3, డిసెంబర్ 2020, గురువారం

కార్తీక సోమ వారం, విశ్వ నాధుని స్మరణము విభవమొసగు, 30.11.2020


 


30.11.2020

కార్తీక సోమ వారం

ప్రణాళిక

విశ్వ నాధుని స్మరణము విభవమొసగు

 

ఈ తేటగీతి పద్య మకుటం తో ఈ కార్తీక  సోమవారం శివార్చన చేయుటకు పద్య కుసుమాల మాలలు సమర్పించ గలరు

 

ఇదే పంక్తితో పద్య / వచన కవిత నాలుగు నుండి ఆరు పాదాలలో మీ పూరణ పంపించగలరు.

మనమందరం  శతాధిక పద్యమాలికతో శివార్చన చేద్దామా

కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలతో

 

 

తరువోజ

వామదేవుడ! నీకు వందన ములివె పరమేశ్వరా! సుప్రభాత సేవలివె

శ్యామకంతుడ! నీకు హారతు లివియె సాంబశివుడ! శోభి తార్చన లివియె

 గాములదొర! నీకు కైకర్యములివె  కరములు జోడించి గారవించంగ

హేమకేశుడ! మాకు యింపు గల్గించి ఎలమిగూర్చి నిలుపు మీశ్వరా!స్వామి!

వెంకట్.సి హెచ్

 


 

తే.గీ. 01

శివుని పాదపద్మయుగళ సేవజేయు 

భాగ్యమీ పద్యకుసుమంబు వాఙ్మయమ్ము

స్తవములందు నే పూజింతు; జ్ఞానమిమ్ము 

విశ్వనాధుని స్మరణము విభవమొసగు

తే.గీ. 02

ప్రణవనాదము యోగమై ప్రతిదినమ్ము 

దివ్యమౌ జ్ఞాన సంప్రీతి భవ్యరీతి  

పరమశుభమగు భవదంఘ్రి వరములిమ్ము  

విశ్వ నాధుని స్మరణము విభవమొసగు

 

తే.గీ. 03

జ్ఞానదాతా ! వరమునిమ్ము చంద్రధరుడ !        

పరమబంధువౌ వాగర్థ వాఙ్మయమ్ము  

సంచితార్ధమౌ జ్ఞానముల్ వాంఛితమ్ము  

విశ్వనాధుని స్మరణము విభవమొసగు

 

తే.గీ. 04

ధృతివి నీవే శివా ! సదా దేవదేవ ! 

మోక్షమేమొ తెలియదయా ! మోహములను 

వీడమంటు కోరుకొనగ ప్రేమ మూర్తి   

విశ్వనాధుని స్మరణము విభవమొసగు !

 

తే.గీ. 05

పాహిమాంపాహి ధూర్జటీ ఫాలనేత్ర !

జన్మసాఫల్యమౌ జ్ఞాన చక్షువులను 

వరములై  పరమేశ్వరా భవ్యరీతి         

విశ్వనాధుని స్మరణము విభవమొసగు !

తే.గీ. 06

లూత నేర్పించు యోగములు వరమేను 

కరికి, భుజగమునకు నీవు వరములిచ్చి 

తిన్నడికి మోక్షమీయంగ దివ్యరీతి     

విశ్వనాధుని స్మరణము విభవమొసగు !

 

తే.గీ. 07

సకల జగతిలో మర్మముల్ సారమెంచి 

నీ పదాబ్జములందున ప్రాపుమయ్య    

సకల శుభములు వరమీయు సన్నుతింప    

విశ్వనాధుని స్మరణము విభవమొసగు !

 

తే.గీ. 08

సకలశాస్త్రముల్ తత్వముల్ సారమందు 

చేతనా చేతనాత్మక రీతులందు  

నిత్యసాయుజ్య మందున సత్యమందు 

నిలుపు శంకరా మనసులన్ గొలువు దీరి 

విశ్వనాధుని స్మరణము విభవమొసగు !

 

తే.గీ. 09

కాయికమ్మౌ నమస్కారమీయలేను   

వాక్కుతో జేయఁగాఁ స్తుతుల్ చక్కగాను 

కనులతో దివ్యరూపముల్ గనగలేను 

విశ్వనాధుని స్మరణము విభవమొసగు !

 

తే.గీ. 10

ముక్తిమార్గము సత్యమౌ యుక్తవిధిని  

ముదము తోడను నీయందు హృదయముంచి 

కోమలాంఘ్రి యుగములందు కామితమిది 

విశ్వనాధుని స్మరణము విభవమొసగు !

 

తే.గీ. 11

ఉత్తమోత్తమ గుణముతో యుక్తమైన 

సారసంపదల వరము సాంత్వనమున

క్ష్మాంబరములందు పూర్ణమై సంచరించు 

హరివిధాతల కందని పరమశివుడ  

విశ్వనాధుని స్మరణము విభవమొసగు !

తే.గీ. 12

నా హృదయమున "మదవారణముగ" నీవు;   

ప్రథిత దీధితుల్ శోచిస్సు త్వరితగతిన   

నెల్లపుడు నా మ నసు సృజియించు గాక   

విశ్వనాధుని స్మరణము విభవమొసగు !

 

తే.గీ. 13

దురిత ప్రారబ్ధమైనట్టి దుఃఖములను !

మోక్ష ప్రదమగు నీ పాదముల్ స్మరణము 

స్మృతులు సంజాతమౌ శివా హృదయమందు !

విశ్వనాధుని స్మరణము విభవమొసగు !

తే.గీ.II 14

అమలమౌరూపమోంకారము మహితమది   

పార్వతీ వల్లభా శివా పావనమగు

దివ్య రూపమ్ము ప్రణవమై తేజరిల్లు 

విశ్వనాధుని స్మరణము విభవమొసగు !

 

తే.గీ. 15

పుష్పములు హృదయములోన  భూషణములు  

హారతులవి పోకార్చు విహ్వలములన్ని  

చిన్మయమ్ముల రూపమ్ము చింతదీర్చు 

విశ్వనాధుని స్మరణము విభవమొసగు !

