22, డిసెంబర్ 2020, మంగళవారం

శనివారము ప్రత్యేకం, 19.12.2020, జానకితో జనాంతికం


 

శనివారము ప్రత్యేకం

జానకితో జనాంతికం

19.12.2020

 

చిన్నయసూరి బాలవ్యాకరణాన్ని రమణీయం అనే పేరుతో వ్యాఖ్యానించి, రమణీయంగా మలచిన కళాప్రపూర్ణ శ్రీ దువ్వూరి వేంకట రమణ శాస్త్రి గారి వాక్ చిత్రం జానకితో జనాంతికం.. కళ్యాణ సీతతో గుస గుస కబుర్లాడారట.

 

కష్టాలు వచ్చినపుడు భగవంతుడ్ని తలుచుకోవడం... మనేదలన్నీ ఆయనకి చెప్పుకోవడం భూమ్మీద పుట్టిన ప్రతి మడిసికీ ఉన్న అలవాటు.

 

దేవుడి ద్వారా డైరెక్ట్ పని అవ్వదని తెలిసినపుడు ... మము బ్రోవమని చెప్పవే అనో, నడిరేయి ఝాములో స్వామి నిను చేర దిగి వచ్చునో అనో..నవవిధ భక్తి మార్గాలలో మార్గే మధ్యంగా దేవేరికి కూడా మన కష్టాలన్నీ ఏకరువు పెడుతూ ఉంటాం !!

 

శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాద సేవనం

అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనం

ఇతి పుంసార్పితా విష్ణౌ భక్తిశ్చేన్నవలక్షణా

క్రియతే భగవత్యద్ధా తన్మన్యేధీతముత్తమమ్ !!

 

నవవిధ భక్తి మార్గాల్లో సఖ్యం కూడా ఒకటి... మన రచయిత అదే ఎంచుకున్నట్టున్నారు...

 

ఎప్పటి నుంచో సీతామాతతో మాట్లాడుదామనే కోరిక ఉన్నా , భక్తుల వేదనలు వినే హడావిడిలో నాకు అవకాశం ఉండదు, ఒకవేళ తోసుకుని ముందుకు వచ్చినా పాపం భక్తులు అని దయతలచి ఆఖరుకు...

 

భద్రాద్రి లో సీతారామ కళ్యాణం అయ్యాకా ... వీలు చూసుకుని , సీతతో కూర్చుని ఆయన మొదలుపెట్టారు పిచ్చాపాటీ కబుర్లు !!

 

కళ్యాణ రామ రసంలో పుడకల్లే దూరకుండా ...వాళ్ళని డిస్ట్రబ్ చేయకుండా...వాళ్ళ జనాంతికంలోకి నెమ్మదిగా వెడదాం రండి....

 

తల్లిగా అనే ప్రేమగా పలకరిస్తూ , ఒక బిడ్డలా కాసేపు , ఒక తండ్రిలా కాసేపు... కబురులాడుతూ ..పొగడ్తలతో ముంచుతున్నాడాయన..

నీ కళ్యాణానికి మించిన వైభవోపేతంగా జరిగే కళ్యాణం నీదే సుమీ ...

జానక్యాః కమలామలాంజలి పుటే యాః పద్మరాగాయితాః

న్యస్తా రాఘవ మస్తకేచ విలసత్ కుంద ప్రసూనాయితాః

స్రస్తా శ్యామల కాయకాంతి కలితా యా ఇంద్రనీలాయితాః

ముక్తా తా శుభదా భవంతు భవతామ్ శ్రీరామ వైవాహికాః

 

తలంబ్రాలు శ్లోకం ఎవరు వ్రాసారో కానీ ఎంత బాగుందో కదా...

ప్రతి శుభలేఖ మీదా ఇదే శ్లోకం రాస్తారు కదా....

మరి, నీ దోసిట చేరి రంగు రంగులుగా మారుతున్న తలంబ్రాలు నువ్వు మాత్రమే పోసావేం ? ఆయన పోయడా ? మీరోజుల్లో మగవారు పోయరా?

 

అయినా...

స్నేహం దయాంచ సౌఖ్యంచా యదివా జానకీ మపీ ఆరాధనాయ లోకస్య ముంచతో నాస్తిమే వ్యథ అని లోకారాధనలో నిన్ను కారడవుల్లో వదిలేసి నీ నెత్తిన బానే పోసాడులే తలంబ్రాలు , పోనీ నువ్వు కోప్పడవు,. మమ్మల్ని పడనీవు .. అంటూ నిష్టూరమాడుతూనే , ఆయనతో అనేవు సుమీ అని భయపడతాడు !

 

అడవుల్లో ఒంటరిగా ఉన్న నిన్ను ఆదరించవచ్చిన వాల్మీకి చెంగట వాలావే కానీ , పాదాలను తాకలేదట నీ తండ్రి వంటివాడే కదా ..తప్పు కదూ అన్నట్టు మందలిస్తాడు.

 

ఆఖరుగా ఒఖ్ఖ మాట అయోధ్య యజ్ఞవాటికలో ఉండగా పాడులోకంలో నేనుండలేనని మీ అమ్మ ఒళ్ళో కూర్చుని హడావుడిగా భూగర్భంలోకి వెళ్లిపోయావే , నీ పసి పిల్లలని ఒక్కసారి కూడా చూడాలనిపించలేదామ్మా ? అని బాధపడతాడు...

