14, ఫిబ్రవరి 2021, ఆదివారం

31.01.2021, ఆదివారము, పుస్తక సమీక్ష

 


31.01.2021, ఆదివారము

పుస్తక సమీక్ష

 

 

ఆర్. కె.నారాయణ్  గారి మాల్గుడి డేస్

తెలుగు తేనీయల సభ్యులకు పాదాభివందనం, ఉరుముల్లేని మెరుపులా, మబ్బులేని చినుకులా ఇలా అథాటున వచ్చేసినందుకు.. ఎలక్షన్లయ్యాకా కనపడని రాజకీయ నాయకుడిలా నక్కి కూర్చున్నందుకు క్షమిస్తారని పడి పడి దండాలు పెడుతున్నాను.

 

ఈరోజు-రేపట్లో నేను పరిచయం చేయబోయే కథల గురించి చెప్పబోయే ముందు , ఆ రచయిత గురించి కూసింత...

 

ఆదివారాల్లో మనం చూసే రామాయణ, మహాభారతాలు, జంగిల్ బుక్ , పుత్లీ బాబా , చార్లీ చాప్లిన్ వగైరా సీరియళ్లతో ధీటుగా వచ్చిన కథల పొత్తం "మాల్గుడి డేస్" ఆ సీరియల్ చూస్తున్నంత సేపూ మన వీధిలోనే జరుగుతోందేమో అన్నట్టుంటాయ్ కదూ , ముఖ్య పాత్రధారునికి ఏదోక సమస్య ఉంటుంది, వీలైతే దానికి పరిష్కారం కనిపెడతాడు, లేదా దానితో జీవించడం అలవాటు చేసుకుంటాడు ..

 

మాల్గుడి డేస్ పుస్తకంలో ముప్ఫై  పైగా కథలున్నాయ్...

 

అసలు , ఈ మాల్గుడి అనే ఊరు ఎక్కడుంది అని ఎవరైనా అడిగితే , సౌత్ ఇండియాలోని మారుమూల కుగ్రామం అంటే అది సగం అబద్ధమే , అందులో కేరెక్టర్స్ మాత్రం ప్రపంచమంతా కనిపిస్తారంట !!

 

మాల్గుడి అనే ఊరు రచయిత గారి ఊహాలోకమట , యూనివర్సిటీ ఆఫ్ చికాగో అయితే ఏకంగా Literary Atlas లో మన భారతదేశ పటంలో మాల్గుడి అనే ఊరుతో సహా ప్రింట్ చేసారట.

 

మన దేశంలో భిన్నమైన మనుషులు, వ్యక్తిత్వాలకి కొదవలేదు, రకరకాల సంస్కృతి, సంప్రదాయాలు , జీవనవిధానాలే బోలెడు కథలను సృష్టిస్తాయి , తనకు తారసపడిన వైవిధ్యమైన వ్యక్తుల రూపమే తన కథల్లోని పాత్రలట, జస్ట్ , మన కిటికీలోంచి బయటకు చూస్తూ మనకి నచ్చిన పాత్రని ఎన్నుకోవడమేట.(చాలా వీజీగా చెప్పేసారు కదా).

 

'నాకు మీ కథల్లోని వాళ్ళని కాస్త నాకు పరిచయం చేస్తారా?, ఒక డాక్యుమెంటరీ తీసుకుంటాను' అని  లండన్ లో ఉన్నప్పుడు ఎవరో టెలివిజన్ ప్రొడ్యూసర్ అడిగారట,.. కుదరదండీ , నేను చాలా బిజీ, కొత్త నవల రాస్తున్నాను , అన్నారట మన రచయిత !!

 

మరో మాల్గుడి నవలా? ఏమిటి కాన్సెప్ట్? అని అడిగారట!!

మనిషిని ఆవహించిన పులి అని చెప్పి తప్పించుకుంన్నారట మన రచయిత...

