు

 

 

సీ ll

"రామాయణ" సుధలు రంజిల్లు హరువులై భక్తి సుధలు నింపు పరవశములు    

"బుడుగు" "సీగానాంబ" నొడువుల సంబర మందించి మురిపించె మానసమును

"రాధగోపాల" సరసధరహాస వీచికలు సుమధుర మంజీరములవి !  

తెలుగు వాకిళ్ళలో తేనెల కళ్ళాపి జల్లిన నిద్దంపు మల్లెలందు 

గీ

చిన్నికృష్ణయ్య  లీలల వన్నెలందు

చిట్టి పసిపాప పవళింపు జిలుగులందు

సొలపు విరహంపు వేదన రూపమందు

మనసు మురిపించగా "బాపు" మధురరీతి

కస్తూరి శివశంకర్

 

 

తేజరిల్లు భావమదియే తెలుగు వారి

నోట నానెడి నానుడై బాట వేసి

వెలిగె పదహారణాలగు తెలుగు పడుచు

బాపు గీసిన బొమ్మయై భాసురముగ.

 

జైకర్ విశ్వేశ్వర్ టోణ్ పె, థానే, ముంబయి

 

 

 

బాపు

వాలు కనులు అంటే ఇలానే ఉండాలని,

రాముడు కూడా వయ్యారంగా ఉంటాడని,

వాలుజడ అంటే జడ కుప్పెలతో ఇలా ఊగుతూ ఉండాలని,

నవరసాకు తగ్గట్టు అమ్మాయి హావా భావాలని,

చిలిపి అల్లరి చేసే పేద్ద లాగు బుడుగుని,

అందమైన అమ్మాయి అంటే బాపు బొమ్మలా ఉండాలని,

చిట్టిజడలున్న సీ గాన పెసూనాంబని,

చిలకకొట్టిన జాంపండు లాటి అక్షరశైలిని,

నాబొమ్మలో గీత పొదుపు గాని

నాలోను కలపొసన బానే ఉందని

మీరుగాక ఎవరు చెప్పగలరు చెప్పకనే....

అందుకే..మీరు బాపురే.. బాపు.

మీకు..మీకళామ తల్లిపై శతకోటి వందనాలతో.....

ఉష.

 

 

ఆటవెలది

బాపు రమణ జోడి బ్రహ్మండమంతయు

నెరుక లేని జనులు ఎచట గలరు

చిత్రమతడు గీయు చిత్తమ్ము దోచుగా

అట్టివారి కీర్తికంతులేదు

 

ఆటవెలది

చిర్రుబుర్రులాడు చినదాని తోడుగా

బుంగమూతి బెట్టు నంగ నాచి

వాలుజడను ద్రిప్పు వయ్యారి భామను

తాను జూపు తీరు తలపు దోచు

కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి

 

 

సీసము

పద్మాస నంబున పలుకుపూ బోడియు కరము లందున మీటె కచ్ఛపియును

వాణియు కేలున వాలుగా వీణను వాయించగను వేల్పు వాంఛితముగ

నలువరా ణియుమీట నాగసరమువోలె తంతిలన్నికదిలె తరగములుగ

నాదబిం దువుగాను నయగారమువొలికె దిక్కులన్నియు మోగె దివ్వెలుగను

 

ఆ.వె

జ్ఞాన మిచ్చు తల్లి జ్ఞానప్రసూనాంబ

భారతిగను వొసగె భాషలన్ని

అభయ హస్త మిచ్చి యంబభవానిగ

కరుణ మీర గాను కమలనయన

గీతాశైలజ

 

 

సీ"

దివ్యత్వ మొలికెడు దేవతా మూర్తులు

భాగ్యమై నిలుచుండు భవ్య రీతి

గయ్యాళి పెండ్లాము, గంతులేయు బుడుగు

సతి సపర్యల జిక్కు సత్పురుషులు,

కాటుకద్దిన కళ్ళు, కానరాని నడుము

మిన్నాగు వాల్జడ వన్నె జూడ

నమరమౌను కథల కద్దంగ వన్నెలు

బాపు బొమ్మల బొంగు భావుకతయె

 

భావ మొలికించు బొమ్మల భంగి జూడ

కడలి యొంపుల కన్నెకున్ కన్నుకుట్టు

నపర బమ్మయై సృజియించె హంగులెన్నొ

బ్రహ్మ తలచిన బుట్టునా బాపు తిరిగి

 

