5, ఫిబ్రవరి 2021, శుక్రవారం

నోటు _ ఓటు_ పాటు_ చేటు, దత్తపది, 22.01.2020, శుక్రవారము

 


నోటు _ ఓటు_ పాటు_ చేటు

వీటితో మనోహరమైన పద్య/ వచన కవితలను అందించగలరు.

కవులు/కవయిత్రులు తమ మనోఫలకము మీద తారాడెడు రామణీయ భావనలను వెలికి తీసి, సుమనోహర వన్నెయల నద్ది తేనియల దిటవు తెలిపెడి కవితలల్లి, సమూహాము తేజరిల్లు నట్లు ఘనత చేకూర్చగలరని విన్నపము.

 

కందం

నోటు నెరగ జూపుచు, నా

యోటు ను కొనెడి ఘనులుండి యూళ్లను గెలుచుచు

పాటు పడక మోసముతో

చేటు ను చేసెడి మనమున చేతన రాదా

రమ

 

 

ఉత్సుకము

నోటు లు పుచ్చుకు నందరం

ఓటు లు వేసెడి పౌరులం

పాటు ని చేయని నేతలే

చేటు ను చేయగ  నెగ్గునే

రమ

 

 

పాలకుల చేతలకు మాటలకు నోటులకు

ముచ్చట నంది ఓటు వేయంగ

గెలవంగనే మాట మార్చి సొంత

లాభం చూసుకుంటున్న

నేతలను గాంచి భంగపాటు పడి

ప్రజలు మొదటికే చేటు

 వచ్చెననుచు వగచిరి

దేవరశెట్టి నాగమణి

 

 

అయ్యయ్యో

ఎన్నికల్లో ఎవరెన్ని నోట్లిస్తారా

అని కళ్ళు , వేళ్ళు వెతుకుతున్నాయి

పవిత్రంగా పడాల్సిన ఓట్లను

ఎవడైతే మనకేం వచ్చాయి చాలు ఈ నోట్లు

అంటూ గబ గబా గుద్దేశారు

ఫలితం అనుకోని పాట్లు ,చేట్లతో

పడుతున్నారోచ్ అగచాట్లు !

జి మురళీ మోహన్ రావు

 

 

ఓటుకు పంచెడి వారుణి,

నోటులు యోటరు కటునిటు నుయ్యిను, గొయ్యిన్

చేటును తెచ్చెడి  నేతలు

పాటును మ్రెక్కుచు భవితను భగ్నము చేయన్

వాణిశ్రీ నైనాల

 

 

తేటగీతి.....( సూక్తులు )

ఓటు విలువను గొలువకు నోటుతోడ

చేయి జాపగ జగతికి చేటుగలుగు

ప్రగతి బాటను బయనింప పాటుపడుము

మనిషి హితమును మరువక మసలు కొనుము.

పి.ఎల్.నాగేశ్వరరావు

 

 

1

ప్రజాస్వామ్యమనగ నొక వర్తమాన వింత

నోటు కు సా పాటు కు ఓటు లు కోట్లు కోట్లు

లభించు నిచట, ఏ పాటూ పడకుండగనే

నాయకులధికారము సంపాదించెదరిట

ప్రజల కొరకు ప్రజల వలన గెలుపొందియూ

ప్రజలకు లెక్కకు మిక్కిలి చేటులు హక్కుగ

చేయుచు దర్జాగా పదవులనుభవింతురిట

 

2

ప్రామిసరీ నోటు  పై సంతకాలు తీసుకొని,

రుణమిచ్చినను, వసూలు చేయునపుడు,

రుణదాత సంస్థలు పడని పాట్లు ఉండవు

నిదానముగ వారి ఉనికికే చేటు లు తెచ్చు,

ఘన రుణగ్రహీతలే రాజకీయ నాయకులై

రేట్లకు ఓట్ల ను కొల్లగొట్టి ప్రజా ప్రభుత్వము,

నడపగ బ్యాంకుల లోని ప్రజల సొమ్ము కు,

భద్రతెక్కడ? వారి బతుకు భరోస ఎక్కడ?,

ఓటు నమ్మగ వేటు తిని ఓటు వడే జనత.

ఓటు= అపజయము అని కూడా..

CA కె మల్లికార్జునరావు

 

 

ఆ. వె.

" ఓటు" వేయకోయి " నోటు" కమ్ముడు పోయి

చెడ్డవారి గెలుపు " చేటు" తెచ్చు

" పాటు" పడగ దేశ భవితను కోరుచు

త్యాగ దనులు గెలుచు ధరణి లోన.