 

తే.గీ. 16

పరమభక్త మహిత హిత భావనములు  

మూఢ గూఢ మోహమువీడి మోక్షమిమ్ము  

ధర్మ మర్మముల్ సారము దారిజూపు  

విశ్వనాధుని స్మరణము విభవమొసగు

 

తే.గీ. 17

కరణదుఃఖమాలిన్యముల్ కడుగువాడ   

మననమథిత శివరహస్య మండనమ్ము  

దురిత హరుడవై శంకరా వరములిమ్ము 

విశ్వనాధుని స్మరణము విభవమొసగు

తే.గీ. 18

అనవరతమైన నీ చరణాబ్జములని 

మనసులో సదా ధ్యానింప మంత్రమదియె !

పావన పదపద్మయుగముల్ భాగ్యమదియె  !

విశ్వనాధుని స్మరణము విభవమొసగు

 

తే.గీ. 19

అమల సుకృతార్ధములనిమ్ము; శ్యామకంఠ !

దివ్య ఫలముల సేవ్యమౌ దేవ దేవ !

నాదు మనసున క్లేశముల్ సేద దీర్చు!      

విశ్వనాధుని స్మరణము విభవమొసగు !

 

తే.గీ. 20

నదులు సాగరుజేరఁగా కదలునట్లు 

భక్తిమార్గమున్ జ్ఞానసంప్రాప్యమొందు  

ముక్తినొసగెడు యుక్తియే భక్తియనగ     

విశ్వనాధుని స్మరణము విభవమొసగు

 

కస్తూరి శివశంకర్

 

 

 తే.గీ. 21

 

శంకరుని దివ్యనామమ్ము శంకలన్ని 

దీర్చు భవదీయ భక్తియై దివ్యరీతి 

కామితార్దపు మోహముల్ కారణములు 

తెలియవయ్యా శివా మాకు ! ధృతివి నీవు

విశ్వనాధుని స్మరణము విభవమొసగు !

 

వై శ్రీదేవి

 

 

పరమశివునికి పద్యార్చన

తే.గీ. 22

మాసములయందు నుత్కృష్ట మాసమిదియె

పాపహరణమ్ము గావించు పావనముగ;

చిత్తశాంతి గల్గ జనుల చింత దొలగి

విశ్వనాధుని స్మరణము విభవమొసగు!

 

తే.గీ. 23

సోముడే సంచరింపగ శుభకరముగ

కృత్తికందు; కార్తికము సద్వృత్తి  బెంచు;

హరిహరాదుల బూజింప హర్షమొప్ప

విశ్వనాధుని స్మరణము విభవమొసగు!

తే.గీ. 24

మదిని బాధించు యాంధ్యము న్మగుడజేసి

శాంతి నొసగుమయా మానసమ్మునకని

దీపముల వెలిగించగ దేవళముల

విశ్వనాధుని స్మరణము విభవమొసగు!

 

తే.గీ. 25

ఆదిదేవుడే కొలువగు నాలయముల

దీప తోరణంపు ప్రభల దీప్తి తోడ

పుణ్య ఫలములే పొంగారి పొదలుచుండ

విశ్వనాధుని స్మరణము విభవమొసగు!

 

తే.గీ. 26

ఓం నమశ్శివాయ యనగ నోజ గూర్చి

మంగళకరమైనది గాను మహిమ జూపు

నెపుడు పంచాక్షరీ మంత్ర మెలమి తోడ

విశ్వనాధుని స్మరణము విభవమొసగు!

 

తే.గీ. 27

నిండు మనమున వేడుచు నిర్మలముగ

పురహరుని విభూతిని దాల్చి పొల్పుగాను

భక్తకోటి యెల్ల సతము పరవశించ

విశ్వనాధుని స్మరణము విభవమొసగు!

తే.గీ.II 07

 బిల్వదళముల సేకొని చెల్వుమీర

మలహరుని  పూజ సల్పగా మనము నిల్పి

యలఘు సిరులు తానొసగ నత్యద్భుతముగ

విశ్వనాధుని స్మరణము విభవమొసగు!

చల్లా దేవిక.

 

28 

ధర్మమే శివుడు

సమగ్రత,  నిజాయితీలతో

చేసుకొనే పనియే దైవము, ధర్మమూ. అయిననూ

ఆపదలు , అవాంతరాలు , కష్ట నష్టాలలో

విశ్వనాధుని స్మరణము విభవ మొసగు

జి మురళీ మోహన్ రావు


 

29

గంగ తీర్థము తెచ్చి లింగ మభిషవము

సేయ గదలచి సూడగ శిరమున నిలి

చిన సురనదము నవ్వంగ చిన్నబోతి

విశ్వనాధుని స్మరణము విభవమొసగు

 

30

గరళ తాపముపశమింప కాల కంఠ

మునకు శీతల చందనం పులమగదల

చి హిమ శిఖపై నిను గనియె చిన్నబోతి

విశ్వనాధుని స్మరణము విభవమొసగు

 

31

మణులతోడ నీదు గళసీమ సవరించ

గ దలచి మెడపయిన చూడ కంధరమున

సీదరము దెస నాదన్న చిన్నబోతి

విశ్వనాధుని స్మరణము విభవమొసగు

 

32

తెల్లమల్లెల తోడను దేవ నీదు

కొప్పు భూషించ గానెంచ కొప్పునున్న

సితకరుని ధవళిమ గాంచి చిన్నబోతి

విశ్వనాధుని స్మరణము విభవమొసగు

 

33

వెండి కొండపై కొలువైన వెండి రంగు

వేల్పునకు దిష్టి చుక్కను పెడద మంటె

శితిగళమున మచ్చను జూసి చిన్నబోతి

విశ్వనాధుని స్మరణము విభవమొసగు

 

34 

నాట్య కళతోడ మెప్పించ నాట్య ప్రియుడి

నవగతంబయ్యె నాకును నాట్య రాజె

శివుడని, తెలివి లేమికి చిన్నబోతి

విశ్వనాధుని స్మరణము విభవమొసగు

 

35

అన్ని రుచులతో నీకును యారగింప

అవని జనుల యాకలి బాపు యన్నపూర్ణ

ఇంతియని తెలియంగను చిన్నబోతి

విశ్వనాధుని స్మరణము విభవమొసగు

 

36

చీని చీనాంబ రాలుదెచ్చి సవరింప

పులి యజినముతోడ తిరుగు పురములన్ని.

