8, ఫిబ్రవరి 2021, సోమవారం

28.01.2021, చిత్రం - భావం

 


 

28.01.2021 గురువారం

చిత్రం_కవనం

పై చిత్రానికి మనోహరమైన పద్య/ వచన కవితలను అందించగలరు.


  కవులు/కవయిత్రులు తమ మనోఫలకము మీద తారాడెడు రామణీయ భావనలను వెలికి తీసి, సుమనోహర వన్నెయల నద్ది తేనియల దిటవు తెలిపెడి కవితలల్లి, సమూహాము తేజరిల్లు నట్లు ఘనత చేకూర్చగలరని విన్నపము.

 

అంబుధి యొడినివిడి తన యంచు చేర

పురిటికందు కొడలు దుడిచి బులుపునొంది

తాను బులుముకొని నింగి తనరుచుండ

సోమబంధుని సొబగులు జూడ లెమ్ము

వాణిశ్రీ నైనాల

 

 

వచనం,

వెన్నంతా మింగేశావుగా,

ఉండ్రాళ్ళ వేపు చూడకు,

ఇదిగో ఇది తీసుకుని,

నా ఉండ్రాళ్ళు నాకుంచు కన్నా....

గాంగేయ శాస్త్రి, రాజమండ్రి

 

 

 

తేటగీతి

వెన్న దొంగకి ఉండ్రాళ్ళు ప్రేమ తోడ

బెట్టు చుండె గౌరిసుతుడు ; విష్ణు మాయ

కాదు చిత్రకారునికుంచె ఘనత కనుడు

తాను గీయును చిత్రాలు తన్మయముగ

రూపు నిచ్చును బ్రహ్మ యై రుజువు యిదియె

రమ

 

 

చాలున్ వెన్నయుపాలు నెయ్యి తినగన్  శ్యామాంగ శోభామణీ!

నీలీలామృత గాధలన్ గనగ వాణీశుండు పంపించెలే!

క్రోలన్మోదక భక్ష్యముల్ కరుణఁ నేకోరంగ మోదంబునన్

బాలా! కృష్ణుడ! నీ మనోభి విలస ద్వాంఛల్ జగత్శ్రేయమౌ

ఆదిభట్ల సత్యనారాయణ

 

 

 

ద్విపద మాలిక

చిన్నికన్నయ్య జూపె చిట్టి నోటినిగ,

వెన్నముద్దలు జాలవే?నీకనుచు,

కన్నుగీటుతు బెట్టె గణపతి లడ్డు.

నన్ను జూడమనుచు దలయె త్తె విటము.

ఉష

 

 

పాల బుగ్గల  ముద్దుల బాల లేను

తోడ చేరుచు ఆడెను దొంగ యాట

చిలిపి అల్లరి చేయుచు చిన్న వారు

ముద్దు ముద్దుగ నుండెగ మురిసి పోవ

 

 

( చిత్రవర్ణన గాక,  అందున్న శ్రీ కృష్ణుడు, గణాధిపతులపై పద్యము వ్రాసే చిరు ప్రయత్నం. గమనించగలరు. )

సీసము  

భారతి నుదుటిపై భారతమ్మును దిద్ద విఘ్నరాజుగ  నిల  వినుతికెక్కె

ధార్తరాష్ట్రులనెడు దూర్తుల దునుమాడి యుద్దనీతిని జూప యోధుడితడు

భారత గాథలన్ భవ్యమగు తెఱగు శాసించి, భాసించ శౌర్యుడతడు పండిత, పామరుల్  పరికించి జూడగ నా యిద్దరొకచోట నాడుచుండె

 

తేటగీతి..

కృష్ణ , గణనాధు లిరువురు దృష్టి బెట్టి

నేటి భారత వ్యథలను నెమరు వేసి

ప్రజల హితము గోరి తిరుగ వ్రాయదలచె

భరత జాతిని పీడించు బాధలెల్ల...

 

తేటగీతి..( సరదా పద్యం )

అరటి, యుండ్రాళ్లు ప్రేమతో నారగించి

వెన్న నొదలను తెమ్మనె  చిన్నికృష్ణు

కరొన వుందని వారింప కరివదనుడు

వాక్సి నుందని వివరించి వాదులాడె...

 

తేటగీతి...

మీరు మెచ్చిన జీతము మీకు వచ్చు

గొప్ప మనసుతో మెలగండి, గోల వద్దు

ఇంద్ర చంద్రాదు లొచ్చినా యిచ్చి తీరు

నమ్ము, నా మాట మిత్రమా!  సమ్మతించి..

