23, డిసెంబర్ 2020, బుధవారం

దత్తపది - 64, సలసల - జలజల - మిలమిల - వెలవెల 21.12.2020

 


21 - 12 - 2020; ప్రణాళిక 

దత్తపది - 64

సలసల -  జలజల -  మిలమిల -   వెలవెల

  

పదములతో ఔచిత్యమైన పద్యం  / కవిత్వం అందించగలరు 

అన్యార్థలతో అయితే మరీ ఆనందం.

 

కం ll

జలజల జాల్వారు ద్యుతులు !

మిలమిల మెరిసేటిభావమే మంజులమై  

కలితంబౌ పసల సలై  

చెలియ కనులకోవెల వెలిసే దీపంబై 

 

కస్తూరి శివశంకర్

 

 

వేసవిలో సలసల ఎండలు మండెను

ప్రకృతి లోని పరిసరాలు వెల వెల బోయెను

చిటపట చినుకుల వాన చిరుజల్లై కురిసే

జలజల గలగల పారే మువ్వల సవ్వడైన వాన

మిలమిల మని మెరిసే తారలు ఆకసమున......!

 

రాంమోహన్ నిజామాబాద్

వచన కవిత

 

జలజల పారు ఝరి దరిన

మిలమిల మెరియు కలువ

కన్నుల కన్యనుగాంచి

మదనుని మది సలసలమని కాగగ

అదియొక కలలోదృశ్యమని

దలచిన  నాతని మోము

వెలవెల బోయెను.

 

హేమలత

 

 

వచనం,

జలజల, గలగల పారే నీటిలో,

కలకల  మిలమిల లాడే చేప పిల్ల,

సలసల కాగే నీటిలో వదిలితే,

వెలవెల బోయి విలవిల లాడదా....

గాంగేయ శాస్త్రి, రాజమండ్రి

 

 

బళ్ళు తెరిచే

 

ఆరు మాసములుగా వెలవెల

బోవుచున్న ప్రయోగశాలకు

జలజల రాలుచున్న పూవులను

ఏరుకొని  చేరె బిలబిల విద్యార్థులు

అంత,గురువు సలసల మను ద్రావకమును

చూపి ,వివరించుచుండగా

మిలమిలలాడే

విద్యార్థుల నయనంబుల్ !

 

జి మురళీ మోహన్ రావు

 

 

తే.గీ.మా.

 

రావణు మదోత్కటపు పల్కు రక్తము సల/

సల మరగ కారణమవ, యనిల సుతుండు/

జలజల కనుల నీరైన జలజనేత్రి/

బాధ పోగొట్టి మిలమిల బ్రాతి పెంప/

వంగ రామకధ నుడివి, వైరి సభకు/

జని, వెలవెల బోవంగ  యక్షపతి పుర వి/

భవము, లంకగాల్చి వెడలె పాథి లంఘి

 

బ్రాతి - ఆశ

పాథి - సముద్రము

 

 

2️ సరదా కవిత

 

సలసల మరగంగ నీరుగాచి బొక్కెన నింపి

అందు జలజల మని వలయు సర్ఫు రాల్చి

మిలమిల మని మెరయ బట్టలుతికి ఎండకారవేయ నే

వెలవెలబోయే పక్కింటి పంకజముఖి మోము

( అంటే ... మరేమో.... ఆవిడకి అంతబాగా బట్టలుతాకటం రాదట అండి)

 

3️ చిట్టి కవిత

 

ఇనుడి ధాటికి సలసలమని కాలిన నేల ఎదురుచుసె

జలజలమని కురిసెడి వర్షపు మేఘాలకై

తదుపరి వచ్చిన శరత్తు చూపె మిలమిల మెరిసెడి నక్షత్రముల వినీలాకాశమును

తిరిగిన కాలచక్రము తదుపరి తెచ్చె పరీక్షలు బాలలకు

ఆపై వెలవెల బోయె పాఠశాలలు తిరిగి తెరచువరకు

 

వారణాశి శ్రీలేఖ

 


కం.