సీ"

ప్రతిగీత పలికించు  ప్రణయంపు భావనల్ వంపు వంపునకొక్క సొంపు జూప

శృంగార భంగిమల్ సృజియించ మన్మధ బాణముల్ చేబూను బ్రహ్మయతడు

ముఖ కవళికయందు మోహంబు విశదమౌ నయనమ్ము లూసుల నందనాలు

కలము కదలగ నచలమౌను భావంబు వముప్పొంగగ జిల్గులొలుక

తే"

రాధ గోపాలుర ప్రణయ గాధనందు

పావన రాగంబు హృదయాన బరగు వేళ

దైవ మానుష భేదమ్ము దరికి రాక

తన్మయత్వాన దరియించి ధన్యుడాయె

వాణిశ్రీ నైనాల

 

సీ.

సొగసుచూడతరమా!సోయగమొలికించు చిత్తరువుల శోభ చెప్ప తరమ!

తరుణిమనోహర తనువు హొయలుచూపు  బాపు గీతల జిగి ప్రాభవంబె

దైవత్వ మగుపించి తరియింప చేసెడి దేవుని చిత్రముల్ పావనంబె

కనువిందు చేయుచు కమనీయ భావముల్ పంచె చిత్రముల నందించి బాపు

 

కుంచె నవరసముల జల్లు గుమ్మరించి

తెలుగు నాట, వెండితెరపై జిలుగు హంగు

చూపి బాపు జ్ఞాపకములన్ శోభితముగ

పుడమి నందు యిమిడ్చినే పొందికగను

వెంకట్.సి హెచ్

 

 

పాలు కావలెననుచు గోపాలుడడుగ

మురియుచు యశోద రయమున మ్రోలనున్న

మహిని చేపగా చిక్కిన మధురమైన

పాలు నొసగెను ముద్దులబాలునకును

భక్తి మీరగ వేడిన ముక్తి నిచ్చు

మోహనాంగుడి యాకలి ముదిత తీర్చె

అవళూరు సీత

 

 

 

ఆ.వె

బాపు వ్రాత లన్ని భామలుగా దీరి

వాలు కనుల తోడ వనిత గాను

బ్రహ్మ రాత వలెను బాపుగీసినగీత

రూపు దిద్దు కొనియె రోచనాంగి

గీతాశైలజ

 

 

 

హాస్యం కానిది నాకట్టే నచ్చదండి.

రమణగారూ కూడా అలానే ఉండేవారండి.

నాకు అనేకమంది గురువులండి.

 

ఆయన బొమ్మల్లో కనిపించే భక్తుల వినయం, ఆయన మాటల్లో కూడా అలానే ఉంటుంది  , ప్రతిమాటలో స్నేహితుని తలవడం రమణ గారిపై ఆయనకున్న అమితమైన ప్రేమ చూపిస్తుంది , మితంగా మాట్లాడటం బాపూ నైజం , ఆయన బొమ్మలమల్లే ... వేలేడంత ఉండవు , పెద్ద పెద్ద సినిమాల్లో సీనియర్ నటులు చూపించలేని భావలన్నీ వాటి కవళికల్లో చూపించేస్తాయి, ఎక్స్ ప్రెషన్ అంటే ఇదిరా బడుద్దాయి, అనే పెద్ద పెద్ద పాఠాలు నేర్పేస్తాయి !!

 

ఆ స్థాయి చేరడం , ఈ తరం తరమా ?? ఏమో మరి ...బాపూ అనే వ్యసనం అంటుకున్నాకా, వేరే వాళ్ళు ఈ గుండెల్లో దూరాలంటే బాపూనే మళ్ళీ జన్మెత్తాలి !!

 

మెలి తిరిగిన గీత మనకి అక్షరం , బాపు చేతిని తాకితే అది లక్షణమైన అబ్బురం !!

 

ఆయనదొక శైలి , ఆయనదొక లిపి,దీర్ఘాలున్న అక్షరాల మధ్య వచ్చే ఖాళీలను తప్పించడానికి చేసిన ప్రయత్నమే నా లిపికి కారణం, దానిని జనాలు ఆదరించడం నా అదృష్టమండి అంటారాయన !!