ఆ కొంటె రచయిత పేరు ఆర్.కె.నారాయణ్

ఆయన వ్రాసిన ఓ రెండు మూడు కథలు నెమ్మదిగా పరిచయం చేస్తాను ...ఓఖే నా ?

****

 

కుక్క అంటే మనిషికి మంచి స్నేహితుడంటారు , ఒక్కరోజు తిండిపెడితే చాలు, జీవితాంతం మనకి నమ్మినబంటులా ఉంటుందంటారు , క్రైమ్ సీన్లలోకి దూసుకెళ్లి వాసనతో నేరస్తుని పట్టించే శక్తి ఒక కుక్కకే ఉంటుంది. 24గంటలు కాపలాగా ఉంటుందని వయసైన వారు చాలామంది తోడుగా కుక్కని పెంచుకుంటారు , దొంగతనాలు అవీ జరక్కుండా చూసుకుంటుందని, గుప్పెడు కూడు తిని గంపెడు సాయం చేస్తుందని కుక్కని తెచ్చుకుంటారు, మనుషుల్ని నమ్మని వారుకూడా కుక్కల్ని నమ్ముతారు..... అటువంటి  పెంపుడు మహాకుక్క కథే...

 

ఈ అట్టిలా- ఒక హీరుని కథ:(వీరుడు+హీరో)

 

చుట్టుపక్కల దొంగతనాలు పెరిగిపోతున్నాయ్, కాపలాకి కుక్కని పెంచుకుందామని , ఒక మంచి నల్ల మచ్చల హుషారు కుక్కపిల్లని సెలెక్ట్ చేసుకొని, ఆర్నెల్లలో జనాలని అల్లాడిస్తుందని నమ్మి , ముందుగానే అడ్వాన్స్ ఇచ్చి నెల తర్వాత ఇంటికి తెచ్చుకుంటారు , తర్జనభర్జనలు , కాదు-లేదుల మధ్య ఇదేదో పెద్దయ్యాక భారీగా ఉద్దరిస్తుందని ముచ్చటపడి ,  ధైర్యం అనే అర్థం వచ్చేలా  దానికి అట్టిలా (యూరోప్ నాయకుని పేరు ట) అని పేరు పెట్టారు.

 

వీళ్ళనుకున్నట్టు దేహాన్ని ఏపుగా పెంచుకున్న శునకరాజు అట్టిలా గారు , బుద్ధిలో మాత్రం వీళ్ళ అంచనాలను తారుమారు చేస్తుంది , కుంభాలు , కుంభాలు మెక్కి బద్ధకం గా కార్పెట్ కి పోటీగా ఒళ్ళు పరుచుకుని పడుకుని. కొత్తవాళ్ళు ఎవరైనా వస్తే రయ్యని పరుగెత్తుకెళ్ళి , వాళ్ళు భయపడితే ... అబ్బెబ్బే...హి హి హి ,  మీరు నన్ను తప్పుగా అనుకున్నారు నేను చాలా మంచిదాన్ని , నాకెలాంటి పాడు ఉద్దేశ్యాలు లేవు  అని తోక ఊపి మర్యాద చేస్తుంది.

 

కొన్నాళ్ళకి , వీళ్ళు నన్ను చూసి భయపడుతున్నారు కదా, ఈ శ్రమకూడా పడటమెందుకని , గేట్ చప్పుడైతే అటు చూడటం, ఏదో మోహమాటానికి తోక ఊపడం లాంటి చేష్టలతో, ఇంట్లో వాళ్ళకి తిక్క రేగిస్తుంది.

 

దీనికి "గుడ్డి పురుగు" అని పేరు మార్చితే బాగుంటుందేమో,  చూడండని ఎవరో ఓ సలహా  ఇస్తారు !!

 

నిజమే , తిండి మాత్రం ఏనుగులా తింటుంది, ఇది తినే తిండిని ఇద్దరు మనుషుల్ని పెట్టి లెక్కపెట్టించాలి , కనీసం పెరట్లో పూలు ఎత్తుకెళ్ళే వాళ్ళని కూడా ఏం చేయదని అమ్మ కోప్పడుతుంది..