డి.రామ నాగేశ్వరరావు

 

 

నోట్ల రద్దును  జేయగ నొక్క నేత

యోట్లు వచ్చెను కొల్లలై కోరి నన్ని

పాటు పడగను దేశపు భవిత కొరకు

చేటు కలుగదక ,ప్రజలకు, చేవగలుగు

బాట చూపెను మోడియె భార తమున

రేవూరు సాయిలక్ష్మి

 

 

ఓటును తెగనమ్ముకతన

నోటులు చేరేమొగాని నొచ్చెడు ఫలితాల్

చేటులు తీసుకువచ్చును

పాటులు పడునిట్టి తప్పు పడుకుర భాయీ!

రాంమోహన్ నిజామాబాద్

 

 

కురుక్షేత్రం ఇతివృత్తంగా దత్తపది పూరణ అన్యర్థములో చేయు చిరు ప్రయత్నం

 

సీ.

యుద్ధరంగమున తామోటుపాటు పడుతు మనెడి కన్నోటుతో నటమటించి

కౌరవసేన దుష్కర్ములై యభిమన్యు నంతము నొందించు యాశయముగ

ధర్మంబు వీడి పద్యవ్యూహమును పన్ని దుర్మార్గముగ జంపె, దొట్రుపడక

పార్ధుడు యద్భుత పాటవంబును జూపి పాండవుల యశము పరిఢవిల్లు

గీ.

నటుల శత్రుసంహారము నాచరించి

జయము గూర్చె; నధర్మ మాచరణ గల్గి

శ్రేష్ఠతను వీడి కౌరవ సేన చేటు

తెచ్చుకొని, యపకీర్తి నొంది వగచె గద

ఓటుపాటు= అపజయం,    కన్నోటు= భయం

వెంకట్.సి హెచ్



 

ll

కోట్లకు కోట్లు మింగుటకు కుళ్ళు కుతంత్రముతో జ్వలించు కుం

పట్లు రగుల్చు వారెవరు ? పాలకవర్గము కుత్సితమ్ముతో

తూట్లగు నైకమత్యము ! ప్రదూషిత నేతలు తిట్లతోడు చీ

కట్లను నింపగా వికృతకాంక్షలు రూపము వెక్కిరించగా

వోట్లకు నోట్లు పంచగ ప్రబుద్ధుల దుష్కృతులే వినాశమై 

చిట్లగ జేసె దేశమును చీత్కృతి పాట్లు ! జనుల్ విరక్తులై !

కస్తూరి శివశంకర్

 

 

తేటగీతి

జనులువేసిన ఓటుతొ సభల కెక్కి

పాటు పడరిక నాయకుల్ బాస మరచి

నోటులెన్నియో జమచేసి మూటగట్టి

చేటు జేతురు ప్రజలకు చీడలాగ.

హేమలత

 

 

ఉత్పలమాల

ఓటుల కోసమై తగిన యూహలు జేతురు నాయకుల్ సదా

నోటులఁబంచిపెట్టుచు వినూతన రీతిగ మభ్యబెట్టుచున్

పాటులు దప్పవట్టి చెడు వారికిఁ బట్టముఁ గట్టబెట్టినన్

చేటు తొలంగగన్ జనులు శీఘ్రమె మానిత యోగ్యధీమతన్

పాటుపడంగగా వలయు బాధ్యత చేకొను నేతకోసమై

ఆదిభట్ల సత్యనారాయణ

 

 

తనదు బిడ్డలన్  పోషించ తల్లి యెంత

యోటు పడినను క్రుంగక పాటుపడుచు,

వారి వృద్హికై కన్నోటు పడక ధీర

యగుచు వారి సుఖమునకై నంగలార్చి

చేటు గాలమెపుడు దరి చేరనీక

సతము గాచు నమ్మయె గాదె శాంత మూర్తి

అవళూరు సీత

 

 

నోటుల మాటున బొంకుచు

ఓటులు పదిలముగ దాచి ఓటరు మదికై

పాటులు పడి పదవి కొరకు

చేటును చేసేడు మనుజుల చేరకు చిన్నా....

జైకర్ విశ్వేశ్వర్ టోణ్ పె, థానే, ముంబయి

 

 

 వినతి: ఉద్యోగ ఉపాధ్యాయుల మనోగతం

ఆ.వె.

కాలగతిన మనసు కలిమాయలోబడి

నాటి మాటలన్ని నడక దప్పె

విన్నపాలు వినక చిన్నబుచ్చుటయేల?

ప్రస్తుత సమయాన పాడియౌనె?

 

ఆ.వె.

లేని ఆశలన్ని లేవనెత్తిన వేళ

ఆగమాయె జనులు అవనియందు

మంచి నిర్ణయమును మన్నననొందగన్

తీసుకొనుచు జేర్చు తీరమునకు

 

మహేశ్ ముత్యాల


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...