 

అలజడి రేపే జడలైనా , అల్లాడించే కనులైనా , మెలికలు తిప్పే నడుమైనా..బాపూ బొమ్మల అందం కూసింత ఎక్కువే...కోరగా చూసినా , గీరగా నవ్వినా, కినుకు అలకబూనినా, కిసుకుమని నవ్వినా , కులుకులేస్తూ నడిచినా బా....మ్మలే (బాపూ బొమ్మ) చేయాలి.

 

చామనఛాయ రంగు, నుదుట కుంకుమ రేఖ, కంటికి సన్నని కాటుకరేఖ , పొందికైన చీరకట్టు, పారాణి పాదాలు, నకిలీ రంగులుండని నఖాలు , పదహారణాల తెలుగు రూపం బాపుగారి సుకలం చేసే విన్యాసం . అయినది బొమ్మే అయినా దిష్టి చుక్క పెట్టలేమో అనిపించేట్టు ఉంటాయి... ఈ బొమ్మలమీద మనసు పారేసుకుని .. మా శీను బాబాయ్ , మా చిన్ని మామ ఎక్కడెక్కడో బొమ్మల్ని వెతికి లేటు పెళ్ళిళ్ళు చేసుకున్నారు (పెద్ద కళ్ళ సాయిశ్రీ ,పొడుగు జెళ్ళ మైథిలి దొరికారనుకోండి) .

 

ఇహ ఆయన వేసిన జేజిగారి బొమ్మల గురించి చెప్పాలంటే , ఆయన కుంచెతో ప్రాణం పోసుకున్న దేవుళ్లంతా , నిన్ను పుట్టించడం మా పూర్వజన్మ సుకృతంరా నాయనా.... 🙏😇  అంటూ గుండెలమీద చేయి వేసుకుని , ..హమ్మయ్యా... అనుకుంటారు!!

 

నాకు నగలక్కర్లేదు ఓసారి బాపూ ఇంటికెళ్ళొస్తానని , ఆయుధాలు బాపూ ఇస్తాడ్లే అనుకునే జేజిగార్లు బోలెడు , ముఖ్యంగా రాముడు ... ఆయన వేసిన భద్రాద్రి రాముని చిత్రపటం భద్రాద్రి గర్భగుడిలో మూలవిరాట్టు వెనుక గోడని చేరడం ఆయన అదృష్టం అంటారు. చిన్నదో చితకదో బాపూ వేసిన జేజిగారైతే చాలు, పుణ్యం అదే వచ్చేస్తుందని నేను కూడా ఉడతా భక్తిగా సరస్వతి బొమ్మని పూజామందిరానికి చేర్చాను!!

 

బాపూ గారు ఏదేని పుస్తకం మీదైనా కవర్ కి బొమ్మ వేసారంటేనే అర్థమవుతుంది , అందులో ఉండే కంటెంట్ మహా గొప్పది, ఆ పుస్తకం భేషుగ్గా కొని చదివేయవచ్చు అని , వంశీ రచనల పరిచయం నాకు అలానే జరిగింది !!

 

మేకప్పులు నచ్చవు, సాధారణమే సౌందర్యం , సామాన్యశాస్త్రమే మన సంప్రదాయం అనే జంట బాపూ-రమణలది ..అందుకే వారి సినిమాలు అందమైన పూరిల్లులా , ముద్దబంతి తోటలా ,మధ్యతరగతి మందారాల ఘుమఘుమలతో స్వచ్ఛమైన కందంబ మాలలా రూపు దిద్దుకుని మన కళ్ళని శుభ్రం చేస్తాయి, బాపూ బొమ్మలు , బాపూ-రమణల సినిమాలు చూస్తే.. నా దృష్టిలో తీయనైన కొబ్బరి నీరు తాగినంత మేలు!

 

విమర్శలని వినయంగా స్వీకరిస్తూ, పొగడ్తలని సవినయంగా తిరస్కరిస్తూ, సోత్కర్ష నచ్చని జంట బాపూ-రమణలది , పద్మశ్రీ వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందండి అని చిరునవ్వుతో వినయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, గర్వమనే మాటకి క్రోసెడు దూరం మరి!!

 

కష్టాలొస్తే కుంగిపోకూడదు, సుఖాలొస్తే పొంగిపోకూడదు అని ఆయన సినిమాల్లో ఇచ్చే సందేశమే , నిజం జీవితంలో కూడా పాటిస్తూఫ్లాపులొచ్చినా నవ్వేస్తూ, హిట్టువస్తే హమ్మయ్యానుకొంటూ... అతి సామాన్యంగా గడపగలగడం ఆ మహానుభావుని గొప్పతనం!!