 

దీనికేం అంత ఖర్మ పట్టలేదు , రాత్రంతా నిద్రపోకుండా ఇల్లంతా తిరుగుతూ పహారా కాస్తుంది తెలుసా ? అని వెనకేసుకొస్తాడు చిన్న కొడుకు.

 

అమ్మయ్యో!!  అలా అయితే , దాన్ని రాత్రి పూట కట్టి పడేయ్, లేదంటే, రండి రండని ఇదే దొంగని పిలిచి  ఇల్లు చూపిస్తుంది , అని వెక్కిరిస్తుంది!!

 

వాడి కోపం వస్తే వచ్చింది కానీ , మన హీరో ఏ చెవితోనో విందేమో, ఆ రాత్రి ఆ లోటు కూడా తీర్చేసింది !!

 

అర్థరాత్రి :, చిమ్మచీకటి... కాకులు రెక్కలు కప్పుకుని గూట్లో బొజ్జునే వేళ , నక్కలు కో....యని ఊళ పెట్టి చుట్టుపక్కల వారికి వెర్రెక్కించే వేళ...ఆ సుముహూర్తాన, ఆ వీధిలోకి ఒక దొంగ వెధవ ఎంటరయ్యాడు ....

వాడి ఇంట్రో...

 

రంగ - ద దొంగ , ఊరికి 3 మైళ్ళ దూరంలో కూలీగా ఉంటూ, అప్పుడప్పుడు రాత్రుళ్ళు ఊర్లోకొచ్చి దొంగతనాలు అవీ చేయడం వాడి హాబీ ...

 

ఈరోజు రాత్రి అట్టిలా గారి ఇంటికి ఆ లాటరీ తగిలింది , మొత్తం దొంగిలించి పారిపోదామనుకుంటుండగా మన తిమ్మరాజుగారి కంటపడ్డారు , కండపట్టి పీకుతుందేమోనని భయపడితే.. ఛా.. నేనసలాటైప్ కాదబ్బా , అని వాడి కాళ్ళమీద పడి , వాడు గేట్ తీసుకుని పారిపోతుంటే స్వేచ్ఛా పావురంలా వాడి వెనకాలే ఇంట్లోంచి బయటకి పోతుంది !!

 

రంగాగాడు నాకు చాలా మంచి స్నేహితుడని నిర్ణయించేసుకుని , వాడితోనే స్నానం, పానం, పయనం అని డిసైడ్ అయ్యి , వాడినే అంటిపెట్టుకుని తిరుగుతూ ఉంటుంది అట్టిలా !

 

ఇంట్లోంచి అర్థాంతరంగా మాయమైన కుక్క గురించి, హఠాత్తుగా జరిగిన దొంగతనం గురించి చర్చించుకుంటూ... నేను చెప్పాగా , ఇదే వాడికి పంచిపెట్టి ఉంటుంది అని, తిడుతుంది తల్లి!!

 

అదే ముందు వెళ్లి ఉంటుందిలేమ్మా ,  వాడు తర్వాత వచ్చి ఉంటాడు... మళ్ళీ చిన్నకొడుకు వెనకేసుకొస్తాడు !!

 

ఏదైతే అదయింది ,ఓ గోల వదిలింది ,  ఒకవేళ వాడే కుక్కని ఎత్తుకుపోయి ఉంటే, ఆ నగలు వాడికి బహుమతిగా ఇచ్చాననుకుంటాను...  తల్లి సంతోషిస్తుంది.

 

ఒక వారం తర్వాత మార్కెట్ కి వెళ్లిన పెద్దకొడుక్కి, అట్టిలా ఎవరి వెనకాలో తోక ఊపుతూ తిరుగుతూ కనిపిస్తుంది..

