21, ఫిబ్రవరి 2021, ఆదివారం

చిత్ర కవనం 85, 02.02.2021 మంగళ వారం

 


పై చిత్రానికి మనోహరమైన పద్య/ వచన కవితలు.

 చిత్ర కవనం 85

02.02.2021 మంగళ వారం

 

 

చిత్ర కవనం 85

తేటగీతి

లోకములనేలు తల్లియె లోక మాత

జనుల రక్షణ కోరును జగతి లోన

తడిసె వర్షపు ధారను తనివి తీర

తాను తనయుల నరసెనే తన్మయతన.....

జైకర్ విశ్వేశ్వర్ టోణ్ పె, థానే, ముంబయి

 

 

చిత్ర కవనం 85

ఓ బుజ్జి గణపయ్యా, ఓ చిన్ని కన్నయ్యా,

చూడండి ఆ తల్లి మీపై వాన నీటి చుక్కలు,

పడకుండా తన కొంగు కప్పి ఎలా చెట్టు కిందికి ,

చేర్చిందో,పెద్దయ్యాక మీరూఅలాగే మీభక్తుల కాచాలి

గాంగేయ శాస్త్రి, రాజమండ్రి

 

 

చిత్ర కవనం 85

తేటగీతి..

తల్లి ప్రేమను గొల్వగ త్రాసు గలెదె?

తడిసి ముద్దైన బిడ్డల తానుగాచె

బుడుత లిద్దరు బ్రతిమాలి బుద్దిగాను

యింటి కేగెను తల్లితో జంటగాను..

పి.ఎల్.నాగేశ్వరరావు

 

 

చిత్ర కవనం 85

వానదేవుడు పుడమి తల్లిని పలుకరించంగ

బుజ్జి గణపయ్య తమ్ముడి తో కలిసి తడుస్తూ

ఆటలాడంగ అది గనిన తల్లి గౌరీ మాత  తన

పవిట చాటు  గొడుగు గా చేసి మాతృ ప్రేమని చాట

దేవరశెట్టి నాగమణి

 

 

చిత్ర కవనం 85

అమ్మ

అమ్మే కదా అన్నియు తెలుసుకొని ,రాసుకొని

చెబుతుంది ,చేస్తుంది చేయిస్తుంది , నేర్పిస్తుంది

ఆడిస్తుంది ఆటలు పాడిస్తుంది  పాటలు

వినిపిస్తుంది త్యాగరాజ ఘనపంచ రత్నాలు

వానలో తడిసినా  పరిగెడుతూ పడ్డా

ఖంగారు పడక ఖంగారు పెట్టక

అన్నీ అమ్మే చూసుకుంటుంది

హాయిగా ,చల్లగా, ప్రేమతో !

జి మురళీ  మోహన్ రావు

 

 

చిత్ర కవనం 85

అమ్మను చూచే

చిట్టి తనయులిరువురు ఆడుచుండగా

కురుయుచున్న వాన తెలుసుకొని గబ గబ

పరుగున వచ్చి అమ్మ పార్వdతి

తన చీర కొంగును పరచే గొడుగు  వలె

బుజ్జి గణపతి చిట్టి కుమార స్వామి

చటుక్కున అమ్మ చెంత చేరె

అటుల మువ్వురూ కురిపించే

చిరు నవ్వుల జల్లులు ..

జి మురళీ మోహన్ రావు

 

 

చిత్ర కవనం 85

తేటగీతి

విఘ్నహారియై పెరిమితో వెలిసెనొకడు

స్కందుడై తమ్ముడు మహిమన్ చౌకలించె

ఘనులగుదురుగాకచలమున్ గరిమ వలన

కలదె జనని కొంగున గల కాపు మహిని!

గౌరీనందన్, బెంగుళూరు

 

 

చిత్ర కవనం 85

దేవకాంతయైన నేమి?

మానవ కాంత యైన నేమి?

అమ్మ, అమ్మ యే కదా!

తాను ఏమైనా పర్లేదు

తనపిల్లలు బావుంటే చాలని

తలబోసే  తల్లి మనసు

విలువ కట్ట సాధ్యమా?

ముచ్చటైన ఊహ వచ్చిన

చిత్ర కారునికిదే మా అభినందనలు.