 

అభిమానులను తిరిగి అభిమానించడం బాపూ గారి లక్షణం ..ప్రముఖ కార్టూనిస్ట్  mv అప్పారావు(సురేఖ) గారికి ఆయన వ్రాసిన ఉత్తరాలు , సునీత కి వీరాభిమానినని ప్రశంసలు, దస్తూరి తిలకం పేరుతో శ్రీరమణ గారి మిథునానికి కొత్త హంగు చేర్చడం వారి స్నేహశీలతకి తార్కాణం !!

 

బాపూ లేని రమణ లేడు , రమణ లేని బాపూ ఉండడు అన్నట్టు తిరిగి ... కుంచెం అటు ఇటూ గా జంటగానే చెట్టాపట్టాలేసుకుని డైరెక్ట్ రాముడ్నే ఇంటర్వ్యూ చేద్దామంటూ పైలోకానికి పడవేసుకుని వెళ్లిపోయారు వీళ్ళిద్దరూ , కొంచం బాధే .... అయితేనేం , వాళ్ళు మనకై వదిలి వెళ్ళిన బోలెడు ఆనవాళ్ళుండగా మనకేం తక్కువ ?

 

ఇప్పటికీ , ఎప్పటికీ ఆయన వేసిన కార్టూన్లు మనసులో అచ్చేసుకుని , ఆయన గీసిన బొమ్మలు గుండెకు హత్తుకుని కళ్ళుమూసుకుని తాదాత్మ్యం తో కన్నీళ్లు కార్చే బోలెడు మంది అభిమానుల్లో నేనూ ఒక బుల్లి అభిమానిని ....

 

సత్తిరాజు లక్ష్మీనారాయణ స్వామి జయంతికి ఇదే నా నివాళి.

 

విష్ణుప్రియ

 

 

 

 

బాపూజ్యుడు

డావిన్సీగారి మోనాలిసాని ఎవడు ఫేమస్ చేసి చచ్చాడోకానీ 

పికాసోగారి వీపింగ్ వుమెన్నిచ్చి వాడి పెళ్లి  చేసి పారేయాలి.

ఇక రవివర్మ బొమ్మలంటారా ... 

దేవుళ్ళ బొమ్మలెలా అయ్యాయోకానీ

వాటిని చూసే ఎంటన్నకి  బ్రహ్మయ్య ప్రాణం పోసుండాలి.

మరి వడ్డాదిగారి బొమ్మల్లోనో...   వామ్మో! ఒంపుసొంపులన్నీ పూర్ణాలే !

సంతకంలోనూ అటూ ఇటూ సున్నాలే  మధ్యలో  గీత తప్ప !!

నఖశిఖ పర్యంతం దేన్నీ పరిపూర్ణంగా చూడలేం కదా!

ఫి(సె)క్సులో పడిపోవడం ఖాయమయ్యా మన్మధరావూ!

సరే... అందరికందరూ మహామహులే!

కాదనే కుంచె నాకెక్కడుంది గనక?

మరి బాపూ కుంచెలో  ఏముంది మహా!?!

అహ! ఏముందీ అంట?

ఇంత క్రేజు ఎందుకూ అంట?

ఒక్క గీత ... ఒక సీత

ఒక్క గీత... ఒక గీత

ఇంతేగా!

ఇంతకన్నా ఇంకేం చెప్పలేను మహాప్రభో...

ఆ గీత మీద ఒట్టు!

 

అత్తిలి అనంతు

 

 

 


బాపు గారి జన్మ దిన సందర్భంలో  మొదటి తారావళి

1/108

కమలమును  పట్టి  నాడొక్క కరములోన

పాశమునొక హస్తములోన పట్టి నాడు

కర యుగళమును జోడించి గణపతి తన

తల్లి దండ్రులకు ఘన  వందనము లిడెడు

బాపు బొమ్మకు వ్రాసితి పద్యమొకటి

 

2/108

 నెమలి వాహనా  జూపెద నెమ్మి నెపుడు,

తల్లి దండ్రులకు నిడు వందనము లిపుడు,,

ముదము తోడ నిత్తును నీకు మోదకమ్ము

ననుచు పలికెను   గణపతి,, ఘనత నొప్పు

బాపు బొమ్మకు వ్రాసితి పద్యమొకటి

 