 

ఓయ్... అని , పెద్దాడు పొలికేక పెడతాడు, ఆ అరుపుకి ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసిన రంగా , భయపడి  ముందుకి పరుగందుకుంటాడు  ..

 

నా ఫ్రెండ్ నన్నొదిలి వెళ్తున్నాడు , అలా జరగడానికి వీల్లేదని , వాడి వెనక అట్టిలా పరుగుపెడుతుంది, వాళ్ళని తరుముతూ , పెద్దోడు పెరిగెడతాడు.

 

ఓయ్....అట్టిలా........ అనే పెద్దాడి పిలుపుకు పలకాలని ఉన్నా, ఫ్రెండ్ ని మిస్  అవుతానేమోనని, ఓసారి పిలిచినవాడికేసి "నీ సంగతి తర్వాత చూస్తా , ముందు నా పనికానీ" అన్నట్టు చూసి, మళ్ళీ రంగా వైపు పరుగెడుతుంది.

ఆ పరుగులో రంగ చొక్కాలో దాచుకున్న వాడు దొంగిలించిన ఓ నగ బయట పడుతుంది , అది తమదేనని గుర్తించిన పెద్దోడు , ఒక్క ఉరుకున ఎగిరి వాడి మీద కూర్చుని ఓ నాలుగు పీకుతాడు.. ఈలోగా పోలీసులు , జనాలు గుమిగూడి ... కుక్క దొంగని పట్టించిందనుకుని , అట్టిలాని హీరో చేస్తారు !!


 సీను మారి ... ఇంట్లో సీన్లో అమ్మ కూడా అట్టిలా తెలివైనదని ఒప్పుకుంటుంది.


ఒకవేళ అట్టిలాకి మాటలు వచ్చుంటే , అది  చెప్పిన వివరాలకి వీళ్ళ కాళ్ళకింద భూకంపమే వచ్చుండేది, కదా?


ఇదండీ...మాల్గుడీ డేస్ నుంచి అట్టిలా అనే కథ , టైటిల్ చదవగానే మావాడి ఇంగ్లీష్ లిట్ బుక్ లో చదివిన గుర్తు వచ్చి అడిగితే , 8th లో ఉంది ఈ కథ అని చెప్పాడు, మళ్ళీ ఓ సారి ఈ కథ తలుచుకుని ... నవ్వుకున్నాం ... నేను తర్జుమా చేసిన నా కాకరబీకర  భాషని చూసి నవ్వు రాకపోయినా మోహమాటానికైనా నవ్వుతారని ఆశిస్తూ...

 మళ్లీ సాయంత్రమో, రేపు రాత్రో, మరో వారమో.. ఇక్కడే ఇదే వేదికపై , ఇంకో కథతో మీ ముందుకువస్తానని మాటిస్తూ, ప్రస్తుతానికి ... అంతవరకు సెలవు , నమస్కారం !!

విష్ణుప్రియ

 

************* 

 

 

కొన్ని రకాల పద్యాలని, కొంత సులువుతో రాయడానికి,ఆయా పద్యాలని, వాటి వాటి  ప్రత్యేకమైన నడకల లయలతో చదువడానికి/పాడడానికి,తేలిక పద్ధతులు,  కొన్ని టిప్స్..మీతో పంచుకుంటాను ఈ రోజు...

 అలాగే, మన సమూహంలో, వచనకవిత్వం అమోఘంగా రాస్తూ, మెప్పిస్తూ ఉన్న, క్రొంగొత్తగా పద్యాలు రాయాలనే ఉత్సాహవంతులైనవారు ఎవరైనా ఉంటే.. వారికోసం కూడా .. ఈ టిప్స్ పంచుకుంటాను... ఈ రోజు తిరిగిపోయే లోపుగా..

 నేటి వచన/గద్య/భావ కవులని మేటి పద్య కవులుగా చూడాలనే చిరు ఆశతో,నే చేసే చిరు ప్రయత్నమిది.