శివుని గూఢత తెలియక చిన్నబోతి.

విశ్వనాధుని స్మరణము విభవమొసగు

09

చిన్న బోతినని మరింత చిన్న బుచ్చ

వలదు దేవ, నీ చరణము వద్ద నాకు

నింత చోటివ్వు చాలదే నిహము పరము

విశ్వనాధుని స్మరణము విభవమొసగు

 

37

భక్త సులభుడందురు నిను పంచవదన.

నీదు తత్వము దెలియక  నీవు యర్ధ

మవక పోతివి. తప్పును మరచి, బ్రోచి

నాదు మనమందిరంబున నుండు సామి.

విశ్వనాధుని స్మరణము విభవమొసగు

 

38

గంగ భారము బరియింప గాదని భువి

తెలుపగ జడ దారిని చూపి దేవవేల్పు

చిరునగవుతోడ భరియించె సిద్ద యోగి.

విశ్వ నాధుని స్మరణము విభవమొసగు

 

39

మల్లికార్జున కిత్తును మల్లెపూలు

జంగమయ్యకు నిత్తును జాజి పూలు

పంచ శిరునకు నిత్తును బంతి పూలు.

విశ్వ నాధుని స్మరణము విభవమొసగు

 

40

బాండ శుద్దిని కోరని   పారమాత్మ

ఆత్మ శుద్ధిని కోరెడి యాది దేవ

చిత్త శుద్దున్న చాలను సిద్ధ యోగి

విశ్వ నాధుని స్మరణము విభవ మొసగు

(కొన్ని పదములు వేమన శతకపు ప్రేరణ)

 

41

ఆదిశంకర, యీశ్వర, ఆది దేవ,

కాల కంఠుడ, చండీశ, కాల కాల,

జంగమయ్య, త్రినయనుడ, చంద్ర శేఖ

, నటరాజ, పశుపతి,  బైరవ, మహేశ,

పంచముఖ, మహా కాలుడ పాహి పాహి.

విశ్వనాధుని స్మరణము విభవమొసగు

 

వెంకటప్పయ్య సూరె

 

 

తే.గీ. 42

శంకరాయని పిలువంగ సంతసముగ

వెన్ను కాచగ వచ్చెడి వేల్పు తాను

వేడు కొంటివ నిరతము విశ్వసముగ

విశ్వ నాధుని స్మరణము విభవ మొసగు

 

తే.గీ. 43

పేరు దలచిన చాలును ప్రియము గాను

రక్ష నీవని బల్కిన లక్షణముగ

సాయమీయంగ వచ్చును సాంబ శివుడు

విశ్వ నాధుని స్మరణము విభవ మొసగు

 

తే.గీ. 44

అంగజహరుడు, యభవుడు, యాది బిక్షు

నీలకంఠుడు, నీలలోహితుడు వాడు

సంబ రమ్ముగ బల్కెడి సాంబుడైన

విశ్వ నాధుని స్మరణము విభవ మొసగు

 

తే.గీ. 45

శివుని బూజించు మనసున చింతలేక

భువిని పాలించి నిక్కము పుణ్యమిడును

అతని యాసీసులెప్పుడు యాస దీర్చి

విశ్వ నాధుని స్మరణము విభవ మొసగు

 

తే.గీ. 46

సతియె పార్వతి తోడుగ సంతసముగ

అర్ధ నారీశ్వ రుండాయె నార్తి దీర్చు

ఆది దంపతు లెల్లర నాదుకొనును

విశ్వ నాధుని స్మరణము విభవ మొసగు

 

కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి

 


 

తే.గీ. 47

బిచ్చ మడుగువాడేమిచ్చి బ్రీతి దీర్చు

బూడిద, గరళమ్ములిడును భూతరాట్టు

యాది భిక్షువు కొసగగ నహము భిక్ష

విశ్వనాధుని స్మరణము విభవమొసగు

 

తే.గీ. 48

గోఘృతము దహించగనిల గూర్మిగూర్చ

తామసహర దివ్వెయగును తత్వమెరుగ

హరిహరుల గొల్వ భక్తుల కభయ మీయు

విశ్వనాధుని స్మరణము విభవమొసగు

 

తే.గీ. 49

హరహరయని పిలువ భవహరముచేయు

భక్తి మార్గము నడిపించు ముక్తి పథము

దీక్ష నెరపు మనుజులకు మోక్షమిడును

విశ్వనాధుని స్మరణము విభవమొసగు

వాణిశ్రీ నైనాల

 

50  

 వచన కవిత,

గాయత్రీ మంత్ర స్మరణం  ఏకాగ్రత నొసగు,

గీతా పారాయణం కర్తవ్య దీక్ష నొసగు,

ఆంజనేయ దండకం భయమును తొలగించు,

విశ్వనాధుని స్మరణము విభవ మొసగు.

గాంగేయ శాస్త్రి, రాజమండ్రి

 

 

తే.గీ. 51

కార్తి కము నందు సేతురు యార్తి తోడ 

శివుని పూజలు విరివిగ భువనమందు 

వేద కాలము నుండియు చోద బాపి 

విశ్వనాధుని స్మరణము విభవమొసగు

 

తే.గీ. 52

శంభు తత్వమెరుగుమొకో శంక మాని 

విష్ణు తత్వము గాంచుము విశ్వమెల్ల 

అమృతమద్వైతమానందమంద జేయు

విశ్వనాధుని స్మరణము విభవమొసగు 

 

తే.గీ. 53

ధర్మ మార్గమొసగునిల ధార్మికతను 

చింత మాన్పియొసగునదే చిత్త శుద్ధి 

బాధలు మరచి నడువరే భాసురముగ 

విశ్వనాధుని స్మరణము విభవమొసగు 

 

తే.గీ. 54

నీర క్షీరముల్ కనుగొను నేర్పు గల్గు 

హంసకీరీతి జ్ఞానము హరియె నొసగె 

మంచి చెడులన్ దెలుపునీవు మానవులకు 

విశ్వనాధుని స్మరణము విభవమొసగు

 

తే.గీ. 55

యజ్ఞ యాగముల్ జేసెడి యాజులకును 

సాధు పుంగవులకునిల సంత సముగ

సోమవారము కొలువగ సోమ నాథు 

విశ్వనాధుని స్మరణము విభవమొసగు

 

జైకర్ విశ్వేశ్వర్ టోణ్ పె, థానే, ముంబయి

 

 

56 

శంకరున్గొల్వ బత్రియు జలము తోడ

భక్తి పారవశ్యమునందు భక్త జనులు

శక్తి మేరగ ప్రార్థింప సంతతంబు

విశ్వనాధుని స్మరణము విభవమొసగు..