3/108

పెద్ద వాడిని ముద్దాడి ప్రేమ తోడ

నెత్తు కొని తిరు గాడంగ నీకు న్యాయ

మా, బుడత నైన నాపైన  మనసు పెట్టి

కని కరము జూపుమనుచు నా స్కందు డడుగు

బాపు బొమ్మకు వ్రాసితి పద్యమొకటి

 

4/108 

శివుడ వనుచు నిన్ శైవులు చేయు పూజ

లను ముదముగాను, హరియని ఘనత తోడ

నర్చనములు  చేయునుగ  వైష్ణవులు భువిని,

ఘనత గల్గు హరిహరులు కలసి నట్టి

బాపు బొమ్మకు వ్రాసితి పద్యమొకటి

 

5/108 

తపము చేయుచుండెను గదా  త్ర్యంగటముడు

మలయ పుత్రిక  పూజలన్ మనసు బెట్టి

చేయు చుండ చిలుక రౌతుచెలిని కూడి

విడచె తనదు శరములను, విలువ గల్గు

బాపు బొమ్మకు వ్రాసితి పద్యమొకటి

 

6/108

శూల మొకచేత ఘనమైన  కాల సర్ప

ములను కర దోయి నందు, ననలమును

వేరొక కయిలోనిడుకొని  ఫ్రేంఖ ణంబు

జేయ, సతిసుతులు పరవ శించు  నట్టి

బాపు బొమ్మకు వ్రాసితి పద్యమొకటి

 

7/108

వేగిరమ్ముగ గంగమ్మ విష్ణు పదము

నుంచి దుముకుచు నుండగన్ , పెంచి తనదు

జటలను శివుడు బంధించ శరణ మనుచు

నొదిగె సురనది తలపైన, ముదము నొప్పు  

బాపు బొమ్మకు వ్రాసితి పద్యమొకటి

 

 

8/108

కూరుచుండ నా ముక్కంటి  కురువు పైన

సింహ వాహిని మనమున చెలిమి కూడి

నంది వాహనం బెక్కి యా నంద గతిని

తిరుగు చుండె గగనమందు, దివ్య మైన

బాపు బొమ్మకు వ్రాసితి పద్యమొకటి

 

9/108 

పశుపతి కరములో బెట్ట పార్వతమ్మ

తన సునిసితమౌ హస్తమున్  , దానవారి

చేసె  నిరువురకున్ పెండ్లి చెలిమితోడ

తాను సాక్షిగా నిలచి, మోదమ్ము నిడెడి

బాపు బొమ్మకు వ్రాసితి పద్యమొకటి

 

10 /108

శూలమొకచేతి లోబట్టి, జ్యోతి నొక్క

చేతను,ఢమరుకము నొక చేత దాల్చి

చిందు లేయుచు నుండగా శివుడు భూమి

యాకసములు ఘోరమ్ముగా నడలు నట్టి

బాపు బొమ్మకు వ్రాసితి పద్యమొకటి

 

11/108

శబ్దములకు,నర్ధములకు జనని జనకు

లైన పార్వతీ పరమేశ్వర యుగమునకు

ఘనత నొప్పు శబ్దార్ధ విజ్నానము లను

కోరి ప్రణతులనిడుచుండు గొప్ప దైన 

బాపు బొమ్మకు వ్రాసితి పద్యమొకటి

 

12/108

శివుని ధనువును విరువంగ చెలియ సీత

నోర కంట జూచుచు రఘు వీరుని గళ

మందు వేసెను వరమాల డెందమలర,

శివుని దీవెనల్ పొసగంగ సిరుల నిడెడి

బాపు బొమ్మకు వ్రాసితి పద్యమొకటి

 

13 /108

నోట వేలు నిడు కొనుచు, నీటి లోన

మర్రి యాకుపై  పవళించ  మాటు బట్టె

నాది శేషుడు,తొట్టిలోన నిదు రించ

మనుచు నూయల నూప, నీ మదిని దోచు

బాపు బొమ్మకు వ్రాసితి పద్యమొకటి

 

14/108

శుకపు దోయిని కాంచు  యశోద తనయ,

ముద్దు మాటలు నేర్పంగ  మోము చెంత

వాలె నిప్పుడుముదముగ పలుక వయ్య

నంద సుతుడా యని  సతము డెందమలరు

 బాపు బొమ్మకు వ్రాసితి పద్యమొకటి

 