 క్రొంగొత్తగా పద్యరచనకు శ్రీకారం చుడదామనుకునే మన మిత్రబృందం కోసం,అలాగే వచన కవిత్వంలో మనకు తేనెలు పంచుతూ, పద్య రచనపై అంతగా దృష్టి సారించని వచన కవుల కోసమూ..  వారికి పద్య రచన అనుకునేటంతటి కష్టం కాదు; ప్రయత్నం చేద్దాము అనే అభిలాష కలిగించడానికి.. నా చిరు జతనము... ఒక రకంగా ఇది ఫోనెటిక్స్ తో పద్య రచన.. అనే ప్రయోగమే...

 

యథాప్రకారం,దీనికి అవసరమైన ఒక "పెద్ద" పిట్ట కథ చెప్పాలి..ఇది నిజంగా జరిగిన కథే...

మేము, ఒక సంక్రాంతి సెలవులకి మామేనమామ గారింటికి, రాజమండ్రి వెళ్ళాం..1977 లో..నాకు అప్పుడు 14 యేళ్ళుంటాయి.నేను 9 వ తరగతి చదువుతున్నాను,అప్పుడే కొద్దిగా కొద్దిగా తెలుగు వ్యాకరణం-

సంధులు,సమాసాలు; ఇంకా.. వివిధ రకాల పద్యాల ఛందస్సు, స్కూల్ లో సిలబస్ లో ఉన్నవి  నేర్చుకుంటున్నాను. నాకు, సహజంగానే తెలుగు అంటే మక్కువ ఎక్కువ అనీ, నేను తెలుగులో ఎప్పుడూ చాలా మంచి మార్కులు తెచ్చుకుంటాననీ, క్లాస్ ఫస్ట్ గా వస్తుంటాననీ మా మామయ్యకి, మా అమ్మ ద్వారా తెలుసు. ఆయన అప్పుడు, రాజమండ్రి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు లెక్చరర్ గా పనిచేస్తున్నారు; ఆయన స్వయంగా అష్టావధాని కూడా. (నాకప్పుడు అష్టావధానం అంటే ఏంటో పెద్దగా తెలియదు).

నన్ను సరదాగా ఆట పట్టిద్దామానో, లేక,నాకు పద్యాలు రాయాలనే జిజ్ఞాస కలిగించాలనో.. తెలియదు.. నన్ను సంధులు, ఛందస్సు ఏమేమి వచ్చు ?  అని క్యాజువల్ గా అడిగారు.నేను కొన్ని సంధులు... త్రిక సంధి లాంటివి.. (ఎందుకంటే త్రికసంధికి 3 సూత్రాలు ఉంటాయి కదా.. నేను,అవి  ఒప్పచెప్పడం అప్పట్లో గొప్పగా, గర్వంగా భావించే రోజులు).. ఇంకా గణాలు,కొన్ని పద్యాల ఛందోనియమాలూ వచ్చు అని చెప్పి, నాకు తెలిసిన ఆటవెలది, కంద, ఉత్పలమాల, చంపకమాల లాంటి ఎగ్జాం కి ఇంపార్టెంట్ అయిన 4,5 రకాల పద్యాల ఛందస్సు.. భ, , , , , , వ లాంటివి, గర్వంగా  గడ గడా,ఏకరువు పెట్టాను.. "భేష్. బాగుంది. మరి.. నువ్వు ఏదైనా పద్యం రాయగలవుట్రా ?" అని అడిగారు.తెల్ల మొగం వేయడం నా వంతయింది. "చూడు, మా చక్రి చేత, నువ్వు ఇచ్చే ఏ విషయం మీదయినా సరే... ఆశువుగా పద్యాలు చెప్పిస్తాను.. చూస్తావా మరి ?" అన్నారు.. నేను సంశయంగా.. నమ్మలేనట్లు చూస్తూ సరే మామయ్యా అన్నాను. అన్నట్లు, చక్రి అంటే, ఎవరో మీకు చెప్పలేదు కదూ.. మా మామయ్యగారి రెండో అబ్బాయి. అప్పటికి వాడికి 5 యేళ్లే...

