7, ఫిబ్రవరి 2021, ఆదివారం

26 01 2021 గణతంత్ర దినోత్సవము

 



మిత్రులందరి కీ భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

26_1_2021 మంగళవారం

*చిత్రానికి మనోహరమైన పద్య/ వచన కవితలను అందించగలరు

 

కవులు/కవయిత్రులు తమ మనోఫలకము మీద తారాడెడు రామణీయ భావనలను వెలికి తీసి, సుమనోహర వన్నెయల నద్ది తేనియల దిటవు తెలిపెడి కవితలల్లి, సమూహాము తేజరిల్లు నట్లు ఘనత చేకూర్చగలరని విన్నపము.

 

 భరతమాత స్వేచ్ఛకు సంబంధించిన చిరు పద్యం....

 

సీసం

భారత మాతకు బంధనాల్ పెనవేసి ద్రుంచగ నెంచిన దుష్టు లేరి ?

పంజాబు, ముంబాయి, పానాజి, లష్కరుల్ నెత్తురు బారించు నీచు లేరి ?

దండెత్తి సంపదల్ దండిగ  దోచుచున్ రాజ్యాల నేలిన రాజు లేరి ?

ఛాందస వాదముల్ శక్తియుక్తులమేర జొప్పించి విడగొట్టు చోరు లేరి?

 

తేటగీతి

శత్రు  సేనల జెండాడు శక్తి మెండు

దేశ భక్తిని జాటుచు దెబ్బదీసి

పక్కలోని బల్లెంబుల నుక్కడించి

జాతి భద్రతే యూపిరై సాగి పొమ్ము....

 

ఉత్పలమాల.. ..

వీరుల  గొంతుకల్  చిదిమి, వేలకు వేలుగ నుగ్రమూకలన్

భారతి శాంతికిన్ మిగుల భంగము  వాటిల శక్తియుక్తులన్

పారక పాచికల్, బయటి దాయదు లందరి గొంతులొక్కటౌ

భారత మాతకున్ జయము వల్కెడు వాడె ఖలుండు, ద్రోహియౌ !

పి.ఎల్.నాగేశ్వరరావు

 

 

 

కం ll

జయహో జయహో భారతి !

జయమగు సిరులవి కురియగ చామీకరమై

భయమెరుగని జాతిసిడము

జయజయ ధ్వానములు మాకు జైత్రములాయెన్ !

 

ll 2️

మేరునగంబులన్ నిలిచి మింటిని తాకు పతాకకాంతివై 

భారత సంస్కృతీ గరిమ వల్లరులై కురిపించగావలెన్

ధీరత, స్థేమముల్ వరలు దివ్యకవిత్వ తరంగిణీ ఝరుల్;

హారతి వెల్గురేఖలవి హైందవ జాతిని సన్నుతింపగన్

సారతరార్ధ సంపదలు సన్నుతి కోరుతు జ్ఞానధామమున్ !

కస్తూరి శివశంకర్

 

 

కం||

ఎందరి త్యాగ ఫలితమో

యిందరి యీ సంతసమ్ము లిటులిల వెలుగన్

సుందరమై దేశమిపుడు

ముందరి తరములకునెల్ల ముద్దుగ నిలిచెన్!!

 

కం||

గణతంత్రపు దినమున నే

కనగలమా దేశ భక్తి ఘనమగు రీతిన్!

ఎనలేనా త్యాగ ఫలము

వినువీధుల జూపవలెను విశ్వము నెపుడున్!!

కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి

 

 

కం||

గణతంత్ర దినము నేడే

గణగణ మ్రోగెను విలాతి గంటలు మదిలో

గణములు కవాతు జేయగ

జైకర్ విశ్వేశ్వర్ టోణ్ పె, థానే, ముంబయి

 

 

 

సీ.

అంబేడ్కరార్యుని యవబాస మంతయు జతవడగ యశము  సంతరించు

నటులగ రాజ్యాంగ మావిర్భవించె, భారత మాత యుప్పొంగి రమణమొలికి,

గణతంత్ర రాజ్యమై ఘనత కెక్క, విశాల భారతావని కొక పథము గూడి

మువ్వన్నెల పతాక మోహన మంతయు  రాజ్యమున నిలిచి రంగులీడె

గీ.