15/108

చిన్ని కన్నయా  మానవాచిలిపి చేష్ట,

చేత బట్టినంత గొలుసు చిన్న మగును

గోల చేయగా వలదయ్య కొంటె కృష్ణ

యనుచు తల్లి ప్రేమను జూపు హ్లాదమిడెడి

బాపు బొమ్మకు వ్రాసితి పద్యమొకటి

 

 

16/108

చల్ల చిలుకుచు నుండ నా గొల్ల భామ

చెంత కున్ ప్రాకులాడుచు   చేరి జడను

లాగి వెను తిరుగంగ సులభముగ నవ

నీతమును దొంగిలించు నా ఖ్యాతి నిడిన

బాపు బొమ్మకు వ్రాసితి పద్యమొకటి

 

17/108

వేణు గానము నూదంగ పేయ మంద

లన్ని పరవశమును పొందె రమ్య గతిని

స్త్రీ పురుషులెల్ల ముదముతో చేరి తన్మ

యత్వమున్ లాస్య మాడుచు  హాళి నిడిన

బాపు బొమ్మకు వ్రాసితి పద్యమొకటి

 

18/108

మన్ను తింటివా బాలకా మనసు బెట్టి

నిజము మాటలాడవలయు నీరజేక్ష

యనుచు తల్లి కోరంగ లపనము తెరచి 

చూపె లోకమ్ము లన్నియు,చోద్యమైన

బాపు బొమ్మకు వ్రాసితి పద్యమొకటి

 

19/108

వేణు గానమునకు మది బిమ్మిటి గొనె

నీల వర్ణము కాంచగా  నెమ్మి కలిగె

నీదు వేణువు గొని పాట నేను పాడె

దెననె గోపిక ముదముగన్, దివ్య మైన

బాపు బొమ్మకు వ్రాసితి పద్యమొకటి

 

 

 

20/108

మురళి నాదమ్ము వినిపించ మోర లెత్తి

తన్మయత్వమును బడయు ధవళ లెపుడు

పాము లైన నాట్యమ్మాడు పరవశముగ

ననుచు మురిసెనా గోపిక, ఘనత నొందు

బాపు బొమ్మకు వ్రాసితి పద్యమొకటి

 

22/108

 

చిలకలకొలికి యేలనో చిర్రు‌ బుర్రు

లాడు చుండె నీ దినమున, రమ్య మైన

రేయి గడచి పో చుండె,హరిణ నయనకు

తెలుప మనెను గిరిధరుడు,చెలిమి యొప్పు

బాపు బొమ్మకు వ్రాసితి పద్యమొకటి

 

23/108

వందనములు తల్లీ నీకు డెంద మలర

పండి తోత్తములకు నాదు వందనములు

భరత మాతకు  నిరతము వందనములు

పెట్టు చుంటిననెను నాతి, ప్రేమ నొప్పు

బాపు బొమ్మకు వ్రాసితి పద్యమొకటి

 

24/108

అలసి పోతివి గిరిధరా ,నిలువ రింతు

రక్కసుని‌ శరమును బూని రణము లోన,

సత్య భామ మారె‌నిపుడు చండి వోలె,

భయము వలదగు గా భామ, జయము నొప్పు

బాపు బొమ్మకు వ్రాసితి పద్యమొకటి

 

 

26/108

జలధి లంఘించ వెడలెను జనక‌ సుతను

కాంచ ,కాయమున్ పెంచి యాకసమున నెగు

రంగ నంజనీ సుతుని పరాక్రమమును

కాంచి దీవెంచె‌ సురలెల్ల ఘనత నొప్పు

బాపు బొమ్మకు వ్రాసితి పద్యమొకటి

 

26/108

జలధి లంఘించ వెడలెను జనక‌ సుతను

కాంచ ,కాయమున్ పెంచి యాకసమున నెగు

రంగ నంజనీ సుతుని పరాక్రమమును

కాంచి దీవెంచె‌ సురలెల్ల ఘనత నొప్పు

బాపు బొమ్మకు వ్రాసితి పద్యమొకటి

 

27/108

భారతీ దేవి చల్లగా పామ రులను

కాచి నంతనే నెల్లరు ఘనత నొప్పు

పండితులుగ పేరును పొంది ప్రస్తు తింప

బడుదురు గాదె నిక్కమున్‌ గడన నొప్పు

బాపు బొమ్మకు వ్రాసితి పద్యమొకటి

 