సరే.. బస్తీ మే సవాల్ అని, నేను, మా బుడతడు చక్రి బావ మరిదికి.. ముందు కంద పద్యం లో పరీక్షిద్దామని..,చుట్టూ చూసా దత్తపది కోసం.. అప్పుడు నా మరదలి పిల్ల తలలో కనిపించాయి పువ్వులు.(నా మరదలు పిల్ల .. అప్పుడు తొమ్మిదేళ్ల పాప.. ఇప్పటి నా కాంతమేలెండి). సరే.. పువ్వులు.. మీద చెప్పరా చూద్దాం అన్నాను నవ్వుతూ.. నాకు విపరీతమైన నమ్మకం.. చెప్పలేడని.. ఎందుకంటే వాడు ఒఠి ఐదేళ్ల నిరక్షరకుక్షి; నిరక్షరాస్యుడు(అంటే వాణ్ని అప్పటికింకా బళ్ళో పడేయలేదు లెండి, అందుకుని).

వాడు ఠక్కుమని

పువ్వుల నిచ్చిరె యిప్పుడు;

 

 (పు)వ్వులతో మనకు నేమి (పు)వ్వులు పువ్వుల్"

అన్నాడు. నేను విస్తుబోయాను..

సరే, ఈ లోపల,గది మూలగా, చెప్పులు కనిపించాయి.. గొప్ప దత్తపదులేమి తెలిసేడుస్తాయి నా బుఱ్ఱకి అప్పట్లో ?  అంతే.. చెప్పులు మీద చెప్పు అన్నాను..అందుకున్నాడు..

 

చెప్పులు తెచ్చిరి అప్పుడు

 

(చె)ప్పులతో తనకునేమి  (చె)ప్పులు చెప్పుల్

 

గబగబా, ఓ కాగితం మీద రాసుకున్నాను ఆ కంద పద్య పాదాలని..గణ,యతులలో  తప్పులు పడదామని...

తరువాత.. "ఉత్పలమాలలో దత్తపదులు ఇస్తావా మరి ?" అన్నారు మామయ్య నవ్వుతూ. వృత్త పద్యాలు. పేద్ధ పేద్ధ పద్యాలు గదా..చాలా కష్టమైనవి అనే భయంతో కూడిన గౌరవంతో కూడిన భక్తి భావం తో చూడబడే  పద్యాలు వృత్తాలు నాకు..

దొరికాడు బావగాడు బాగా!! అనుకుని... ఈ సారి ఒకే సారి నాలుగు దత్తపదులిచ్చి.. కన్ఫ్యూజ్ చేద్దామని, మా చక్రికి.. పువ్వులు,నవ్వులు, *గవ్వలు,గువ్వలు.. మీద.. ఏదీ చెప్పు చూద్దాం  ఉత్పలమాల  అన్నాను..

అంతే..4 సెకనులలో..వాడి 4 పాదాల ఆశు  ఉత్పలమాల.. జలపాతంలా ..జలజలా రాలింది వాడి నోటంట ఆశువుగా..

 

(పు)వ్వులు కోసినారు మరి (పు)వ్వులు పువ్వులు ఎన్ని పువ్వులో!

(న)వ్వులు పూసినాయి మరి (న)వ్వులు నవ్వులు ఎన్ని నవ్వులో!

(గ)వ్వలు చేసినారు కద! (గ)వ్వలు గవ్వలు ఎన్ని గవ్వలో!

(గు)వ్వలు కూసినాయి ఇట (గు)వ్వలు గువ్వలు ఎన్ని గువ్వలో!

 

ఈ 4 పాదాల పద్యమూ రాసుకున్నా కాగితం మీద..