 

57 

గరదమున్ మ్రింగె గావగ గరళకంఠు

భస్మధారి నుమాపతి బరమ శివుడు

కోరి నంతనె పరుగిడు గోర్కె దీర్చ

విశ్వనాధుని స్మరణము విభవ మొసగు..

 

58 

ఘోర తపసుకు రావణు గోరి వచ్చె

నల హరిశ్చంద్రుని గొసగె నంత వరము

వాసి కెక్కిన క్షేత్రంబు వారణాసి

విశ్వనాధుని స్మరణము విభవ మొసగు...

 

59 

నమక చమకంబు జదువగ నవ్వు తుండు

పత్రి ధూళియు నుదకంబు పైన వేయ,

చిన్న పిల్లల జందంబు చేర దీయు

విశ్వనాధుని స్మరణము విభవ మొసగు...

 

60 

జింక చర్మము చుట్టంగ శివుడు గాదె

నీళ్ళు నెత్తిన బోయంగ నిజము గాదె

బండరాయన లింగంబె, ఫలము లివ్వ

విశ్వనాధుని స్మరణము విభవ మొసగు...

 

61 

నీల కంఠుడు , నీల లోహితుడు వాడు

యనుచు జక్కగ ప్రార్థించె హరుని గూర్చి,

**చక్రవర్తి సార్ వేడగ శక్తి మేర

విశ్వనాధుని స్మరణము విభవ మొసగు...

 

62 

కొబ్బరి, యటుకులు, బెల్లము గోరి తెచ్చి

గణపతినిగొల్వ  ముదముతొ ఘనము గాను

జూచి, ముదమొంది పలికెడు శూలపాణి

విశ్వనాధుని స్మరణము విభవ మొసగు...

 

63

ఆది దంపతులే మనకాది గురువు

లయ్యె, రుద్రుండు రక్కసుల్కశనిపాత

ముగను, లంఘించదప్పదు శుక్రుడైన

విశ్వనాధుని స్మరణము విభవ మొసగు....

 

64

అన్నపూర్ణగ పార్వతి యవతరించె

వారణాసిన వెలయంగ పాప హరుడు

కోరినంతనె వరమిడు కోర్కె మీర

విశ్వనాధుని స్మరణము విభవ మొసగు...

 

65  

 పెద్దలకు మనవి... చక్రవర్తి హరిశ్చంద్రుడు సతీ సుతుల సమేతంగా, నక్షత్రకుని వెంట అడవులలో విశ్వామిత్ర పరీక్షలకు నిలబడి, ప్రయాణిస్తున్న మార్గ మధ్యమున కాశీ విశ్వేశ్వర దేవాలయ శిఖరాగ్రము గని, వారణాసి మహాత్మం గురించి చెప్పిన ఈ గొప్ప పద్యం శ్రీ బలిజెపల్లి వారు ' సత్య హరిశ్చంద్ర ' పద్య నాటకంలో ఎంతో గొప్పగా వర్ణన చేశారు.

అందరికీ మరొక్కసారి ఆ పద్యాన్ని గుర్తు చేయాలనే తలంపుతో, ఇక్కడ యదాతథంగా అందిస్తున్నాను, ఆదరించగలరు.

 

66

భక్త యోగ పదన్యాసి వారణాసి

భవధురిత శాస్త్రముల వాసి వారణాసి

స్వర్ణదీతట సంభాసి వారణాసి

పావన క్షేత్రముల వాసి వారణాసి......

 

పి.ఎల్.నాగేశ్వరరావు 

 

 

పావన కార్తిక మాసంలో పరమ శివునికి పంచ పద్య కుసుమార్చన.

 

తే.గీ. 67 

పావనంబైన కార్తిక పర్వ మాస

మందు నియమ నిష్ఠల బూని యాలయాల

దీప రాశి వెలుగ జేయ పాపహరుని

విశ్వనాధుని స్మరణము విభవ మొసగు.

 

తే.గీ. 68

అర్ధ దేహము నందున నంబ నిలిపి

ఆ భగీరథు వాంఛను నాలకించి

ఉరక లెత్తు గంగమ్మను శిరము దాల్చు

విశ్వనాధుని స్మరణ ము విభవ మొసగు.

 

తే.గీ. 69

అల్పమౌ నాయువు గలుగు నా మృకం డ

పుత్త్రు  యముని పాశపు శక్తి పొల్లు గాగ

కరుణ దీర్ఘాయు వుం జేయు గరల కం టుడు

విశ్వ నాధుని స్మరణ ము విభవ మొసగు.

 

తే.గీ. 70

సురలు నసురులు నేకమై సుధను పొంద

క్షీర సాగర మధన ము చేయు వేళ

విషము పుట్ట జగతి గావ విషము మ్రింగు

విశ్వ నాధుని స్మరణ ము విభవ మొసగు.

 

తే.గీ. 71

ఆత్మ లింగము దక్కె నాడసుర పతికి

అమరె మోక్ష మ్ము శ్రీ కాళ హ స్తులకును

తార తమ్యము లెరుగ ని ధన్య మూర్తి

విశ్వ నాధుని స్మరణ ము విభవ మొసగు.

డి.రామ నాగేశ్వరరావు,భీమవరం,ఆంధ్ర ప్రదేశ్.