పాలకులకొక దిక్చూచి, భరత జాతి

కొక పవిత్రపు గ్రంథమై నొదిగిపోయి,

గౌరవముగ రాజ్యాంగము గణుతి కెక్కి

నిత్య యౌవనురాలుగ నెగడు చుండె

వెంకట్.సిహెచ్

 

 

 

చిత్రానికి పద్యం

గగన తలంబున గాంధి బృందమమరి హింస యహింసల హితముఁజూప

ప్రగతియౌ చక్రంపు పథమున నేగుచు బలము చూపెడు దేశ భక్తులార!

సామరస్యపు ఘన సాంప్రదాయంబును చక్కగా పాటించు సౌమ్యులార!

ప్రాణాన్ని తృణముగా భావించి  యర్పించు ధీర సైనిక వర్గ వీరులార!

సాంకేతికమ్ముకు చక్కందనమిడిన యుక్తిమీరిన ఘన శక్తులార!

సాహిత్య సంగీత సౌభాగ్య దాయక నిఖిలక ళాప్రజ్ఞ  నిపుణులార!

విద్యాప్రబుద్ధుల వినయవి ధేయతన్ మార్గదర్శనఁజేయు మాన్యులార!

తాత్విక తత్వము తనయుల కిచ్చుచు ధన్యతనొందెడు తల్లులార!

 

దేశ ప్రగతిని పెంచగా తీవ్ర గతిని

ప్రతిన బూనుడు మీదైన వ్రతము గలిగి

దివ్యమైనది గణతంత్ర దినమునేడు

సర్వ భారత సౌభాగ్య పర్వదినము

ఆదిభట్ల సత్యనారాయణ

 

 

సమిష్టిగా..సమైక్యం గా

 

మన దేశం , మన శక్తి మన ఉత్పత్తి అంటూ

ఎందరో వివిధరంగాల్లో నిరంతరం నిస్వార్ధంతో

తమ విధుల్లో నిమఘ్నమయిన కొందరికిచ్చే

పురస్కారాల వేడుక కూడా ఈ రోజే !

కేవలం జండావందనం చప్పట్ల చప్పుడుతోనే గాక ,

అందరం ఈ రోజు నుండే మన కర్తవ్యాలను

నీతి , నిజాయితీలతో నిర్వహించుకుంటూ పోదాం !

కొత్తగా చూసుకుందాం ప్రతిరోజూ మన బంగారు భవితల భారతం !

తెచ్చుకుందాం అందరం పతకాలు !

జి మురళీ మోహన్ రావు

 

 

సీII

వీరులు పుట్టిన ధీరభూమిపసిడి రాశులు పండిన రత్నగర్భ

సాహిత్యజగమున చంపక మకరంద మాలలే కట్టెడి మల్లెతీగ

కులమతభేదాలు‌ కుత్సితత్వము లేక కలిసిమెలిసి‌యుంచు కన్నతల్లి

తల్లిస్థానమునందుతానుండె స్త్రీలను పరమ‌పూజ్యులుగాను పరిగణించ

 

ఆ.వె

భరతమాత కన్న బంగారు నిధులని

వేరులేవు‌నిజము‌‌పేరుకైన

మట్టితాకిచూడ మరి సాటి లేదంచు

నాకలోకమైన నడచివచ్చు

ఆత్రేయ

 

 

మూడు వన్నెల తోడను ముచ్చ టైన

బావు టా, మనకు తెచ్చెను బాపు కృషి

చేసి, ఊపిరి ఆయెను చేత బట్టి

ఎగుర వేయగ నందరు నేత లెల్ల

,దినమున గురుతు ను చేయ మనకు

తనువులింక విహంగములై అంబరము చుంబించ.

 

వచనం

గణతంత్ర దినోత్సవమున,

జనమంత  అకుంఠిత దీక్షతో,

మనస్సంతా దేశభక్తి నిండ,

గాంగేయ శాస్త్రి, రాజమండ్రి

 

 

వచనం

వాయు దళములు వదిలే మువ్వన్నెలు నింగిన...