మిలమిల వన్నెల చిన్నది

జలజల గలగల తరగల సంద్రము నందున్

సలసల మదనుని రేపగ

వెలవెల బోయెను మొగమును విజ్ఞత కలుగన్

 

డి.రామ నాగేశ్వరరావు

 

 

కం"

మిలమిల కాంతుల దినపతి

సలసల జ్వాలల  సరసము సాంతము దోచన్

వెలవెల బోవగ నొకపరి

జలజల జల్లుల తడవగ జగమే మురిసెన్

 

వాణిశ్రీ నైనాల

 

 


సలసలమని వేగిన అరిసె పాకుండలు

కరకరమని రుచికరముగ కారపు జంతుకలు

 

జలజల మని రాలిన పొగడ కుసుమాలు

ఘుమఘుమలాడుతు విచ్చిన బంతి చామంతులు

 

మిలమిల కోమలి వేసిన రంగు రంగవల్లులు

ధగధగ పట్టు పావడల కన్నెపిల్ల నవ్వులు

 

భగభగా మిన్ను తాకె మిడసరి భోగి మంటలు

వెలవెల బోయెను తళుకు నింగి తారలు

 

కిలకిల కేరింతల సందడిగా నట్టిల్లు

కళకళలాడుతు పల్లె సంకురాత్రి సంబరాలు !!

 

విష్ణుప్రియ

 

 

చం 

 

కలికి పటీరముల్ జిలుకు కన్నులకల్వల కాంతిరేఖ కో 

వెల వెలయున్! మసా "లస"ల వెల్గులు జిందగ కామితార్ధమై 

జలజలరాలు ముత్తెముల జానకి శీర్షమునన్ మనోజ్ఞమై ! 

మిలమిల సిగ్గుమొగ్గల ప్రమీలిత భావము పల్కరించగన్  

చెలువపు నేత్రయుగ్మమున సిగ్గుల హాసిని నవ్వినట్లుగన్ !  

 

కస్తూరి శివశంకర్

 


 

సలసల మంటూ రేగగ వేగగ విరహము

జల జల కురియగ నా చెలి వలపుల జల్లులు

మిల మిల మెరియగ తన  దరహాసము

నా హృదయపు అశాంతి వెలవెల బోయెను.

 

CA కె మల్లికార్జునరావు

 

 

చెలికాడు కానక నా మోమాయెను వెలవెల...

సమయాతిక్రమణ కు నా మనసాయెను సల సల...

ఇంతలో కానరాగా కనులు మెరిసెను మిల మిల...

నా మనసు తుళ్ళి పడే జలపాతంలా జల జల...

 

ఉష

 

 

తేటగీతి

 

మిలమిల మెరిసెడి ప్రియమౌ చెలియ కనులు

నేడు జలజల పారె కన్నీరు నిండ !

సఖుడు విలవిల లాడెన్ విషయము నెరిగి

రక్తము సలసల మరిగెన్  రగలఁ మదియె!!

 

డా. నాగులపల్లి

స్మృతి

 

అదొక రోజు/ నేను కనని/ వినని రోజు

నానుండి/ నిశ్శబ్దం వినిపించే రోజు/

పరితపిస్తున్న/ హృదయంతో/

కురుస్తున్న/ కన్నీటి ధారలతో/

మననుండి/ మనందరి నుండి/

వీడ్కోలు/ పలికిన పలుకులు/

మరలి రావు/ పద్య మధురిమలు/

ఆలపించే రోజులు/ తిరిగి రావు/

గాత్ర గమకములు/వినిపించే రోజులు/

వైభవోపేత/ కవితా వాహిని వొట్టిపోయింది/

కాలం ఇచ్చిన/ అంతిమతీర్పుకు తలోగ్గింది

సాదాసీదా వస్త్రధారణ/ అంతకంటే/

సరళమైన మాటతీరు/ భేషజాలు,ఇజాలు లేని /

వ్యక్తిత్వ పరిమళం/ దాతృత్వ సుమగంధం/

మూర్తీభవించిన/ ఆయనకి ఆభరణాలు/

ఆయనే మనకి ప్రేరణ/ పద్యరణమున/ గురు లఘువుల పోటీకి/

 

-కోవూరి

 

నా స్నేహితుడు మల్లవరపు ప్రభాకర్ నాన్న మధురకవి రాజేశ్వరరావు 72 జయంతిని పురస్కరించుకొని నేను రాసిన కవిత తలోగ్గింది.

స్పేస్ తేడా కొడితే అర్దాలెలా మారాయో చూడండి..

నవ్వండి సరదాగా... ఒకే వాక్యాన్ని రెండు అర్ధాలలో.....

 

1. మీ  సంగతి ఏమిటి? మీసం  గతి ఏమిటి?

2. గురూజీ  వనం  బాగుందా? గురూ  జీవనం బాగుందా?

3. ఆమే  కమలమును తొక్కింది.    మేక  మలమును తొక్కింది.

4. మాట  మాట పెరిగింది.  మా  టమాట పెరిగింది.

5. ఆహారం చూడ ఎంత బాగుందో!  ఆ హారం చూడ ఎంత బాగుందో!