యమాతారాజభానసలగం.. అనుకుంటూ, వేళ్ళతో, గాలిలో గణాలు చూసుకుంటూ..  ఆ ఆశు కంద, ఉత్పలమాల పద్యాల పాదాలని  గణ విభజన చేసి, పీకి పాకం పెట్టా.. ఊహూ.. ఎక్కడా  గణాలలో గాని, యతిలో గానీ, ఆ ఐదేళ్ల బుడతడి ఆశు కవిత్వంలో..ఒక్క్హ  తప్పు.. మచ్చుకైనా దొరికితే ఒట్టు...

 

(బ్రాకెట్స్ లో ఉన్నవి యతి స్థానాలు)..

మీరూ ఒకసారి తప్పు లు పట్టుకోడానికి ప్రయత్నం చేద్దురూ!

 

"వేరే పద్యాలు try చేస్తావా ?" అన్నారు మామయ్య. చాలు మహా ప్రభో! అని... ఐదేళ్ల నిరక్షరాస్యుడితో.. ఆశువుగా ఒక్క తప్పుకూడా లేకుండా పెద్ద, పెద్ద పద్యాలు చెప్పించగలిగిన అష్టావధాని మా మామయ్య చాతుర్యానికి,ఒళ్ళు పులకించిపోయి, పాదాభివందనం చెయ్యడానికి సిగ్గేసి, ఎక్కితొక్కే చనువు బాగా ఉండడం వల్ల,గాఠిగా కౌగలించుకున్నాను... మా బంగారు మామయ్యని.

 

ఇక,అక్కడ సెలవులలో ఉన్నంత కాలం..రోజూ మా చక్రిని ఎత్తుకుని... చాకలెట్స్, బిస్కెట్స్ గురుదక్షిణ గా ఇచ్చుకుంటూ, తెలుగు పద్యాలు ఎలా రాయాలి ?... సారీ.. సారీ.. ఎలా చెప్పాలి ?.. అనే కిటుకులు నేర్చుకుంటూనే గడిపేసా.

( పద్యమే కాదు.. అ,ఆ లు కూడా రాయడం వాడికి అప్పటికి రానేరాదుగా.. ఆశువుగా చెప్పడమే వచ్చు మరి)

 

ష్. ష్... ఈ విషయం రహస్యం... ఎవరికీ చెప్పకండేం !! 9 వ తరగతి వెలగబెట్టేవాణ్ని నేను ...నా పరువు పోతుందిగా మరి

 

ఈ పద్య పాకాన్ని మధ్యాహ్నమే ఎసట్లో వేస్తానని చెప్పాగదా మీకు..అన్నట్లే వేసాను... కానీ మన మిత్రులు ఎవరో (విష్ణుమాయగారే అనుకుంటా), ఈమధ్యన వారి కవితలో అన్నట్లు, పొయ్యి మీద పెట్టా.. కానీ,పొయ్యి వెలిగించడమే మర్చేపోయా..

 

అనుకోకుండా.. ఈ రోజు,5,6 గంటలు బయటికి వెళ్లాల్సి వచ్చింది... అందుకే పద్య రచన సులువుగా వంట బట్టించకునే కొన్ని టిప్స్, అనుకున్న సమయానికే వండడం ఈ రోజు కుదరలేదు.. రేపు.. స్వేచ్చా సమర్పణ సమయానికి, సాయంతన ఆరు గంటల తరువాత,  మీతో వాటిని పంచుకుంటాను.. ఆడియో కూడా ఒకటి.. తయారు చేద్దామని ప్లాను...అలస్యానికి చింతిస్తూ...

 

ఈ సుదీర్ఘ ఉపోద్ఘాతానికి, నా రాబోవు పోస్టింగ్ కి, కొంత సంబంధం ఉంది..

ఈ బాల ఆశు పద్య కవన క్రీడ ఉన్న ముందు మాట, మీకు కొంతైనా వినోదం ఇచ్చిందని ఆసిస్తూ...

 

మీ.... వట్టెం వెంకట రమణ


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...