5, ఫిబ్రవరి 2021, శుక్రవారం

25.01.2021 దత్తపది, హర, పర, తర, వర

 


25.01.2021 సోమవారం దత్తపది

*హర, పర, తర, వర*

వీటితో మనోహరమైన పద్య/ వచన కవితలను అందించగలరు.

కవులు/కవయిత్రులు తమ మనోఫలకము మీద తారాడెడు రామణీయ భావనలను వెలికి తీసి, సుమనోహర వన్నెయల నద్ది తేనియల దిటవు తెలిపెడి కవితలల్లి, సమూహాము తేజరిల్లు నట్లు ఘనత చేకూర్చగలరని విన్నపము.

 

 

విజయ పతకం

తర తరాలుగా పండుచున్నపచ్చటి పొలాలు

వరబడి ఎండుచుండగా పరస్పర సహకారములతో

సకాలములో విజ్ఞానంబును  పరిపూర్ణముగా వాడుకొనుచూ

ఆ హరణమును,అరిష్టమును  అదుపుచేసి హరితముగా

మార్చగలుగుటచే వచ్చె వారికి పతకం గణతంత్ర దినమున !

జి మురళి మోహన్ రావు

 

 

కం||

హర హర యని బలుకగనే

పరవశమును బొందు జనులు పండుగ వోలెన్!

తర తరములు గానిదియే

వరమాయెను లోకమెల్ల పంకజ నాభా!!

 

కం||

 

సరదాగా వ్రాయదలచి

పరుగులిడుచు వచ్చి నేను పడితినిచటనే

హర, పర, తర, వరమనుచున్

దరిజేరెను పదములిచట దత్తపది కహో!!

 

కం||

సరిహద్దున పహరాలో

పరదేశపు వారి నెపుడు వరదగ  ముట్టన్!

తరచుగ తా మెపుడైనను

నెరుపెక్కిన కొలిమి వోలె నెదురుగ నిలుచున్!!

కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి

 

 

 కం.

వర విక్రయ మిల తొలగక

తరుణీ హృదయము హరహర! దావానలమే

పర ధనము కోరకుడు యువ

తరమే పూనుకొనవలయు దానిని తరుమన్.

డి.రామ నాగేశ్వర రావు

 

 

భక్తి మెండుగ హరయన భవుడు మెచ్చు

దళము తోడను బూజింప తరలి వచ్చు

వరములొసగునురయమున భక్తులకును

ముక్తి నిచ్చును పరమాత్మ ముదముగాను.

హేమలత

 

 

నింగి దొంతరలన్ దూర నిప్పుమూట

యదను జూచి నీరధరము లాక్రమించ

నంపర కరములన్ దమోహరమొనర్చి

కావరమును ద్రుంచగ వచ్చె కర్మసాక్షి

 

అంపర= బాణములు

నీరధరము=మబ్బు

వాణిశ్రీ నైనాల

 

 

హర హర శంకర అనుచు భక్తులు

తరతమ భేద భావంబు లేకుండా

శివ నామస్మరణ చేయుచుండ

పరబ్రహ్మ స్వరూపుండు ఆ భవుండు

ప్రీతితో వరంబు లోసంగె

దేవరశెట్టి నాగమణి

 

 

తమ్ముడు శివ పరిచయం చేసిన ఆముక్తమాల్యద ,

మొన్న ధనుర్మాసం లో ముళ్ళపూడి వారి మేలుపలుకుల

మేలుకొలుపల స్పూర్తితో ఈ పద్యం🙏

కందము

 

హరి పూజలు గోద సలిపె

పర మాత్ముని కోరి పతిగ !! భవ హర ముగ తా

వర మడుగుచు హేమంతపు

తర గల తోడుగ కుసుమపు దామము లంపెన్ !!

రమ

 

 

కందము

హర హర మహదేవ యనుచు

పరమాత్మను సన్నుతింప భక్తుల కొరకున్

తరలి పరుగులిడి కోరిన

వరములనిచ్చెడి మహేశ! వందనమిదిగో

జైకర్ విశ్వేశ్వర్ టోణ్ పె, థానే, ముంబయి

 

 

 

ప్రకటిత తేజ పుంజముల భానుడు  తూరుపు నావరింపగన్

వికసిత పద్మముల్ విసురు వైభవ పూరిత సౌరభమ్ములన్

ముఖముల తేటియల్ గరపు పుష్కళ నాదము ప్రజ్వరిల్లగన్

బెకబెకలాడఁ గప్పలవె భీతిలి పారెను  పాము గ్రక్కునన్

ఆదిభట్ల సత్యనారాయణ

 

 

పటుతర కౌముదుల్ కురియు పద్య విభావ మనోహరంబులై

విటపుల శాఖలన్ నిలిచి విస్త్రుత కూజిత కోకిలమ్ములై

చిటపట రాలుచున్ వరలు చిన్కుల జల్లుల సోయగమ్ములై

నటనల భంగిమల్ దెలిపి నవ్యసమాజపు మోదయుక్తమై

ఘటిత పరంబులన్నొసగు కామిత కోర్కెల కల్పవృక్షమై

ఘటనలు సంభవించవలె గౌరవమేర్పడ మాధురమ్ములై

ఆదిభట్ల సత్యనారాయణ

 

 

తేటగీతి

1

హరహరాయన్న హంసుడు వరములిచ్చు

నరుడి గాబుట్టి పరతత్వ మెరుగ లేదు

వగపు తరగల బ్రతుకులు పరితపించ

నిన్ను శరణు కోరితినయ్య నీల కంఠ!

 

2

పరము వరమను తలపుల ప్రాకు లాడి

హరిహరాదుల నెఱుఁగంగ నడ్డ గించు

మోహపు తరగల్ శమియించి ముక్తి నొంద

నిన్నుశరణు కోరితినయ్య  నీలకంఠ!

 

3

యిచ్చిన వరములికచాలు యిందు మౌళి!

భవహరణమొనరించుచున్ పరము నిమ్ము

తత్తరము తొలగించి నా తాప మార్ప

నిన్ను శరణు కోరితినయ్య నీలకంఠ!

అవళూరు సీత

 

 

తేటగీతి...

భవహరా! శంకరా! శివా! ఫాలనేత్ర!

సాంబ! వరమిడు పరమేశ! చంద్రచూడ !

నన్ను గాచగ తరలిరా నైకరూప

కష్టభావము దరిరాక గావుమయ్య....

పి.ఎల్.నాగేశ్వరరావు

 

 

హర హర! పర మ శివ ! భక్త వర ద ! తర ళ

హృదయ ! యి తర ములెరుగక నేను నేడు,

భవ హర మగు నీదు చరణద్వయమును నిర

తము, పర వశత్వమున  నా హృదయకు హర ము

నందు నిల్పి, నన్  గావుత నంజలింతు !

వెంకట రమణ


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...