3, ఫిబ్రవరి 2021, బుధవారం

చిత్రమునకు కవిత, 21.01.2021 గురువారం

 


21.01.2021 గురువారం చిత్రమునకు కవిత

చిత్రము మీద మనోహరమైన పద్య/ వచన కవితలను అందించగలరు

 

కవులు/కవయిత్రులు తమ అంతరంగంలో దాగిన సుమధుర భావనలను వెలికి తీసి తేనియల గరిమ తెలిపెడి కవితలల్లి, సమూహానికి హరువు గూర్చగలరని విన్నపము.

******

  

ఆధ్యాత్మికత అంటే ఏమిటి ??  దైవచింతనా లేక సత్యశోధనా ?

ఈ రెండిటినీ పూర్తిగా తెలుసుకునే జ్ఞానమార్గమే మనకి దారి చూపాలి

విజ్ఞానశాస్త్రము అంతా హేతువులు కావాలి అంటుంది..

ఆత్మసాక్షాత్కార శాస్త్రం మాత్రం నిన్ను నువ్వు పూర్తిగా అధ్యయనం చేసుకో అంటుంది... అదే ఆధ్యాత్మికత. 

 

ఎన్నో ఆచారాలు, (మూఢ ?) నమ్మకాలు ఒక్కోసారి ఎందుకు ఆచరిస్తున్నారో హేతువు కూడా సాక్షాత్కరించే సమయం, వివేకం చాలా మంది దగ్గర లేదు. విజ్ఞానం తోడుంటే, భక్తి, ఆధ్యాత్మిక చింతన మరింత ఎక్కువగా అర్ధం అవుతాయి అని నా నమ్మకం ఆ భావంతోనే నేటి నా పద్యం

 

ll

అవిరామంబగు జ్ఞానముల్ హృదయభావార్థంబు చిద్రూపమై

వివిధానంద సుధాధరాశ్రువులతో విజ్ఞానసంజాతమౌ

శివముల్ చింతనలై ! మనోజవములే చిచ్ఛక్తితేజంబులై !

భవబంధమ్ముల మాయలే హృదయమున్ వారింపఁగా భద్రమై !

 

కం ll

ఆధ్యాత్మిక చింతనలో

ద్వైధ్యములని దూరమై శుభమ్ములు చయమై

మిధ్యా మోహములు వదిలి

సాధ్యము శాస్త్రవిభవములు సంవేద్యములై

 

ద్వైధ్యము = మోసము, కపట బుద్ధి

సంవేద్యము = తెలిసికొనఁదగినది, అనుభవైకవేద్యంగా

కస్తూరి శివశంకర్

 

 

శ్వాస యందున స్థిరమైన ధ్యాస నుంచి

మనము నందున నీశ్వరుఁ స్మరణఁ మమర

తలపు లందున నితర చింతలను వీడి

ధ్యాన ముద్రయె పరమార్థ దాయకంబు

ఆదిభట్ల సత్యనారాయణ

 

 

 

(సైన్స్ మరియు ఆధ్యాత్మికత)

మిత్రులారా,   Science, Spirituality  యివన్నీ కూడా ఎన్నో తరాల నుండి మనిషి మేధస్సుకు సాక్షిగా వేగంగా పరుగెడుతున్నాయి.

భగవంతుడు యిలాంటి శక్తి, జీవరాశులలో ఒక్క మానవ జాతికి మాత్రమే ప్రసాదించాడు. మనిషి తన యావత్తు శక్తిని ఉపయోగించి  ' ప్రతిసృష్టి ' చేయాలనే కుతూహలంతో తన చుట్టూ పెద్ద మారణహోమం సృష్టించుకొని, దాని నుండి బయటకు రాలేక కొట్టుమిట్టాడుచున్నాడు.

యిలా చేయమని దైవము, విజ్ఞాన శాస్త్రము మరియు ఆధ్యాత్మికత ఎన్నడూ చెప్పలేదు, అయినా మనిషి మార లేదు, ఆతని కాంక్ష తీరలేదు.  యిది యదార్థము.