 

 

సీ"

ప్రతిగీత పలికించు  ప్రణయంపు భావనల్

వంపు వంపునకొక్క సొంపు జూప

శృంగార భంగిమల్ సృజియించ మన్మధ

బాణముల్ చేబూను బ్రహ్మయతడు

ముఖ కవళికయందు మోహంబు విశదమౌ

నయనమ్ము లూసుల నందనాలు

కలము కదలగ నచలమౌను భావంబు

జీవముప్పొంగగ జిల్గులొలుక

 

తే"

రాధ గోపాలుర ప్రణయ గాధనందు

పావన రాగంబు హృదయాన బరగు వేళ

దైవ మానుష భేదమ్ము దరికి రాక

తన్మయత్వాన దరియించి ధన్యుడాయె

 

వాణిశ్రీ నైనాల

 

 

 

 

బాపు గారి పుట్టినరోజును పురస్కరించుకొని... నా అంజలి ఆయనకి..

 

నిన్న మధ్యాహ్నమే పుట్టాడేమో...  చూడనీయలేదు నిన్న...

ఆ మాతృమూర్తి, పురిటి అలసట తీరి, తేరుకుందేమో ఇప్పటికి...

ఇదిగో శిశువు ని  పురిటి గదిలోనుండి, బయటకి తెచ్చి ఊయేలతొట్టి లో పెట్టారిప్పుడే..

 

ఒక చేతి బ్రొటవేలు నోట్లో ఉంది... మరి..ఇంకొక చేతిలో అదేదో ఉందే హర్రే.. రే.. హాశ్చర్యేం... అది రంగుల కుంచె !!!.

 

ఏమి పనిమీద భూమికి నేగినాడొ ?

నుడువఁ నేర్చిన పిమ్మట నడుగవలయు!

 

కర్ణుడు కవచకుండలాలతో పుట్టినట్లు... కుంచె పట్టుకుని పుట్టి.. బాలభానుడిలాగా వెలిగిపోతున్న మన  బాల బాపు, మన ఆబాలగోపాలాన్ని, తన అజరామరమైన చిత్రకళతో,కళాచిత్రములతో  అలరించి, తరింపఁ జేయడానికే వచ్చాడని.. మనకి అలతి వసంతమ్ములలోనే  తెలియనుంది.

 

 

తే. గీ.

బాపు కుంచె గతుల్ సేసె బహు మహిమలు;

భామ యందముగానున్న "బాపు బొమ్మ"

వోలె ముద్దన్న నానుడి పుట్టెనిలను;

ముళ్లపూడి రమణ పాత్రములు నిరతము

నూపిరుల గొని మనతోడ నూసులాడు.

 


 

బాపు గళమున వేయ...... నా సీసమాలిక

 

బాలభానుని వంటి 'బాల బాపు'ని దెచ్చి

నూయేల తొట్టిలో నుంచి రిపుడె;

కర్ణుడెటుల నొప్పె కవచకుండలముల,

బాపు నటులె పుట్టె బ్రష్షు తోడఁ !

నెయ్యమని నుడువఁ,నిలువెత్తు "సాక్షి"గా

బాపూరమణ జంట పరగు నెపుడుఁ !

ముళ్ళపూడి రమణ "బుడుగు" గడుగ్గాయి;

రెండు జెడల సీత;రేలులొ ""ససి"";

ససిగారికి ముగుడు; సరసంపు ప్రేవేటు;

సీగాన పెసునాంబ; సీత నాన్న;

అల్లరి బాబాయి; అమ్మ, నాన్నయు, బామ్మ;

నిజెము జెట్కా బండి; విజిలు వేయు

వింజెము డైవరు; ప్రేవేటు మాష్టారు;

ప్రక్కింటి పిన్నిగా;రామె ముగుడు;

లావాటి పిన్నిగా;రామె ముగుడు గారు;

పాపాయి ఊంగాలు; బళ్లొ పడుట;

డిక్టేష్టివాడును;టెంకి జెల్లల గుండు;

ఫోకిరీవాడులు; బూడ్సు రైలు;

బుడుగు పాలబడిన బడుగు జీవులు- బలే

"గ్రూపు కుఠో"  దిగ, గూరు చుండ్రి !