పి .ఎల్.నాగేశ్వరరావు

 

 

అఖిల విశ్వమున్జూపెడి  యాయనునికి,

కుడుముఁ కుడుచంగ చిత్రంబగు గద చూడ!

బొజ్జగణపయ్య స్వయముగ భోజ్యమిడిన,

చిన్నబుచ్చునా సుముఖుని చిలిపి క్రిష్ణ!!

డా. నాగులపల్లి

 

 

 

తే. గీ.

వెన్న ప్రతిరోజు తిన నీకు వెగటు కల్గు

నాదు నుండ్రాళ్లు తినవయ్య నల్లనయ్య!

పెంచుకొ నుము నీవును బొజ్జ పింఛ ధారి!

ఆటపాటల సరిజోదు వగుము నాకు.

డి.రామ నాగేశ్వరరావు

 

 

ఆ వె

చిన్ని క్రిష్ణ నీవు చిద్విలాసముగను

గణపతయ్యతోడ కలిసినావు

వెన్నదొంగను గని వేడుక జేయంగ

ఎలుక వాహనుండు యెదురు నిలిచె

 

కం||

ఊయల లూగుచు కృష్ణుడు

హాయిగ తానాడుకొనగ  నానందముతో

సాయము వచ్చెను గణపతి

ఈ యిరువురు కలిసియుండ నిల స్వర్గములే!!

కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి

 

 

తే

వెన్న కడవ జూచి జడిసి విఘ్నహారి

కుడుములన్ని దాచి యొసగె  కుడువ నొకటి

చమురు తినక తోరపుబొజ్జ యమరెననుచు

వెన్న దిను సుందరుని గని విస్తుపోయె

వాణిశ్రీ నైనాల

 

 

నీది నాది కాదు మనదే

ఒకరికొకరు ఇచ్చుకొందురు తాంబూలంబులు

 శ్రావణమాసమున పేరంటంబులలో   

 

వడ్డించుచూ ఆరగించెదరు

వనభోజనంబులందు ఒకరి వంటలు ఒకరు

 

అటులనే అలవాటు చేయవలె , పంచుకొనే

పద్ధతిని పిల్లలందరిలో

 

అపుడు కనిపించుదురు అనిపించుదురు

బుజ్జి గణపతులు చిన్ని  కృష్ణులు

 

వారితో ముచ్చట్లు పెట్టె చిట్టెలుక లాగా

అనిపించు వీరి బుజ్జి పెంపుడు జంతువులు !

జి మురళి మోహన్ రావు

 

 

 

సీసము

ద్వాపర యుగమున ద్వాపర వాసిగ విష్ణు మాయలు జూపి కృష్ణ రూప

ముగ విశ్వమునకు సమ్మోహన మిచ్చి గీతా సార మొసగిన దైవ మితనె

శ్రీకృష్ణ లీలలన్ శ్రీకరముగ తెలి పెడు మహాభారత  విభవమును లి

ఖించె వినాయకు డింపుగ వ్యాసమ హర్షి వక్కాణింప; అకట! చోద్య

 

గీ.

మేమి! కృష్ణుడు, గణపతి లిరువు రొదిగి

బాలకుల వలె గ్రీడించు పటము  జూడ

నద్భుతంబు సాక్షాత్కార మాయె; చిత్ర

కారుని సృజనాత్మకమైన కౌశలమిదె

వెంకట్.సి హెచ్

 

 

 

మహాభారతం వ్రాసే ముందు చిన్ని కృష్ణుని మచ్చిక చేసుకునే ప్రయత్నంలో చిట్టి పిళ్ళారయ్య 

 

ఆ.వె ll  

విఘ్నపతిని నేను ! విన్నవించగ నిన్ను

నన్ను బ్రోవ రార వెన్నదొంగ !

ప్రేమ తోడు వేడు ! విజ్ఞత వాఙ్మయ 

వరమునీయమంటి  వాసుదేవ!!

 

ll 

వెన్నలు పాలమీగడలు ప్రేమని పంచు తలంపు దివ్యమై 

కన్నుల పండువౌచు సిరిగంధములన్ కురిపించు రూపమై  

సన్నుతి జేసి మాధవుని సన్నిధి కోరుచు వాఙ్మయంబులన్ 

విన్నపమివ్వ వేడుదును ! విజ్ఞతతో విను వేణుమాధవా   ! 