గాంధీ భగతసింగ్ వంటి వారు ఉత్తేజమునిచ్చిరి ఉన్నతమున...

అశోకచక్రము భారత ఖ్యాతి బెంచుతూ నిల్చునే నింగి నేల మధ్యన...

ఎందరి త్యాగఫలమో మనము జరుపు కొంటున్నాము గణ తంత్ర దినము న....

ఎందరో మహానుభావులందరికి నివాళి తెలుపుకొంటున్నాను  వందన రూపమున....

ఉష.

 

 

 

సీ"

తినగ తిండియులేక మనగ హక్కుయు లేక

శ్వాస తనదికాక చచ్చి బతుక

నమ్మ పాలనుద్రావ  నడ్డగించ దొరలు

బానిసలుగ మ్రగ్గె భరత జాతి

యుక్కుసంకెల ద్రెంచ నుద్యమమై సాగె

నెత్తురోడని యుద్ధనీతి నెరపె

సప్తదశక మెక్కి స్వాతంత్ర్య భారతి

ప్రగతి దిక్కువెదకి వగచె జూడు

 

స్వేచ్ఛ కర్థంబు మారెను క్షేమముడుగ

స్వార్థ చింతన మత్తులో శాంతినరయ

మానవత్వ మించుకలేక మసలుచుండ

నిష్పలమగునె మాన్యుల నిగ్గు నేడు!!

వాణిశ్రీ నైనాల

 

 

గణతంత్రపు ఉదయాన త్రివర్ణపు సంబరాలె

నింగికెగసి పూలు రాల్చి జయకేతనమెగిరె

జయ జయ గీతాలతో దినమంతా గడిచె

మలిసంజెల చీకటిలో  జెండా నేల జారె

మట్టిపట్టి మకిలి అంటి రూపు మాసిపోయె

మిన్నంటిన దేశభక్తి మరునాటికి మరుగాయె

వందనమిడగానే దేశభక్తి ఐపాయె!!

విష్ణుప్రియ

 

 

 

 

జనహితుడై  అంబేడ్కరు

తనమేధోసారమంత ధారగవోయన్

ఘనరాజ్యాంగముగూర్చిన

దినమిది గణతంత్రమాయె!దేశమెమురియన్ !

రాంమోహన్ నిజామాబాద్

 

 

1

భారతీయ వీరులం భారత మాత బిడ్డలం

మాతృదేశ గౌరవం కాపాడే ధీరులం

దాశరథి

 

2

వెనక చూసిన కార్యమేమోయి? మంచిగతమున కొంచెమేనోయి

మందగించక ముందు అడుగేయి వెనుక బడితే వెనుకే నోయి?

గురజాడ

 

3

 శ్రీలు పొంగిన జీవ గడ్డయి పాలు కారిన భాగ్య సీమయి

వ్రాలినది ఈ భరత ఖండము భక్తి పాడరా తమ్ముడా

రాయప్రోలు సుబ్బారావు

               

4

జయ జయ ప్రియ భారత జనయిత్రి

దేవులపల్లి కృష్ణ శాస్త్రి

 

5.

ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా పొగడరా నీతల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము

రాయప్రోలు సుబ్బారావు

 

6

అంతా ఒక్కటే మనమంతా ఒక్కటే

తెలంగాణము రాయలసీమయు కోస్తాప్రాంతపు తెలుగు దేశము॥

న్యాయపతి రాఘవరావు

 

7

చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా! గతమెంతో ఘనకీర్తి కలవోడా! సాటిలేని జాతి-ఓటమెరుగని కోట నివురుగప్పి నేడు-నిదురపోతుండాది జైకొట్టి మేల్కొలుపు తెలుగోడా!

వేములపల్లి శ్రీకృష్ణ

 

8

వీరగంధము తెచ్చినారము వీరుడెవ్వడొ తెల్పుడీ

పూసిపోదుము మెడను వైతుము పూలదండలు భక్తితో

త్రిపురనేని రామస్వామి

 

 

 

 

 

 

 

 

 

 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...