 

 

తే.గీ. 72

అర్ధభాగ మొసగి నావు అమ్మ కీవు

నఖిల జగముల కెల్ల నీవయ్యవయ్యె

కావమని వేడు కొందు గంగాధరుడ్ని

విశ్వనాధుని స్మరణము విభవ మొసగు

 

తే.గీ. 73

శంకరా యని వేడగా సకల మిచ్చు

భవుడు తానై వరములిడు వాజసనుడు

తాండవ ప్రియుని జూచెద తన్మయముగ

విశ్వనాధుని స్మరణము విభవ మొసగు

 

తే.గీ. 74

బిల్వ పత్రమొకటి చాలు వేరడగవు

గంగ జలము తెచ్చిన పొంగు గౌరి పతియె !!

భస్మ హారతి చాలుగా ప్రమధ నాధ !!

విశ్వనాధుని స్మరణము విభవ మొసగు

 

రమ,కంకిపాడు.

 

 

తే.గీ. 75

 నాగభూషణుని మదిలో నమ్మినాను

నరుల కెపుడును బడయదు నలత గూడ

పరమ పావన మంత్రము బలికి జూడ

విశ్వనాధుని స్మరణము విభవ మొసగు

 

 

తే.గీ. 76

నీలకంఠుని నెపుడును నీటనిలిపి

తాపమనునది బోగొట్టి దలచుకొన్న

జాగు సేయక గాపాడు జంగమేశు

విశ్వనాధుని స్మరణము విభవ మొసగు

 

తే.గీ. 77

సగము దేహము తానైన సతిని జూచు

సంగమేశ్వర స్వామిని శరణు వేడ

సకలదోష నివారణ సంభంవించు

విశ్వనాధుని స్మరణము విభవమొసగు.

 

హేమలత

 

 

తే. 78

మలహరు పొగడు కవనము మధుర మెపుడు

కాశి నాథుని శ్రవణము కమల మెపుడు

శూల ధరు నామ గానము శుభము నెపుడు

విశ్వనాథుని స్మరణము విభవ మొసగు..

(తప్పులు ఉన్న సూచించ వలసినది)

 

CA కె మల్లికార్జునరావు

 

79

పింగళుని పూజ జేయంగ ప్రియముగాను 

కావ్యసుధలతో కఱకంఠు ఖ్యాతి నెంచి 

మూడుకన్నుల దేవర ముదమునొందు

విశ్వ నాధుని స్మరణము విభవమొసగు

 

80

అన్నపూర్ణ ఆకలి బాధ యపహరించె   

హేమకేశుని కొల్వంగ హేలతోడ   

గజముఖుని సన్నుతింప విఘ్నము నశించె !

విశ్వ నాధుని స్మరణము విభవమొసగు

 

81

త్రినేత్రుడైనా చల్లని చూపువాడు

బంగరుమనసున్న భోళాశివుడు

భువనేశ్వరుని భక్తితో కీర్తించ

విశ్వనాథుని స్మరణము విభవమొసగు

 

82

అన్నము నీరము అతని సతులు

జ్ఞానమూ-ధైర్యమాతని సుపుత్రులు

బ్రహ్మ-విష్ణువు ప్రాణహితులై యున్న

విశ్వనాథుని స్మరణము విభవమొసగు 

 

విష్ణుప్రియ

 

83

పద్యవిద్యా పటిమలన్ని పావనముగ

మాకొసంగి నిన్ సేవింప మహిమ నివ్వు

ధూర్జటి! నిను వేడుకొనగ ద్యోత మివ్వు

విశ్వనాధుని స్మరణము విభవ మొసగు

 

84

మమ్ము పాలించెడి హరుడా! సమ్ముదముగ

నిన్ను పరిచరించు తుమయ్య నీలకంఠ

జ్ఞాన సంపదల నొసంగు సమధికముగ

విశ్వనాధుని స్మరణము విభవ మొసగు

 

85

అమృత మథనమందు భవుడై యవతరించి

న గరళము నారగించంగ జగము నుద్ద

రించినట్టి మహేశ్వరా! యీడ లివియె

విశ్వనాధుని స్మరణము విభవ మొసగు

 

86

జలముతో నభిషేకింప సంతసించి

వరము లొసగిడి జడదారి! వందనంబు

దినదినము గొలిచెదమయ్య దీప్తి నిమ్ము

విశ్వనాధుని స్మరణము విభవ మొసగు

 

87  

పొందికగ నీశ్వర నీకు పూజ సేయ

జ్ఞాన మార్గము లొసగి యజ్ఞానము దొల

గించి వెలుగు నిచ్చితివట యింపుగాను

విశ్వనాధుని స్మరణము విభవ మొసగు

 

88 

భూరి! పంచాక్షరీ మంత్రమును స్మరింప

సకల పాపముల్ దొలగించి సంతసంబు

గూర్చుతువట మమ్మునిలుప కొలుపులివియె

విశ్వనాధుని స్మరణము విభవ మొసగు

 

89

ధ్యాన నిష్ఠలో నుండెడి యఖిల గురుడ!

మమ్ము నీ పథ మందున ముమ్మరముగ

నిలిపి జ్ఞాన దీప్తి నొసంగు నీలకంఠ!

విశ్వనాధుని స్మరణము విభవ మొసగు

 

90

బిల్వ పత్రముల్ గొనితెచ్చి ప్రీతిగాను

పూజసేయ జిజ్ఞాస వైభోగ మొసగి

గాంచుమయ్య మమ్మిల నందు గరళకంఠ!

విశ్వనాధుని స్మరణము విభవ మొసగు


91 

ఎసగ కార్తీక దీపము లెట్టి నిన్ను

పరిభజింప నజ్ఞానపు పంకములను

తలగ బెట్టి కాంతి నొసంగు త్ర్యంబకుండ!