 

నువ్వెళ్ళిపోయాకా ఏం జరిగాయో తెలియదు కదూ అని ఆసక్తి గొలిపే వివరాలు చెప్తూ..(అచ్చు పక్కింటి పిన్నిగారిలా )

 

నువ్వెళ్ళిపోయాకా రాముడు మాత్రం ఏం ఉంటాడు .. సరయూ నది ప్రవేశం చేసి వైకుంఠానికి వెళ్ళిపోయాడు, అతని వదిలి ఉండలేని ప్రజలు కూడా ఆయన తోనే వెళ్లిపోయారు , కానీ నీలా హడావిడిగా వెళ్ళలేదులే లవకుశులిద్దరికీ చెరో రాజ్యాన్ని కట్టబెట్టే వెళ్ళాడులే...

 

 

ఏది ఏఁవైనా అనుకో... హన్నన్నా అనకు.. నీ భర్త కన్నా నీ పెద్ద కొడుకు కుశుడు తండ్రిని మించినవాడు...

 

ప్రజలు లేక పాడుబడిన రాజ్యాన్ని చూసి బాధ కుశుడితో చెప్పుకుందామని రాత్రి తన అంతఃపురానికి వచ్చిన పురదేవతని కుశుడు చూసి

కాత్వం శుభే కన్య పరిగ్రహోవా

కింవా మదభ్యాగమ కారణంతే,

ఆచక్ష్వ మత్వా వశినాం రఘుణాం

మనః పరస్త్రీ విముఖ ప్రవృత్తి.

(కాళిదాసు వారి రఘువంశంలోనిది) ...

 

అని ..సూర్పణక విషయంలో నీ భర్త చేసినట్టు తాత్సారం చేయక ,.ముందే మందలించాడు , నీ భర్త నీ కొడుకు ముందు తీసికట్టే అని కుశుడుని పొగుడుతూ ...మళ్ళీ వస్తాలే ఆలస్యమైంది అని జానకీ దేవివద్ద సెలవు తీసుకుంటారు !!

 

విష్ణుప్రియ

దేవునికి ఉత్తరం

 

దేవుడా!

 

నీ గురించి మొట్టమొదటి సారి విన్నప్పుడు నేను పసిబిడ్డగా ఉన్నాను.. మా అమ్మ నాతో  చెప్పేది - " నీవు మాకు దేవుడిచ్చిన వర ప్రసాదం" అని..

 

అప్పుడు నా చిన్ని గుండె ఆమె కళ్ళలో అతడిని మాత్రమే చూసింది..  నా హృదయం నీ లీలలు తోనూ కథలతోనూ నిండి పోయింది.

 

" విశ్వం మొత్తం నీ  సృష్టి అని ... నీవు నటరాజు అని విషయం నీ నాట్యము"  అని నాకు బోధించారు..

 

 నిన్ను చూడాలి అని కోరి నాను, దానికి సమాధానంగా " పువ్వు ఎలా వికసిస్తుంది చూడు, నక్షత్రాలు ఎలా మెరుస్తాయి చూడు" అని బోధించారు...

 

నిన్ను వినాలి అని కోరినాను.. దానికి సమాధానంగా " పక్షుల కిలకిలారావాలు విను, గాలి ఈలలు విను," అని బోధించారు..

 

మా అమ్మ ఇంకా ఇలా అనేది - " అందరినీ ప్రేమించు అందరి చేత ప్రేమించబడు, ఉన్నదంతా ఇతరులకు ఇవ్వడం నేర్చుకో.  అప్పుడు నీకు  ఆశ ఉండదు, దయ కలిగి ఉండు.  ప్రపంచ మందలి కరుణ నీ హృదయం నిండి ఉంటుంది... అప్పుడు నీవు దేవుని చూడగలవు" అని..

 

నా చిన్ని గుండె అమ్మ మాటలు నమ్మింది.. నమ్మకంతోనే పెరిగాను జీవితంలో ప్రయాణం చేశాను..

 

కానీ ఆశ నిరాశల అరణ్యంలో నా పెదవి పైన నవ్వులు మాయమయ్యాయి.. ప్రపంచం పువ్వుల గురించి నక్షత్రాల గురించి కాదు అని తెలిసింది, ప్రపంచం అధికారం చుట్టూ తిరుగుతున్నది అని కూడా తెలిసింది..

 

నేను స్కూల్లో విద్యనభ్యసిస్తున్న ప్పుడు , సాత్విక స్వభావము ఉన్న వాళ్ళు భూమండలం పైన విజయం సాధిస్తారు అన్న నీ వాగ్దానాన్ని చదివాను.

 

 కానీ ఇప్పుడు వాస్తవంలో కనిపిస్తున్నది బలవంతులు భూమాతను ఆక్రమణ చేస్తున్నారని.. నీ పేరు మీద బలవంతులు యుద్ధాలు చేస్తున్నారు నీ సృష్టిని ఊస కోత కోస్తున్నారు.. నిరంకుశ వాదులు ఆలోచన వార్తలు శాస్త్రవేత్తలు వేదాంత వేత్తలు ఆదర్శ వాదులు ఇలా రకరకాల ముగ్గులతో వచ్చి నిన్ను గుడిలో కట్టి వేసినారు ..నీ కథలలోని ఇంద్రజాలము నలుపు సంతరించుకుంది..

 

గర్భంలోనే పసివాళ్ళను చిదిమేస్తున్నారు, నదులను కలుషితం చేస్తున్నారు, అడవులను కాలుస్తున్నారు..

 

నాకు ఆశ్చర్యంగా ఉంది నటరాజు వైన నీవు ఇంకా విసిగి పోలేదా అని..

 

CA కె మల్లికార్జునరావు


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...