ఉష

 

 

చిత్ర కవనం 85

తేటగీతి

అమ్మకొంగును మించిన యండలేదు

అవనియందని;దెలిపెనీయంబగిరిజ

కొమరులిద్దరిశిరములకొంగుజేర్చి

తడువనీయక జూపెను తల్లి ప్రేమ.

హేమలత

 

 

చిత్ర కవనం 85

అపురూపమైన ఈ చిత్రంలో ఆదిశక్తి లోని అమ్మతత్వం, అపురూపంగా సాక్షాత్కరిస్తోంది.

 ll

అల్లరివేళలందు పరమాద్భుతభావము చిత్రమాయెనే ! 

ఝల్లున మేఘమాలికల జల్లులతో మమతానురాగముల్  

జల్లగ, తెమ్మతెమ్మెరల చల్లనిచూపుల మందహాసమై      

చల్లని ప్రేమభావమది సాంత్వనమై సుమనోజ్ఞరూపమై    

తల్లుల పేర్మిరాగమది తన్మయమొందగ దివ్యకాంతులై !    

కస్తూరి శివశంకర్

 

 

చిత్ర కవనం 85

తేటగీతి

చిన్ని గణపయ్య యన్నతో చిందు లేయ

శైలపుత్రి జతగనాడె సంతు తోడ !!

ముగ్ద మోహన పర్వము  మురిసి చూచి

సురలు విరివాన కురిపించ శోభ తోడ

కొంగు చాటున దాగిరి కొమరు లపుడు !!

అమ్మ తోటి యాటలెపుడు హాయి నొసగు  !! 

రమ

 

 

చిత్ర కవనం 85

ఎండయు వానయున్ నిండుగా ముసరెను జలకమ్ము లాడగా సమయ మిదియె

కుఱ్ఱ తమ్మునితోడ కూడి గణేశుండు వానలో నాటకై పూనుకొనగ

అమ్మ యా పార్వతి యరుదెంచి వారించె చినుకులు బడకుండ చీరఁ బట్టె

జగములనేలెడి జగదంబ యీశ్వరి బాలురఁ జూడంగ పరవశించె

సర్వలోకములను శాశించు తనయులు శర్వాణి యొడిలోన సంబరముగ

 

మాతృ భావనా సౌహార్ద్ర మమత మీర

మురియు చుండిరి పుత్రులు మురిపెముగను

విశ్వమందున తల్లుల విలువఁ దెలుప

శాశ్వతంబుగ చిత్రంబు సాక్ష్యమగును.

ఆదిభట్ల సత్యనారాయణ

 

 

 

చిత్ర కవనం 85

ఆ వె

అన్నదమ్ములిచట నాట లాడగ జూచి

వరుణ దేముడొచ్చె పండుగనుచు

తల్లి పార్వతొచ్చె తనయులు తడువగ

కొంగు గప్పె తాను కూరిమి గను

 

కం||

ఎండన గణపతి, తమ్ముడు,

తిండిని వీడంగనచట తిరుగుచు నుండన్!

దండిగ చినుకులు పడగనె

యండగ నా కన్నతల్లి యచటికి వచ్చెన్!!

 

తే గీ

అమ్మ జేరగ నిరువురు నాటలాపి

కొంగు చాటున నిలిచిరి చెంగునొచ్చి

వాన యందున తడవక పైట నిలిపె

తల్లి ప్రేమను చాటెను పిల్లలకును

కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి

 

 

చిత్ర కవనం 85

తే

అన్నదమ్ముల యాటల కమ్మ మురిసె

నంబ సంతసమ్మును జూచి యవని మెరిసె

ధరణి ముచ్చట గన నీరదములు కురిసె

నొదుగ చెంగుమాటున మోము నోజ విరిసె   

వాణిశ్రీ నైనాల

 

 

చిత్ర కవనం 85

మధురాక్కర

ఆటలాడెడు బిడ్డల నాదరించెడి తల్లివై

నీటి రాయుని జల్లుల నిగ్గు నాడెడు బిడ్డల

గాటపుముదముసొలపులోగారములజననివై

పైటకొంగు పట్టి నిలుపు పరమపావని ధాత్రిపై

ధాటిగ కరుణ జూపెడు దాక్షాయణి ప్రణతులు

వెంకట్.సి హెచ్

 

 