కస్తూరి శివశంకర్

 

 

సేకరణ: రమక్క....

ఉత్తర -ఒక చమత్కారం.

#నక్షత్రము గల చిన్నది.

నక్షత్రము చేతబట్టి నక్షత్రప్రభున్

నక్షత్రమునకు రమ్మని

నక్షత్రము పైనవేసి నాథుని పిలిచెన్

 

ఇందులో నాలుగు నక్షత్రాలు దాగి ఉన్నాయి. పదే పదే చదివితేనే కానీ అంతసులువుగా అర్థమయేవికావు. ఇటువంటి ప్రహేళికలను'ప్రముషితా' ప్రహేళికలని అంటారని కవి దండి తన'కావ్యాదర్శం' లో చెప్పాడు.

 

ఇప్పుడు వివరణ చూద్దాం!

 

మహాభారతంలో విరాటపర్వం చదువనివారుండరు. విరాటరాజు కుమార్తె "ఉత్తర" (నక్షత్రం పేరు ) ఆమె అభిమన్యుని భార్య. నక్షత్రము చేతబట్టి అంటే కుంకుమ పాత్ర "భరణిని" ( నక్షత్రం పేరు ) చేతిలో పట్టుకొని ; నక్షత్రప్రభున్ నక్షత్రాలకు ప్రభువైన చంద్రుని వంశపు ( చంద్రవంశము ) అభిమన్యుని; నక్షత్రమునకు రమ్మని అంటే ఒక "మూల" ( నక్షత్రం పేరు ) కు రమ్మని పిలిచి; నక్షత్రము పైనవేసి అంటే "హస్త" (నక్షత్రం పేరు ) మును అతని మీదవేసి; నాథుని పిలిచెన్ అంటే పతియైన అభిమన్యుని ప్రేమగా పిలిచిందట.

 అమ్మో! ఈ పద్యం అర్థంకాకుంటే మీకు నిజంగానే నక్షత్రాలు కనిపించేవి కదూ! అదీ మరి కవి చమత్కారమంటే!

 

వెన్నెల ధారలు నింగి నుండి కారుచున్న తీరు చూశాక..

ఆ దేవదేవుడు, విఘ్నరాజు లిరువురు బాలకులై ఆడుకునుచున్నారు అనేలా ఉంది..

 

తే.

పుష్యమాస వెన్నెల లోన పుణ్య పురుషు

లిరువురు పసిపిల్లలవోలె యిమ్మునిచ్చు

రూపు దాల్చి నేతెంచె; షడ్రుచుల నార

గించెడు జిరుత గణపయ్య, యెలమి పంచు

చిన్ని కిట్టయ్య లాడెడు జిలిపి లాట

జూడ బాల్యమెంతానంద శోభితంబు

 

 

వెన్నెల ధారలు నింగి నుండి కారుచున్న తీరు చూశాక..

ఆ దేవదేవుడు, విఘ్నరాజు లిరువురు బాలకులై ఆడుకునుచున్నారు అనేలా ఉంది..

 

తే.

పుష్యమాస వెన్నెల లోన పుణ్య పురుషు

లిరువురు పసిపిల్లలవోలె యిమ్మునిచ్చు

రూపు దాల్చి నేతెంచె; షడ్రుచుల నార

గించెడు జిరుత గణపయ్య, యెలమి పంచు

చిన్ని కిట్టయ్య లాడెడు చిలిపి లాట

జూడ బాల్యమెంతానంద శోభితంబు

 

 

 

అంశం...అమ్మ

1. తేటగీతి. .

 

ఉగ్గు బాలను బట్టగ నుగ్గ బట్టి

జీవి యెదుగును జగతిని చేవ గలిగి

పిల్ల లెదుగుట జూచుచు దల్లి మనము

మురిసి మెరియును ముచ్చట ముద్దులొలికి...

 

2. ఆటవెలది..  

అమ్మ యొడిని జేర నల్లారు ముద్దుగా

సేదదీరు  బిడ్డ  శీఘ్రగతిని

తల్లి యెదను బ్రాక, తన్నుచు గ్రుద్దుచు

మమత లెల్ల బంచు మాతృమూర్తి..

 

3. ఆటవెలది..

 

జన్మ నొసగి తల్లి జగతిని వీడగ

తల్లి లేక బిడ్డ తల్లడిల్లు తండ్రి

పెంపునందు తనయుడు బెరుగుచు

పేగు బంధమునకు పెనుగులాడు....