రాధ-గోపాళంలు- నాదిగా నందరూ

బాపు కుంచె కతనె బ్రతుకు గొనిరి !!

వాలు జెడల పలు వాలకముల జూడు

"బాపు బొమ్మల" సుంత బ్రతిమ లాడి !

సంపంగి జడలును;స్వర్ణ పుష్ప జటలు;

వాలు జడలు; మల్లెపూల జడలు;

నాగుపామును బోలు నల్లని వేణుల

రుసరుసమని కొన్ని బుసలు గొట్టు;

"ముడి" పదార్థము తోడఁ మూడడుగులె యుండు

 

"జడ" పదార్థము తోడఁ సరసమొప్ప,

వాలు జడయనెడి గాలము విసరుచు,

వనిత వొయ్యారముగ వలపు దెలిపి,

జావళి పాడగా, "జడపదార్థ" మెదియున్

"పరుషమౌ" యెంతటి పురుషుడైన

చలియించి, జలమయి, "సరళ మౌ" క్షణమున !

"పరుషములగు"  నిట్టె  "సరళ ములుగ !!"

వాలు జడలు సేయు నలజడులంబడి,

దిమ్మ దిరుగనట్టి  ధీరుడెవడు ?

గోళీల మొదలు భూగోళ సమస్తపు

వస్తుతతిని గీసె "వాహ్వ!!" యనఁగఁ ;

కాటుక కళ్ళను, కానరాని నడుము,

నొంపుసొంపు హరువు నొయ్యారులకలది,

మదన బాధల పెంచె  మగ పుటుకకు !

చలనచిత్రములను చవులూర జిత్రించి,

సాటి రారెవరంచు జాటి చెప్పె !!

దైవ మందిరముల దీటుగా నిలువంగ

దేవుళ్ళ బొమ్మలు దిద్ది తీర్చె!

కోటి దేవతలకు గుర్తింపునిచ్చెలే

"అరువు" గొనగ వారె "యాస్తికత"ను !

కార్టూనులను గీసి, కడుపు చెక్కలు చేసె;

నేగి దివికిని,, మా యెదల నిలచె !!

 

గీ.

పాత్ర లెవ్వియైనను గాని ప్రాణములనె

బోసెగా బాపుయను బ్రహ్మ ! పొగడ తరమ

బాపురే ! ఆకట్టుకొనెడి బాపు గీత ?

బాపుగారికి సాటి యా బాపుగారె !!!

 

 

ముడి పదార్థము...

అతివలు సిగ ముడి పెట్టుకోవడానికి కావలసిన ముడిపదార్థం... జడ అనే పదార్థమే.

 

జావళి... శృంగార గీతం.

 

స్నేహానికి నిర్వచనం...ఆప్త మిత్రులు .. ఆ బాపూ రమణులు..పైగా వియ్యంకులు... బాపుని స్మరించి,ముళ్ళపూడిని విస్మరిస్తే... స్నేహాన్ని అవమానించినట్లే అని... స్నేహం విలువ తెలిసినవాణ్నిగా... వారిని కలిపే.... తలచుకున్నా..

 

వట్టెం వెంకట రమణ

 


 

బాపు గారి గురించి

 

ఏం చెప్పాలి? ఎలా చెప్పాలి?

చందమామ వెన్నెలమ్మా లా

మన జీవితాల్లో ఒక భాగమై పోయారు బాపు,రమణలు

అందాల రాముడిని, సొగసరి సీతమ్మని,

అల్లరి కన్నయ్యని, గడుసరి సత్యను,

తుంటరి బుడుగుని, గడుగ్గాయి శీగాన పెసూనాంబని,

అన్నీ తెలిసిన బామ్మని, ఒక్క మాటలో చెప్పాలంటే

ఇహ పరాలను గీతల్లో బంధించి చక్కని

ప్రియదర్శిని గా మనకి ఇచ్చేసి వెళ్లారు.

బాపుగారికి జన్మదిన  శుభాకాంక్షలు

చెప్పుకుంటూ  ఇదిగో  ఈ చిరు పద్య నైవేద్యం

 

కోటి భావాల నొకచోట గూర్చునొక్క

గీత నందు !! పడతి హృది గెల్వ వచ్చు

బాపు బొమ్మయంచు పొగడి!! బామ్మ నైన,

భామ నైన చక్కగ చూపు బాపు కుంచె!!

 

రమ, కంకిపాడు 

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...