విశ్వనాధుని స్మరణము విభవ మొసగు

 

92

సర్పముల నభరణములై పార్పరమును

పులుముకొని సృష్టి మర్మము తెలుపు నట్టి

ప్రమథ నాధుడా! నీకివే వందనములు

విశ్వనాధుని స్మరణము విభవ మొసగు

 

వెంకట్.సి హెచ్

 

 

93

జపతపంబులనెఱుఁగని జడుడ నేను

శివుని పూజలు సలుపగ చేవ లేదు

ప్రాణమున్నంత వరకును పట్టు విడని

విశ్వనాథుని స్మరణము విభవ మొసగు

 

 

94

శివ శివా యన్న తొలగును చింత లన్ని

హరహరా యన్న పాపాగ్ని నారిపోవు

భవ భవా యన్న బంధముల్ వదలిపోవు

విశ్వనాథుని స్మరణము విభవ మొసగు

 

95

శంకరాయని పిలువ మా శంక దీర్చు

భార్గవా యని పిలువగా భాగ్యమిమ్ము

మౌన బోధలు చేయుచు జ్ఞానమిమ్ము

విశ్వనాథుని స్మరణము విభవమొసగు

 

96

దండమొక్కటే చాలునీ దయను పొంద

దండనములేలరా శివా తండ్రి నీవు

యండ నీవుండి తొలగించు గండములనె

విశ్వనాథుని స్మరణము విభవ మొసగు

 

97

కండ గలదను గర్వమ్ము కలుగనీకు

ప్రజ్ఞనే ద్రుంచు ప్రఖ్యాతి వలదు దేవ!

నీదు  కరుణయే చాలును నీల కంఠ!

విశ్వనాథుని స్మరణము విభవమొసగు

 

98

బూది పూతల విభుడిచ్చు భూరివరము

నీటి చుక్కొకటే చాలు నీలకంఠ!

నుతులు చేయగ స్వామి మా గతులు మార్చె

విశ్వనాథుని స్మరణము విభవ మొసగు

 

99

నీదు వాత్స్యలమున జన్మ నే బడసితి

నీదు పూజలు కల్గించు నిఖిల సిరులు

నీదు జపము నివృత్తుల నిచ్చు స్వామి

విశ్వనాథుని స్మరణము విభవ మొసగు

 

08

శిథిల దేహమే రీతిగా చేయు పూజ?

వాసనలు వీడని మనసు వాసమగున?

చిత్త చాంచల్యములడరు చేతనమ్ము

యే సరణి నీకడకు చేరు యిందు మౌళి

విశ్వనాథుని స్మరణము విభవ మొసగ

 

100

వాడలన్నియు తిరిగినా జాడ లేదు

కటిక చీకటి లోనిను కాననైతి

వెలుగు దారుల వెనుకనే వెదికితినయ

వేదన మిగిలె ,నోదార్చి వెతల దీర్చ

విశ్వనాథుని స్మరణము విభవమొసగ

 

101

సర్వ వ్యాపివి నీవని సంజ్ఞ తెలిసె

యెల్ల మనముల దాగిన యీశుడివని

యెఱుక కలిగియు గీరచే యేమరించి

బుద్ధి వికలమయ్యే శివా!పొంక పఱచ

విశ్వనాథుని స్మరణము విభవమొసగు

 

102

శరణు కోరితి శివ నాకు వరము నిమ్ము

విడువక స్మరణ చేతును కడవరకును

నీ పదముల నెరవుకల్గ నిమ్ము స్వామి!

విశ్వనాథుని స్మరణము విభవ మొసగు

 

అవళూరు సీత

 

 

.వె. 103

చిత్తమందునీవుచిరకాలము నిలిచి

చింత లన్ని బాపు చిన్మ యమున

కర్మలన్నిబాపు బ్రహ్మక పాలమున

ఆది బిక్షు వీవె ఆత్మ లోన

 

 

.వె. 104

సోహ మనుచు నీవు సోమసుం దరుడవే

పరమ శివుడ వంచు పావ నముగ

జగతి శుభము కొఱకు జంగమ దేవర

గళము నందు నిలుపు గరళ కంఠ

 

.వె. 105

కాశి పట్ట ణమున కాశీశ్వ రుడవంచు

వార ణాసి యందు వాసిగాంచ

విశ్వనాధుడంచు విశ్వజనులు  మ్రొక్క

చేరి కొలుతు మిమ్ము చెంత నిలిచి

 

.వె. 106

పరమ పూజ్య ముగను పరమేశ్వరాయంచు

పాప పుణ్య ములను బాపు శంభు

బిల్వ దళము తోడ భీమశం కరునిగా

నాత్మ లోన కొలుతు నాది దేవ

 

.వె.107 

ఆది శంక రుండవాద్యంత విశ్వమున్

లయము చేయు నీవు లయక రుడవు

బ్రహ్మ విష్ణు వులకు పరమబో ధతెలుపు

లింగ రూప మునను లింగ ధారి

.వె.II 06

గరళమంత మ్రింగి గంగాధరుడవై

సురల గాతు వీవు సోమ నాధ

యాదు కొమ్ము మముల నర్ధనారీశ్వరా

మోక్ష మిచ్చి బ్రోవు ముక్తి ధామ

 

.వె.108

పాల నేత్రు నికిని పంచామృతాలతో

పూజచేతు నేను పుణ్య మలర

మూడు జన్మలకును ముక్కంటి వైశంభు

పాప మంత నీవు పరిహరించు

 

.వె. 109

త్రిదళములను జేర్చి త్రికరణశుద్దితో

చింత జేసి కొలుతు చిద్వి లాస

యాది బిక్షు మముల నక్కున జేర్చికో

జాగు లేక మమ్ము జంగమయ్య

 

గీతాశైలజ

 

 


 

110

దేవ దానవ పూజ్యుండు దివ్య పురుషు

డఖిల లోకమ్ము లంగాచు నాత్మ భవుడు

భక్తి మీరగ గొలిచిన ముక్తి నొసగు

విశ్వనాధుని స్మరణము విభవ మొసగు

 

111

విశ్వమంతయు నిండిన వేద మూర్తి

సర్వ కళలకు నెలవైన సాంబ మూర్తి

భక్త జనులను గావగ వరదు డితడు

విశ్వనాధుని స్మరణము విభవ మొసగు

 

112

తనను ధ్యానమందు నిలిపి తన్మ యమున

నరుడు తపముఁజేసి వరము కోరుకొనగ

మెచ్చి పాశుపతాస్త్రము నిచ్చినాడు

విశ్వనాధుని స్మరణము విభవ మొసగు

 

113

సకల విద్యల సారంబు శంకరుండు

సకల కళలకు నిలయంబు శంకరుండు

సకల సౌభాగ్య వరదుండు శంకరుండు

విశ్వనాధుని స్మరణము విభవ మొసగు

 