పి.ఎల్.నాగేశ్వరరావు

 

 

వెన్న తినెడి చిన్న వెన్నుడి నోటిలో

మోదకమ్ము నిడె ప్రమోదముగను

గణపతైన నేమి? ఘన శ్యాముడైనను

ప్రేమ చాటినారు పెద్దలకును!!!!

ఝాన్సీ

 

 

తే"

ఎట్టి బృతులంద తిరుగంగ నిటులరిగెనొ!

యెమ్మహాను భావునిసేవకివి చినిగెనొ!

యెట్టి క్రతువులుకరిగెనొ ఎవరికెరుక!

విలువ గల్గు పాదుకలివి విక్రయించ

వాణిశ్రీ నైనాల

 

 

చిత్రానికి కవిత

 ఊయలూగుచున్నబాలకృష్ణా !

ఉండ్రాళ్ళ రుచిచూడు చిన్ని కృష్ణా !

వెన్నలాగ కరగదు మన్నులాగా చెరగదు

నున్నగానుండి నిన్ను  మురిపించు

గున్న గణపతిని నీకు చిన్నగా తినిపింతు

మిన్నకుండక నీవును మ్రింగవయ్యా.

హేమలత




 

ఈ నాటి విచిత్రానికి.. నా సరదా పూరణాప్రయత్నం.

బుజ్జి బొజ్జ గణపతి, "నీ చిలిపి అల్లరి లీలలు, బడిలో, భాగవత దశమస్కందంలో చదివేసి.. థియరీ నేర్చేసుకున్నాను.. ఇక.. ప్రాక్టీకల్స్ మాత్రం నువ్వే నేర్పుతావనే.. సెలవులకి నీ దగ్గఱకు.. మీ వ్రజ భూమికి వచ్చాను..నా తమ్ముడు అల్లరి కార్తికేయునికి.. దీటుగా. నాకూ కొంటెతనం నేర్పి, నా పరువు నిలబెట్టవయ్యా !"  అని చిన్ని కృష్ణునితో అంటున్నాడిలా....

 

తేటగీతి మాలిక

వేసవి సెలవు; 'స్వజుల'తో  వేగ లేక,

బాల కృష్ణునితో తన బాల గణప

తి, వ్రజలో, నాడుకొనునంచు త్రిపురమాత,

నచ్చట విడిచి, వెండియుంనరిగె 'గిరికి' ;

అమ్మ యరిగినంతనె  కృష్ణునక్కజముగ

"బొజ్జ గణపతి" తీయగా బొగడ దొడగె ;

"కన్నయా ! నీదు లీలలు కడు మధురము

లాయె !నెటులనవగతములైనవనియ

సందియము ? నాకవియె పాఠశాలయందు

పాఠ్య విషయంబులయ్యె; నే  పరవశించి,

జదువునది పోతన ''దశమ స్కంద''మేను !

ఆకళించుకొంటినిగ  "సిద్ధాంత"మంత;

బోధపఱచుమిక "ప్రయోగ పూర్వకము"గ !

నింతటి చిలిపి యల్లరి యెటను నేర్చి

నావు? గురువెవ్వరో చెప్పినావు కాదు!

కార్తికేయుని యెదుట నా కీర్తి పెరుగ,

నీదు కొంటె చేష్టలు నాకు నేర్పితేని,

మోదకములిత్తు మెండుగా మోదమలర;

లంచమనకుమా ! మరి నాకు లజ్జ గలుగు;

అమ్మ రాకమున్నె దెలుపుమన్ని 'కళలు';

మదినె దాచుకొందును నీదు మర్మములను;

ఆదమఱచియు జెప్ప నే నమ్మ తోడు !

జగములుండు దనుక, నీదు జట్టు నుందు !!

"బొజ్జ" వలయునా ? యందులో "యొజ్జ" నేను !

 

మరల వచ్చి, తెలిపెద నా మర్మములను !!"

 

పోతన భాగవతంలో.. దశమ స్కందము.. చిన్ని కృష్ణుని లీలా వినోదములు వివరించే స్కందము.

వెంకట రమణ 




తేటగీతి లో...

వెన్నముద్దలు మింగెడి వెన్నదొంగ

ఊయలూగుచు నాడెనే మాయ జేయ

బొజ్జ గణపతియందించి బోజు మీర

ముదము తోడను తినిపించె మోదకమును

జైకర్ విశ్వేశ్వర్ టోణ్ పె, థానే, ముంబయి, 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...