6. మాతా తమరు నిమిషంలో చేరారు.  మా తాత మరునిమిషంలో చేరారు.

7. నావ లతలపై పడింది. నా వల తలపై పడింది.

8. ఆమె కవితలతో జీవనం చేయును.  ఆమె కవి తలతో జీవనం చేయును.

9. మాతా  మరను పట్టుకో.  మా తామరను పట్టుకో.

 

 సేకరణ..

 

కందము

 

సలసల కాగెడి యూటలు

జలజల రాలెడి ప్రభాత జలపాతంబుల్

మిలమిల మెరిసెడి కొండలు

వెలవెల బోయెను కరోన వెతలకు మహిలో.....

 

జైకర్ విశ్వేశ్వర్ టోణ్ పె, థానే, ముంబయి

 


 

కందము

 

మిలమిల మనివచ్చు నినుడు

జలజల పారెడి జలముల  జక్కవచెలియున్

వెలవెల బోవుచు యరుణుడు

సలసల మనిమండుటెండ సవితృడు కాచెన్

 

జక్కవచెలి=సూర్యుడు

సవితృడు=సూర్యుడు

 

గీతాశైలజ

 

 

సీ.

జలజల దూకెడి జలపాతమై చెలి వలపు జూప, సఖుని తలపు నందు

ప్రణయ భావమొలికి వదనము నందున వెలుగుల దివ్వెల వెలయు రహిగ!

చెలి మేని పస మిలమిల లాడ, మరులు గొల్పు ప్రకృతి నందు కోమలాంగి

కరముపట్టితెలిపె మురిపెమున్ సఖుడుతా సలసల లెడబాటు సమయు జేసి

గీ.

శీత భానుని వెన్నెల సాత మొసగి

చెలియ చెంత నిల్వగ మది చింతలన్ని

తీరు నానంద రాగమై తీపి వలపు

పంట పండి హరువు కూడు ప్రాభవముగ

 

వెంకట్.సి హెచ్

 


 

తేటగీతిలో

 

జలజలమని పరుగులిడు ఝరులసడులె

జావళీ పాడ, భానుతేజములలరుచు

మిలమిలమని తళుకు నాట్యచెలువములన

మలయపవనుని గమకముల్ గలగలవిని

సలసలమని మరుగు మది శాంతి నొంద

రగిలిన మనసు వెతలు వెలవెల బోయె

 

అవళూరు సీత

 

 

కందము

మిలమిల మెరిసెడు కన్నులు

జలజల రాలెడు మొలకలు జవ్వని వలపుల్

సలసల లాడెడు సొగసులు

వెలవెల బోవును మెఱుపులు వెలదిని జూడన్

 

ఆదిభట్ల సత్యనారాయణ

 


 

సలసల,జలజల,మిలమిల,వెలవెల

 

( వరూధినీ ప్రవరాఖ్యులు )

వచన కవిత

 

బ్రాహ్మణోత్తముడు, నిత్యసత్యవ్రతుడు, నిష్టాగరిష్టుండగు ప్రవరుడు బయలుదేరె హిమవన్నగము, సిద్దుడొసంగిన లేత పాద లేపనంబుతో...నట..., పర్వత శిఖరాలు, నదీ నదంబులు,జలపాతపు సోయగాలు,సెలయేళ్ళ ఝంకృతి,  కదంబఫల పరిమళాన్ని ఆస్వాదించుచున్న శుభసమయాన....

 

విప్రవరేణ్యుడు, పొడగరి, సొగసరి ప్రవరుడు నక్కడ యున్న సుజల జలాశయము దరి జేరగా,  మిలమిల కాంతుల వయ్యారి, వగలమారి, చందమామ వరూధిని వ్రాలెనట మద,మోహపు చూపుల త్రిశూలమ్ముతో, గుండె నిండుగ గంపెడాశతో.......

సత్పురుషుడు, వీరుడు ప్రవరుని ముదము, మోహము, విరహముతో భామ బలాత్కరింపగా, చీత్కారంబున ప్రవరాఖ్యుడు తనకిష్టంబు లేని కృత్యమున బలవంత పెట్టినందులకు మనంబున కోపముతో సలసల కాగుతున్న  తరుణములో .......

బరితెగించి, మోహపుశిఖరాగ్రశిల చందపు విరహాగ్ని వరూధిని ఎరుపెక్కిన మోముయెంతగ  వెలవెల బోయినదో  వర్ణింపశక్యము గాదు.......

పి. ఎల్. నాగేశ్వరరావు


15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...