114

సృష్టి స్థితియు లయముల స్థిరము గాను

నియతి తోడను ఘనముగా నిర్వహణము

సమత మీరగ నొనరింప శక్తి పరుడు

విశ్వనాధుని స్మరణము విభవ మొసగు

 

115

సర్వ మంగళ శర్వాణి శంభురాణి

యర్ధ నారీశ్వరు ప్రతిత నాదరించి

పార్వతీశులు నిరతంబు   పరవశింప

విశ్వనాధుని స్మరణము విభవ మొసగు

 

116

మడియు నాచారమన్న నీ మమ్ము లేక

మనసు నీపైన కుద్దుగా మౌన ముగను

నిలిపి యుంచిన చాలుగా నిండు గాను

మూఢ భక్తికి సహితము ముక్తి నొసగు

 విశ్వనాధుని స్మరణము విభవ మొసగు

 

117

 నాట్య గాంధర్వ సాహిత్య నాటకాది

యన్ని కళలును శంకరా నుగ్రహమున

సిద్ధి పొందును నిత్యమై స్థిరము గాను

విశ్వనాధుని స్మరణము విభవ మొసగు

 

118

 వేద శాస్త్ర పురాణాది పుణ్య విధులు

భక్తి వైరాగ్య జ్ఞానాది భవ్య నిధులు

శివుని సాంబుని ధ్యానింప సిద్ధి గలుగు

విశ్వనాధుని స్మరణము విభవ మొసగు

 

119

పరమ పావన కార్తీక పర్వ మందు

పద్య కవితల నీశ్వరు భక్త వరదు

పూజ జేసిన కవులకు ముక్తి నిమ్ము

విశ్వనాధుని స్మరణము విభవ మొసగు

 

ఆదిభట్ల సత్యనారాయణ

 

120 

జగతి యందున కొలవగ జనము చేరి

భవము తెలపగ వచ్చెగ భస్మదారి

కాంతి జిలుగులు పంచుతు కరుణ జూపె

విశ్వనాథుని స్మరణము విభవమొసగు

 

సి.హెచ్. రజిత,కరీంనగర్

 

 

121

పరుగుల ప్రపంచమందున బ్రతుక లేక

ఆత్మవిశ్వాసమన్నది యణగి పోవ

నాస్తికునకైన తప్పదు నామజప ము

విశ్వనాథుని స్మరణము విభవమొసగు

 

122

కారు చీకట్లు బ్రతుకున కమ్ము కొనెను

కాంతి రేఖల చాయలే కానకుండె

శివ శివాయని పూజించ శిరము నొంచి

విశ్వనాథుని స్మరణము విభవమొసగు

 

123

దైవమన్నదే లేదని దారితప్పి

తిరిగితిని నీదు మహిమలన్ దెలసి నీకు

దాసుడనయితి నీశ్వరా దారి గోరి

విశ్వనాథుని స్మరణము విభవమొసగు

 

123

ఘోర పాపంబు జేసిన గురుతు లేదు

యంతులేని కష్టములొచ్చి యార్తి గలిగె

యంజలి ఘటించి పూజింతు నాది దేవ

విశ్వనాథుని స్మరణము విభవమొసగు

 

125

పూట తిండిమానని తిండిపోతు నేను

నోములని జేసితిని పూజ నొడుపు గాను

యాకలన్నదే మరచితి నాదిదేవ

విశ్వనాథుని స్మరణము విభవమొసగు

 

126

పాపులకె దేవుడన్నది పాటిగాదు

పరుగుల ప్రపంచమున జన్మ పాతకంబె

కొంత సమయమయిన దైవచింత జేయి

విశ్వనాథుని స్మరణము విభవమొసగు

 

127

నమ్ము కున్న విజ్ఞానము వమ్ము జేసె

శాంతినంతులేనాశలసంద్రమందు

మనిషి యెదురీదలేకను మ్రగ్గు చుండె

విశ్వనాథుని స్మరణము విభవమొసగు

 

128

ఘోరసంసార విముఖులై కోరిచేర

శరణుశరణని యార్తితో సాంబశివుని

ధ్యానముద్ర తోడ హరుడు దారి జూపు

విశ్వనాథుని స్మరణము విభవమొసగు

 

డా. నాగులపల్లి

 

129

ఈశ్వరా!యనన్ దీర్చునే యీప్సిత,మ్మ

హేశ్వరా!యని బిల్వంగ హితుడగు,జగ

దీశ్వరా!యని గొలువంగ,దీ వెనలిడు

విశ్వ నాధుని స్మరణము విభవ మొసగు.

 

130

దేవ ముని గణ సేవిత దివ్య మూర్తి

భవ హరుడితడు, నమ్మగా బాపు చింత

శివ శివా యను నామంబశేష పుణ్య

విశ్వ నాధుని స్మరణము విభవ మొసగు.

 

131

అర్ధ నారీశ్వ రుండిత డన్న పూర్ణ

కర్ధ భావ ప్రాణేశ్వరుం డరయగ!పర

మార్ధ లయ కారకుండితం డౌట, కాశి

విశ్వ నాధుని స్మరణము విభవ మొసగు.

 

శిరీష

 


132

కరము శూలము కన్నుల కరుణ కలిగి

జగమునేలెడువాడెగా శంకరుండు

భక్త జనుల బ్రోచుచుభద్రతొసగు

విశ్వనాథుని స్మరణము విభవమొసగు

 

133

 

గంగను జడలో దాల్చిన కాలకాలు

డతడు,చంద్రధరుడు దహనాంబకుండు

పాంశు చందనుండు, భవుడు పంచముఖుడు

విశ్వనాథుని‌స్మరణము విభవమొసగు

 

134

మూడుకనులవాడతగాడు మొదలివేల్పు

నగధరుండు, భవుడు శూలి నందివాహి

గరళకంఠుడు సుందరాకారుడైన

విశ్వనాథుని స్మరణము‌ విభవమొసగు

 

ఆత్రేయ

 

 

తే.గీ. 135

మాసములయందు నుత్కృష్ట మాసమిదియె

పాపహరణమ్ము గావించు పావనముగ;

చిత్తశాంతి గల్గ జనుల చింత దొలగి

విశ్వనాధుని స్మరణము విభవమొసగు!

