5, డిసెంబర్ 2020, శనివారం

చిత్రానికి పద్యం శీర్షిక : రాయలసీమ / గండికోట 01.12.2020

 



చిత్రానికి పద్యం శీర్షిక 

రాయలసీమ / గండికోట

సీ ll

వీరచాళుక్యపృద్వీపతుల విభవ మఖిలమై తేజంబులైక్యమాయె

పౌరుషమ్ముల మేటి ప్రౌఢిమమ్మది ! నాటి కేయూరముల్ నేడు మాయమయ్యె

కోట గోడలమేటి కుడ్యముల్ గాంచిన పెన్నాతటి కెలన విస్మయమ్ము

తెలుగురా జులనాటి ధీరతన్ కొనియాడ యెవ్వానిశక్యము నివ్వటిల్లు

 

తే.II

ఆంధ్రశిల్పులరమ్యత మార్దవములు   

గండికోట వైభవములన్ గాంచినంత

సాహసంబు విభ్రాజిత శౌ ర్యమందు

వెలయు ధీరప్రతాపముల్ విక్రమంబు

కస్తూరి శివశంకర్

 

 

మొండి ధైర్యమునకు మొగసాల ఈ బాట

కండసారమునకు కత్తులూట

దండి శౌర్యమునకు దర్పణముల పాట

నిండు సాహసముల గండికోట!...

 

రాంమోహన్ నిజామాబాద్

 

 

 

తే.II

 

నాటి కళ్యాణ చాళుక్య మేటి చోటు

గర్వ, బౌరుషమ్ముల గుర్తు గండికోట

శిల్పకళ సౌరభాలయ్యె శిలల నేడు

నానవాళ్ళై మిగలెనిట నద్భుతాలు!

వాణిశ్రీ నైనాల, విజయవాడ

 

 

రత్నగర్భ యిదియె రాయలేలిన సీమ

రైతు కిదియె నేడు రాళ్ళ గడ్డ

చరిత దర్పమేది ఛాయలే లేవాయె

రాయలోరి గుర్తు రాళ్లు మిగిలె

డా. నాగులపల్లి

 

 

 

ఉత్పలమాల..

రాజులు పోయినా బలిమి రాజ్యము లెంతగ పోయినందటన్

రాజుల కోటలే పసిడి రాయలసీమన గండికోటయున్

రాజిలె రాజవైభవము రాయల సేనలు, పెమ్మసానియున్

రాజుల  కెప్పుడైనయట  రాయిగ కోటనభేధ్యమై యుండెన్..

 

**( పెమ్మసాని వారు రాయల వారి  సామంత రాజులు )

పి.ఎల్.నాగేశ్వరరావు

 

 

కోటకు పెట్టిన పేరది

దీటగు యా గండికోట ధీరత రూపై

పోటీలో రాజులతో

సాటిగ నది నిలచి యుండె సతతము తోడై!!

 

కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి

 

 

నానీ

ప్రకృతి చెక్కిన శిలా తోరణం

ఘన చరిత్రకు సాక్ష్యం, గండి దుర్గం

CA కె మల్లికార్జునరావు

 

 

శత్రు దుర్భేద్య ముగకోటశస్త్రిగాను

నిచ్చె సంరక్ష ణను తాను నింపుగాను

విజయ నగరము నకు కోట విజయమిచ్చి

పెమ్మసానినాయకులకు పేర్మితోడ

 

పెన్న ఒడ్డున కొలువున్న పెంపుమీఱి

యుద్ద విద్యల కంతయు యోగ్యముగను

ఓటమెరుగని కోటయు యోధులకును

చరితగలకోట వైభవం శాశ్వతముగ

పెన్న చేసిన గండియే పేరుగాను

రాయలచెరువు వుండును రమ్యముగను

రామునాలయముండును రమ్యముగను

శిల్ప సంపదలకునిది శిఖరముగను

 

సంస్కృతి సంప్రదాయాలకు సాక్షిగాను

తెలుగు వీరుల తేజము తెలిపినట్టి

రాయలోరిసీమనతాను రాజసముగ

కమలజనకుడు కట్టించె గండికోట

గీతాశైలజ

 


 

సీII

రాజులు పోయినా, రాజ్యముల్ పోయినా  గండికోట ఘనత మెండుకొలుపు

రమణీయ ప్రకృతితో రాజిల్లెడి గత స్మృతుల చరిత్ర వైభవ ద్యోతు లివియె

వజ్ర వైఢూర్యముల్  బహుళముగ కలిగినద్భుత భూతల యమరపురమె

జిగిబిగి కల్గిన శిల్పకళా సంపదల కానవాలమై నంగణ మిది

 

తే.II

విజయ నగర రాజ్యమునకు వెన్నెముకగ

నిలిచి పెన్నానది ప్రజకు జలసిరులొస

గక సహజ రక్షణగ నున్న గండికోట

వాసికెక్కి నిల్చిన నాటి ప్రభవ మేది?