మనిషి పరిపూర్ణంగా ఎదగాలి అన్ని రంగాలలో, చక్కని జీవనం సాగించాలి మన పెద్దలు చెప్పిన, అనుసరించిన పరిమితులకు లోబడి...అపుడే మనిషి సాధించినట్టు.. అంతేగాని, తన మేధస్సును తన వినాశనానికే  ఉపయోగిస్తూ పోతే, కొన్నాళ్లకు భూమి మీద ఏమీ మిగలదు..ఎవ్వరూ డరు...ఆలోచించండి.

చివరగా....మనిషి ఎప్పుడూ తన అధీనంలోనే ఉంటూ, మేధోశక్తిని సమాజ నిర్మాణానికి ఉపయోగిస్తూ ముందుకు సాగాలి...తన వినాశనానికి తానే మూలం అని గుర్తెరిగి , అందుకు అనుగుణంగా మసలుకోవడమే  మనిషి పని..   మనిషి అధీనంలో సైన్సు ఉండాలి కానీ, దానికి లొంగిపోతే మనిషి మనుగడకే ప్రమాదం...

 

ఆటవెలది.. 1

అంతరాత్మ బలుకు నక్షర సత్యంబు

యెదుగుచున్న గొలది నొదగ వలయు

ఛట్ర పరిధియందు జక్కగా జీవించు

మనసు లేని మేధ మనిషి కేల ?

 

ఆటవెలది.. 2

బంధము లన్నియున్ విడచి భార్యయు, పుత్రుడు కానలన్ బడన్

గంధపు వాసనల్, పసిడి కాంతులు, రాజసమెచ్చటేగెనో

పందెము కాదిటన్., పుడమి భారము నీకగు రాజువై, వినన్

బంధములెల్ల ద్రెంచుకొన, బంధువనంబడు లోకమందునన్..

 

3  

విజ్ఞులెపుడు పొందు విజ్ఞాన సంపత్తి

సతము బంచు జగతి హితము గోరి

అల్పుడెపుడు జూడ నాశలే హద్దుగా

శాస్త్ర సార మెల్ల సాగనంపు

పి.ఎల్.నాగేశ్వరరావు

 

 

లోన - బయట  (సైన్స్ మరియు ఆధ్యాత్మికత)

అందరికీ రెండే రెండు జీవిత చక్రాలు

నీలో వున్నది , దాగున్నది దాచింది , వుండాల్సింది

వదలవల్సింది ఏమిటో చెప్పగలిగిందే ఆధ్యాత్మికత !

విశ్వంలో ఏదైనా సరే కనుగొన గలిగినది

తెలుపగలది తెలిసుకోగలది

శోధించునది సాధించునదే విజ్ఞానం !

జి మురళీ మోహన్ రావు

 

 

 

దేహమునాసనమున స్థిరముగా  నుంచి

కరాగ్రములను శూన్య ముద్రలుగ మార్చి

బాహ్యము గాంచు కన్నులు రెంటినీ మూసి

మూడవది యగు అంతర్ నేత్రము తెరిచి

ఇంద్రియముల కూర్మమల్లె లోనికి ముడిచి

పరమాత్మను మనము నందు ధ్యానింపగ

విశ్వరూపుండైన వేదవేద్యుడు ద్యోతపడు

ఆత్మ జ్ఞానము అనుభవ జ్ఞానమై  భాసిల్లు

విజ్ఞాన వేదాంతశాస్త్రములొ కటై వర్ధిల్లును.

CA కె మల్లికార్జునరావు

 

 

 

తే.గీ.  (సైన్స్ మరియు ఆధ్యాత్మికత)

 

శాస్త్ర విజ్ఞాన సంపత్తి సాధనమ్ము

కత్తి వలె మేలు,కీడును కలుగ జేయుు

సాధ్య మాధ్యాత్మిక జ్ఞాన సాధనమున

ఇహపర సుఖములు నిజ మిదేల వినవు?

డి.రామ నాగేశ్వరరావు

 



సైన్స్, spirituality ల సమతుల్యత ఆవశ్యకతను చెప్పే ప్రయత్నం...