 

తే.గీ.136

సోముడే సంచరింపగ శుభకరముగ

కృత్తికందు; కార్తికము సద్వృత్తి  బెంచు;

హరిహరాదుల బూజింప హర్షమొప్ప

విశ్వనాధుని స్మరణము విభవమొసగు!

 

తే.గీ. 137

మదిని బాధించు యాంధ్యము న్మగుడజేసి

శాంతి నొసగుమయా మానసమ్మునకని

దీపముల వెలిగించగ దేవళముల

విశ్వనాధుని స్మరణము విభవమొసగు!

 

తే.గీ. 138

ఆదిదేవుడే కొలువగు నాలయముల

దీప తోరణంపు ప్రభల దీప్తి తోడ

పుణ్య ఫలములే పొంగారి పొదలుచుండ

విశ్వనాధుని స్మరణము విభవమొసగు!

 

తే.గీ. 139

ఓం నమశ్శివాయ యనగ నోజ గూర్చి

మంగళకరమైనది గాను మహిమ జూపు

నెపుడు పంచాక్షరీ మంత్ర మెలమి తోడ

విశ్వనాధుని స్మరణము విభవమొసగు!

 

తే.గీ. 140

నిండు మనమున వేడుచు నిర్మలముగ

పురహరుని విభూతిని దాల్చి పొల్పుగాను

భక్తకోటి యెల్ల సతము పరవశించ

విశ్వనాధుని స్మరణము విభవమొసగు!

 

తే.గీ. 141

 బిల్వదళముల సేకొని చెల్వుమీర

మలహరుని  పూజ సల్పగా మనము నిల్పి

యలఘు సిరులు తానొసగ నత్యద్భుతముగ

విశ్వనాధుని స్మరణము విభవమొసగు!

 

తే.గీ. 142

వేద విహితమౌ నుతుల ననాది యందె

విపులమౌ రీతి దెల్పిన వేద్యుడితడు

సత్కృపా జలధి సమమై సతము గాచు

విశ్వనాధుని స్మరణము విభవమొసగు!

 

తే.గీ. 143

అంతయూ నీవేనంచు నంతరంగ

మున దలంచగ నహరహ మున్ను శూల

పాణియే గాచి శుభములన్వరల జేయ

విశ్వనాధుని స్మరణము విభవమొసగు!

 

తే.గీ. 144

అతుల శుభముల నొసఁగుచు నాత్మ భవుడు

శివశివ యనంగ గూర్చును సేమమున్ను;

నిత్య చేతనత్వమ్ము ననిశము నీయు

విశ్వనాధుని స్మరణము విభవమొసగు!

 

తే.గీ.145

కొండరాచూలి పతినిట కొల్వగాను

కోరి వేడిన వారల కొంగు పసిడి;

కుందునట్టి మనమ్మది కుదుట పడగ

విశ్వనాధుని స్మరణము విభవమొసగు!

 

తే.గీ.146

సంతసమున గొల్వగ సాంబశివుని

సుంత యేనియు కష్ట మసాధ్య మనక

సర్వమును సమకూర్చి విజయమొసంగ

విశ్వనాధుని స్మరణము విభవమొసగు!

 

చల్లా దేవిక




కం.147

అతులిత వేద విహితమౌ

నుతులన్నింటిని జపించి నోరారగ నే

నుతి సేయ దలంచితి గద

కృతమతినై నిను దలంచి కృప గావుమనన్!

 

కం. 148

వేదములనె వచియించిన

యాది గురువు నీవటంచు నాదమరచి నే

పాదుకొనంగను భక్తియె

తాదాత్మ్యమ్మున దలచితి తల్లడపాటున్!

 

కం.149

ఇమ్ముగ సంగీతమ్మును

కమ్మగ పాడి పరవశము గలిగించగ నే

నెమ్మిక తోడను జేరి ర

యమ్మున భాగ్యమ్ము  నాదె యనుచు మురిసితిన్ !

 

కం.150

కనుగొన మరచితి నత్తరి

ననువుగ  నోంకారమనెడు యద్భుత నిక్వా

ణ నుడియె జనించిన విధిని

పెనుపారు ఢమరుక నాద బీజము తోడన్!

 

కం. 151

నైవేద్యము షడ్రుచులన్

దైవారగ నీకు పెట్టి దాసిగ నేనే

సేవను జేయ దలంచితి

కైవల్యము నీయమనుచు కైమోడ్పులతోన్ !

 

కం. 152

మైకొని మరచితి భక్తిన్

సాకతముగ యన్నపూర్ణ సగభాగమవన్

ఆకారము పూర్ణమ్మై

సాకల్యము నొందితివని సమ్మోదమునన్!

 చల్లా దేవిక.

 

 

"జ్ఞానాదేవతు కైవల్యం"

 

అద్వైతజ్ఙానం వలనే కైవల్యం అన్న శంకరభగవత్పాదులు సూచించిన జ్ఞానమార్గాన్ని వెతుక్కునే ప్రయత్నం నిత్యం చేస్తున్నాను 

 

"స్వరూప" జ్ఞానం తోనే సిసలైన భక్తిమార్గమని శంకరాభవత్పాదుల ఉవాచ 

"భక్తి మార్గమాజ్ఞానమార్గమా" అనే సందేహం బహుశా సహజమే

 

మన వాఙ్మయంఉపనిషత్తులు మాత్రం జ్ఞాన మార్గాన్నే మరింత లోతుగా చూడమంటాయి... 

నేను నా పద్యాలన్నీ జ్ఞాన మార్గంలోనే ఆవిష్కరించాలని చేసే చిన్న ప్రయత్నం  

 

ప్రతి అక్షరంలోఆలోచనలో చైతన్యం కనిపించాలి అన్న సంకల్పంతో మొదలైన శ్రీ వెంకటప్పయ్య గారి  అక్షరార్చన పరమశివుని అనుశాసనం 

అదే నిజమైన ఈశ్వరారాధన అని ఈ మూడుఢి నమ్మకం 

అందుకే సగుణోపాసన చేసే ప్రయత్నం నేను చేస్తాను.  

 

నేటి నా తేటగీతులలో కూడా ఆ భావం ఆవిష్కరించాలని చేసే ఈ చిన్న ప్రయత్నం. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...