వెంకట్.సి హెచ్

 


 

రాతిగురుతులు

 

ధీర పురుషుల రక్తపు చారలు

రాతి గుండెలను నిలువుగ చీల్చెనేమో

 

వీరచరితల వాయుఘోషలు

బండ రాళ్ళను గుండ చేసెనేమో

 

రాచకన్యల కన్నీటి ధారలు

కొండ బండలను వేరు చేసెనేమో

 

శిధిల శిలలెన్ని వధల కథలకు

చరిత నందున మౌనసాక్ష్యము లాయెనో

 

డా. నాగులపల్లి

 

 

వచన కవిత

రాయల సీమ వైభవానికి మచ్చు తునక

గండు శిలల సాక్షిగా వెలసిన గండికోట

పెమ్మసాని ప్రభువుల దర్పమీ గండికోట

పరదేశపు మారణకాండ చరిత గుర్తు

ప్రకృతి సోయగపు వెలుగులు పంచు

 

సజీవ మూర్తిగా వెలసిన అంజనీ పుత్రుడే

యండగా నుండ శౌర్య విభవమే వెలసెనిచట

సిరి సంపదల నొసఁగు పవన సుతుఁడు

పూజలందగ నందరిని ఆశీర్వదించు

 

అవళూరు సీత

 

 

ఆ. వె.II

పెన్ననది దరిన పెద్దగా గలకోట

గండికోటగాను ఘనత నొందె

పెమ్మసానివలన బేరును బొందినా    

నేడు శిధిలముగను నిలచియుండె    

హేమలత

 


 

కం.II

రాయలసీమను పాలించె

రాయల వారే విరివిగ రత్నాల గిరుల్

పోయగ వినువీధులనెల

సోయగమును నింపి జూపె సోదాహరణన్.....

 

జైకర్ విశ్వేశ్వర్ టోణ్ పె, థానే, ముంబయి

 

 

వచనం లో నా భావన

 

రాయల సీమకొక కీర్తి కిరీటమై నిలచి

పవిత్ర పెన్నమ్మ సన్నిధిలో

పెమ్మసాని నాయకుల చల్లని పాలనలో

సుభిక్ష మై సస్యశ్యామలమై కళల కాణాచి లా విలసిల్లిన

గండి కోట నేడయ్యే శిథిల తోరణం

పచ్చని ఉద్యాన వనములేవి? పసిడి సింహాసనాలేవి?

 

రాతి గుండె మనుజులు చిందించిన వైషమ్యాల

విషజ్వాలలో ఉనికి కోల్పోయి ఓ రాతి కట్టడంగా

మనముందు నిలిచింది నేడు

 

రమ, కంకిపాడు.



 

వచన కవిత,

గండి కోట  ... నేడు  అది,

కొండ రాళ్ళ గుట్ట యింది,

బండల కింద జ్ఞాపకాలు నలిగి పోయి,

గుండెల లోతున చరిత్రగా  మిగిలిపోయింది...

 

గాంగేయ శాస్త్రి, రాజమండ్రి

 

 

 

రాయలసీమ నేలిన రాజులు రాలిపోయారు

గడగడ లాడించిన పాలెగాళ్ళు కాలగర్భంలో కలిసిపోయారు

వారికి స్మృతులుగా  ఆనవాళ్లుగా 

నేటికీ సజీవ సాక్ష్యాలు రాతి ఆకృతులు 

కూర్పు ఒకదానిపై ఒకటి ఎవరో వచ్చి పేర్చినట్టు

కళాకృతులు కళలకు ఆకృతులు

సంగీతానికి శ్రుతులు నాట్యానికి పదనిసలు

గండికోట శిధిల సాక్ష్యాలు ఎక్కడో పాతాళంలో

పెనుగంగ పెన్నా ఉరికి వచ్చే జలగంగ

చూట్టూ ప్రకృతి పరచిన పచ్చదనం

కనులకు పంచిన వర్ణన అపురూపం

నిభిడీకృతమైన అంతఃసౌందర్యం

దాచుకొని గంభీరవదనం తో స్వాగతం పలుకుతుంది

 

కోవూరి

 

 

గండికోట అందాలు కనులకింపు చందాలు

ఆనాటి రాజుల పౌరుషాలు యుద్ధాలు గుర్తుకు తెచ్చే కోట దృశ్యాలు

లోపల 64 గదులు బయట జుమ్మా మసీదు అద్భుత కట్టడాలు

 

'చీరలియ్యగ దవోయి చెన్నకేశవ చూడు చారడేసి కన్నుల,

చెన్నకేశవ' అని అన్నమయ్యచే పలికించిన

చెన్నకేశవ దేవాలయం,

కడప జిల్లాకు పెట్టని కొట గండికోట

 

ఇసుక రాతి కొండల గుండా నాలుగు మైళ్ళ

పొడవున సాగే పెన్నా నది ప్రవాహల

అందాలు గండికోటకు మణిమకుటాలు

 

దేవరశెట్టి నాగమణి

 

 

శివ

 

శివ శివ శివ అనవేల

హర హర హర అనవేల

భువి నుండి కైలాసం

కేల చూపు శివుడు రాసుకునే భస్మం ను అడుగు 

శివుడు ధరించే పులిచర్మం ను అడుగు

తన చుట్టూ తిరిగే భ్రమరం నడుగు

తనలో సగభాగం అడిగిన సతి నడుగు

మారని తన సంకల్పంను తరచి తరచి నడుగు

అడుగు అడుగుకు కదిలే ప్రధమగణంను అడుగు

అడుగు అడుగుకు నర్తించే శివతాండవంను అడుగు

శివునాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు పట్టదు

కార్తీక మాసం శివుని దరహాసం విష్ణువు కైనా ఉందా

బ్రహ్మ కు అంతైనా ఉందా

నడిచిన కాలం శివమయం

నడుస్తున్న కాలం ఈశ్వరమయం

నడవబోయే కాలం భోళామయం

 

కోవూరి


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...