బాహ్య గమనమున ప్రగతి, శాస్త్రమొసగు నాధ్యాత్మికత తెల్పు నాత్మలోతు

తర్కమొకటి కోరు, తాత్వికతను దెల్పునొకటి, నేర్వగలుగు నొక మనుజుడె

పరిణామమే కదా యిరు శాస్త్రములు బోధసమతూకమౌ మది సాధనమున

శాస్త్ర మెంతగ నేర్చి సాధించ సర్వంబుపర మెరుగకిహము తరుగు టెటుల!!

 

శాస్త్రసారమవిద్యపై నస్త్రమైన

నంతుపట్టక యెన్నియొ యద్భుతాలు

నాస్తికతను ప్రశ్నించగ, నమ్మకమ్ము

జ్ఞానతృష్ణకు మరియంచు జాడ తెలుపు

వాణిశ్రీ నైనాల

 

 

(సైన్స్ మరియు ఆధ్యాత్మికత)

ఆధ్యాత్మికత ఒక విశ్వాసం.విశ్వాసం యొక్క బలం సైన్స్ కి తెలుసు.

విజ్ఞానము యొక్క ఫలాలు ఈ విశ్వాసులు స్వాగతిస్తున్నవే.

ఈ ప్రపంచంలో రెండూ అవసరమే.

దుర్మార్గుల చేతుల్లో విజ్ఞానం దుర్వినియోగ మవుతుంది కదా.

ఆధ్యాత్మికత తోడైతే బుద్దిహీనతకు చోటేది...

ప్రపంచ పదిగా...

 

విశ్వాసపు శక్తిని విజ్ఞానశాస్త్రమ్ము లెరుగులే

విజ్ఞానఫలంబులు విశ్వాసులకు వింత గాదులే

యీరెండు కలిసున్న యిలయేను దివియౌను

శాస్త్రఫలముతొ వినాశము  జేయరే బుద్దిహీనులే

ఆద్యాత్మ చింతనలు యద్భుతంబగు బుద్ధి నొసగులే   ప్రపంచపది

డా. నాగులపల్లి

 

 


సీ.  (సైన్స్ మరియు ఆధ్యాత్మికత)

మూఢ నమ్మకములు ముక్తి కూర్చుననెడి బెదరు పలుకులన్ని వీడి సతత

మాధ్యాత్మికత జీవనాంశముగ నొనర్చి తాత్త్విక భావన తళుకుచూపి

జ్ఞాన త్రయములను శాస్త్రీయ దృక్పథ ముగ స్పృశించి బ్రతుకుముక్తినొసగు

దిశవైపు పయనించు ధీరుని మది యెల్ల వేళల వెలుగొందు వెగ్గలముగ

గీ.

శాస్త్రముల జిలుగు లెరిగి సహజ దృగ్వి

షయములకు తాత్త్వికత్వము సంఘటించి

జ్ఞాన సముపార్జన సలుపు నరుడు తత్త్వ

వేత్తయై నిరంతరముగ వెలుగు లిడునె

 

జ్ఞానత్రయము= స్వజ్ఞానం, ప్రాపక జ్ఞానం, ప్రాప్య జ్ఞానము

వెంకట్.సి హెచ్

 

 

  

తే.గీ II  (సైన్స్ మరియు ఆధ్యాత్మికత)

వేద విజ్ఞాన మందించె వేల యేండ్ల

ఘన మధురమైన యాధ్యాత్మిక రస మధురి

మలను; విజ్ఞాన శాస్త్రమే మహిని పొగడి

వేద సారమున్ మైకొని విశద పరచె

మైకొని = అంగీకరించి

జైకర్ విశ్వేశ్వర్ టోణ్ పె, థానే, ముంబయి

 

 

 

వినతి(నేటిస్థితి) ఉద్యోగ ఉపాధ్యాయుల మనోగతం

ఆ.వె.

ఆశలవలయాలు శ్వాసలా వెలుగొంద

(ఒ)నొజ్జలంత జూచె నోర్మితోడ

ప్రీతి గలుగునట్లు పీఆర్సీ గైకొనన్

ఎదురు జూచుచుండె (ఏ)నేళ్ళనుండి

 

ఆ.వె.