చిత్ర కవనం 85

అమ్మలగన్న అమ్మ

మాయమ్మ మూలపూటమ్మ

కొంగు చాటున ముచ్చటగోలిపే

కోమరులు ఇద్దరూ ఇద్దరే

ఒకరు విఘ్నములకు అధిపతి

ఒకరు దేవసేనాధులకు అధిపతి

ప్రకృతి పులకించగా

వరుణుడే కరుణించగా

మన తనువులే వర్షించగా

మాతృహృదయము పరవశించే

చిన్నారులిద్దరూ సంతోషించగా

కోవూరి

 

 

చిత్ర కవనం 85

తేటగీతి

లోక పాలకులనుగన్న లోకజనని

తల్లి కొంగును ఛత్రిగా తనయులకును

భూజ ముగ కాయు పేర్మితో భువిన తాను

ఆత్మ జుల జూసి మురియుచు అమ్మగాను

గీతాశైలజ



పూసపాటి కృష్ణ సూర్య కుమార్

మకుటము

తెలుసుకొని వోటు వేయుము తెలుగు బిడ్డ

మొదటి  రోజు పంచ గుళికలు    1/2/2021

 

1)తే:

కోట్ల రూకలు వెచ్చించి వోట్లు కొన్న

నేత లెటుల నేల గలరు నీతి తోడ

ధనము తిరిగి సంపాదించ దారు లెంచు

తెలుసుకొని వోటు వేయుము తెలుగు బిడ్డ

 

2తే:

కులము వాడనుచు నతని గుణము వదలి

యేరికోరి యా వ్యక్తిని నెన్నుకొనగ

కళ్ళు నెత్తికెక్కి యతను కాటు వేయు

తెలుసుకొని వోటు వేయుము తెలుగు బిడ్డ

 

3 తే:

మా మతంబు వాడనుచు నో మందమతికి

పట్టుబట్టి నీవు పదవి కట్ట బెట్ట

నల్ప బుద్ది కల్గి నతడు నాదుకొనడు

తెలుసుకొని వోటు వేయుము తెలుగు బిడ్డ

 

4.తే

భూమి దోచు రక్కస గణ భూతములకు

భయము నొoది గూoడాలకు జయము నిడగ ,

మీ గృహమ్మునే ఘనముగా మ్రింగ గలరు

తెలుసుకొని వోటు వేయుము తెలుగు బిడ్డ

 

5 తే:

చదువు లేకున్న నా డబ్బు మదము కలిగి

వెధవ పనులు చేజూతురు పదవి కొరకు

వేలు ముద్ర జనులెటుల నేల గలరు

తెలుసుకొని వోటు వేయుము తెలుగు బిడ్డ

 

వోట్ల పంచ గుళికలు 2

 

6 తే:

చిల్లి బక్కెట్టు తో నీరు చేదలేము,

సందరమున శుద్ధ జలము పొందలేము

వంచకుని లోన మంచిని కాంచబోము,

తెలుసుకొని వోటు వేయుము తెలుగు బిడ్డ

 

7 : తే:

చెల్లి కేనాడు కొనబోడు చీరలేమి,

నాదు చెల్లెళ్ళు మీరంచు నాణ్య మైన

చీరలను పంచు జనులకు నూరులోన,

తెలుసుకొని వోటు వేయుము తెలుగు బిడ్డ

 

8 తే:

దేవుని గుడిలోన తరచు తిరుగు చుండ

భక్తి గలవాడని తలచి పల్లె జనులు

వోట్లు రాల్చగతము వీడి తూట్లు పొడుచు

తెలుసుకొని వోటు వేయుము తెలుగు బిడ్డ

 

9 తే:

దొరికినంత రిలీఫ్ ఫండు దోచ దలచి

నేతలు జనుల పై సాను భూతి తోడ ,

వరద ముంచిగ గ్రద్దలై వాలు చుంద్రు

తెలుసుకొని వోటు వేయుము తెలుగు బిడ్డ

 

10 తే:

తల్లి దొక పార్టి ,యింటిలో తండ్రి దొక్క

పార్టి ,వేరొక పార్టి లో భార్య చేరు ,

నెవరు గెలిచినన్ వారికే పవరు పొసగు

తెలుసుకొని వోటు వేయుము తెలుగు బిడ్డ

 

పూసపాటి 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...