ప్రభుత కరుణ గలిగి పాలనంబును జేయ

లేదుయనుచు వాదభేదమూని

నిందలాడుచుండె నిక్కముగను సుమ్మి

కనుము వేగ మనసు కలత దొలచ

 

ఆ.వె.

కలలు నిజముగాగ కర్తవ్యపాలన

జేయుమయ్య జనులు హాయినొంద

(ఉ)నుర్వియందువెలుగు నుద్యోగులొజ్జల

(ఆ)నాదరించి నిల్పుమాశయాలు

మహేశ్ ముత్యాల

 

 

(సైన్స్ మరియు ఆధ్యాత్మికత)

సూర్య చంద్రుల పూజించి శుభము కోరు

రాతి విగ్రహమ్ము ల జూచి రామ, కృష్ణ

యనుచు భక్తి తోడ కొలిచి హారతిచ్చి

తృప్తి నొందెడి మానవ దృక్పథమ్ము...

పుడమి ఆకాశములగని పులకరించు

శాస్త్ర వేత్తలు వీనిపై సంవదనము

సల్పి వరుణమంతయు గెల్చి సాగుచుంద్రు

భిన్న  గమ్యము లెపుడు నభిన్న మగునె ?

రమ

 

 

విజ్ఞాన శాస్త్రము.. ఆధ్యాత్మిక తత్త్వ శాస్త్రము

సీస మాలిక

సీస మాలిక

 

అంతరిక్షపు శోధనాలయంబది ;యందు "చంద్రయానంబునే సలుపగోరి ;

విజయవంతముగ జాబిల్లిపై కాలూన నడ్డంకులున్నచో నధిగమింప,

శాస్త్రవేత్తలు బిల్చి, 'శకున సిద్ధాంతిని' సుముహూర్తమొక్కటి జూడమనిరి ;

 

మీన మేషములెంచి, మేలైన మూర్తము నిర్ణయించి యిడెనా  నేలవేల్పు ;

రేయింబవలు వారు రెట్టించి కష్టించి, రోదసీనౌకను చోదనంబు

చేసిరి చంద్రుని జేరగానమ్ముహూ ర్తమునకే ! కానది, గ్రమ్మరి, భువి

పై దిగెన్  "రేరాజు" పై పాదమిడుకయే యేలనో ! విజ్ఞానులెరుగరామి,

మరలిన వ్యోమగామగణము నడుగగా, వీరి జవాబు నివ్వెర గొలిపెను !

జనులు వ్యోమమునంత జల్లెడ బట్టినన్, "కలువ ఱేడె "చటను గాన రాడె !!

పదరిపోవుచు వారు 'పంచాంగముం'జూడ, ఆనాటి తిథి కటా ! ""అమవస""య్యె !!

అమవసగుట, నెటో యా "చుక్కలకు ఱేడు" 'సెలవు' పై తారతో చెక్కి, నక్కె !

"ఏమి యిట్లు జరిగె ? నేల దప్పెను లెక్క ?" యన శాస్త్రకోవిదుల్, 'యయ్యవారు',

"కౌంటు డౌను" ముగియు కాలము భేషైన సుముహూర్తమే గాని, "శుభ్రకరుని"

చేరువయగుటలో క్షేపమగుట జేత, నాలస్య ఘడియలై 'య మవస'య్యె !

'భారతీయ సమయ పాలనం' బెరిగియు, మరచితి 'నమవాస్య' సరసనుంట;

నాదు దోషమెదియు నాస్తి యిప్పట్టున." ననుచును, నగుచు సిద్ధాంతి దెలిపె.

 

తే. గీ.

హృదయ శస్త్రవైద్యు  డయినన్, మదిని "దైవ

చింత" సేసియే సుచికిత్స జేయ దొడగు ;

పారమార్థిక తత్త్వులై పరగు బుధులు !

భారతీయ హృదయతత్త్వ భాగ్య మిదియె !!

వట్టెం వెంకట రమణ

 

సమాప్తం

******


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...