21, ఫిబ్రవరి 2021, ఆదివారం

సమస్యా పూరణం - ప్రతిభ లేని వాడె ప్రగతి జూపు, 03.02.2021, బుధ వారం

 


03.02.2021, బుధ వారం..  సమస్యా పూరణం

ఆట వెలది పాదం..

ప్రతిభ లేని వాడె ప్రగతి జూపు

లేదా కంద పాదం..

ప్రతిభ నునది లేనివాడె ప్రాజ్ఞుండిలలో

 

***************************

 

 

" ప్రతిభ లేని వాడె ప్రగతి జూపు "

 ఆటవెలది....

ఓటు వేయకున్న చేటు లేదనకయు

మంచి వాని నెంచి మాట నిలుపు

రూపు మార్చ వచ్చి, రూకల యవినీతి

ప్రతిభ లేని వాడె ప్రగతి జూపు....

 

 

మా ఊరికి దగ్గరలోని  భైరవకోనపై  చిన్నకవిత....

కంద పద్యం చందస్సు నేర్చుకోనే  మొదటి  ప్రయత్నం..

మిత్రులందరు చదివి తప్పులు సరిదిద్దగలరు.

కంద పద్యం.

భైరవ కోనయు, కొండలు

దారిన్ జూడగ సరళమె దర్శన మొందన్

దూరము భారము కాదిట

కోరి వరమడుగ, శివుండు కోర్కెలు దీర్చున్...

పి.ఎల్. నాగేశ్వరరావు

 

 

ఎండు టాకు జూడనెగిరెగిరి పడును

నీరు లేని కుండ నిక్కు జూపు

జుట్టు లేని తలయె చూపరులను లాగు

ప్రతిభ లేని వాడు ప్రగతి జూపు

 జైకర్ విశ్వేశ్వర్ టోణ్ పె, థానే, ముంబయి

 

 

ప్రతిభ లేని వాడు ప్రతిభ జూ పు

ఇల్లును కట్టగ  తెలియని నింజనీరు

వైద్య మునును చేయ వెడల లేని

వైద్య శిఖుడును యుండగ వంట నందు

ప్రతిభ లేని వాడు ప్రతిభ జూపు

రేవూరు సాయి లక్ష్మి

 

 

" ప్రతిభ లేని వాడె ప్రగతి జూపు "

 ఆటవెలది....

ఓటు వేయకున్న చేటు లేదనకయు

మంచి వాని నెంచి మాట నిలుపు...

రూపు మార్చ వచ్చి రూపాయి కలవడ

 

కందపద్యం...రెండవ ప్రయత్నం

అతిగా సతులే గెలువగ

మతిబోవునటుల ప్రభుతన మార్పులు జేయున్

పతి జోక్యమ్మిటు బెరిగిన

ప్రతిభనునది లేనివాడె ప్రాజ్ఞుండిలలో

పి.ఎల్.నాగేశ్వరరావు

 

 

కం"

గతిలేక నోటు వేయగ

ద్యుతిగొని ప్రభుతను నియంత దుర్మతులేలన్

నుతియింప తప్పదు ప్రజకు

ప్రతిభనునది లేనివాడె ప్రాజ్ఞుండిలలో

వాణిశ్రీ నైనాల

 

 

"ప్రతిభనునది లేని వాడె ప్రాజ్ఞుండిలలో"

సతమత మౌబ్రతు కేలను

సతియొద్దను మర్మమెరిగి సంతోషముగా

అతిగా శౌర్యముఁ జూపక

ప్రతిభనునది లేనివాడె ప్రాజ్ఞుండిలలో   

ఆదిభట్ల సత్యనారాయణ

 

 

ఆటవెలది

ఫలము దెచ్చె స్పర్ధ పార్వతి నందను

ల నడుమ జగమును వలగొనగాను;

త్రిమ్మరి తలిదండ్రులన్, ద్విపాస్యుడు, గరిమన్,

ప్రతిభ లేని వాడె ప్రగతి జూపె!

 

 

ఆటవెలదిలో..

పరిభవమును జూచి పరిహాసమొందిరి

క్రీడలోన; గంట్లు క్రియగొన దళ

మందలి జనులు, యనుమానము రగలగ,

ప్రతిభ లేని వాడె ప్రగతి జూపు!

గౌరీనందన్, బెంగుళూరు

 

 

కందంలో....

ప్రతిభను జూపెడు మనుజులు

ప్రతిభను నమ్ముచు బ్రతుకున ప్రజ్ఞను జూపన్

అతితెలివి పనులు జేయగ

ప్రతిభనునది లేని వాడె ప్రాజ్ఞుoడిలలో.....

జైకర్ విశ్వేశ్వర్ టోణ్ పె, థానే, ముంబయి,

 

 

ప్రతిభ లేనివాఁడె ప్రగతి జూపు

1.ఆటవెలది

ధనమునాశజూపిదండుకొనుదురోట్లు

చాకచక్యముగను చాలమంది

వారి బాటలోనపయనించగలిగెడి

 ప్రతిభ లేని వాడె ప్రగతిజూపు.

 

 

2.కందము

ప్రతిభనునది లేనివాఁడె ప్రాజ్ఞుo డిలలో

 

పతియే ప్రజలకు దిక్కను

మతిగల్గునటుల జనులను మలచే

గతినే జూపగ లేనియు

ప్రతిభనునది లేనివాఁడెప్రాజ్ఞుo డిలలో

హేమలత

 

 

వచనం,

ఆరణాల కూలి  ఆంధ్ర రాష్ట్రాన్ని ఏలాడు,

చాయ్ అమ్మే వాడు రెండోసారి గెలిచి నిలిచాడు,

చెప్పులుకుట్టేవాడు అగ్రరాజ్య అధ్యక్షుడైనాడు,

విద్యా ప్రతిభ లేనివాడే ప్రగతి చూపు నిలలో.....

గాంగేయ శాస్త్రి, రాజమండ్రి

 

 

ప్రగతికి సోపానాలు

ప్రతిభావంతులుందురు కొందరు

నిర్విరామ కృషితో ప్రతిభచూపు వారూ వుందురు

అంతర్గతాన్ని తెలుసుకోక , తెలియక గడుపువారెందరో

వీరే వారితో కలియుచూ పరిశీలించుచూ , నేర్చుకొనుచూ

ఎంతయో అభివృద్ధిచెందుదురు

అటువంటి వారి గురించే చెబుచు

' ప్రతిభ లేని వాడు ప్రగతి చూపు '

అను పాఠ్యంశములు, ప్రసంగములు ఎన్నో !

జి మురళీ మోహన్ రావు

 

 

ఉన్నవాని చదువదొక 'యూసుపోక';

అత్తెసరు మార్కులను బొంది గత్తరించు;

లేనివాని చదువొ ! యది లేశమునల

సత్వమెరుగక శ్రద్ధగా సాగి, నెగ్గు;

పదుగురకునుపయుక్తమౌ వాని  ప్రతిభ !

లేనివాడె ప్రగతి సూపు లెస్స యనఁగఁ !!

 

కం.

సతతము ధర్మయుతుడు, పర

హితుడగువాడే యనబడు  'హీనుడు'; సత్య

ద్యుతి, ఋజువర్తనమనియెడి

ప్రతిభనునది లేనివాడె ప్రాజ్నుండిలలో !

వట్టెం వెంకట రమణ

 

 

ఆటవెలది

కంచు మోగునట్లు కనకంబు మోగునా

యనెను వేమనార్య ! డాశ జూపి

మంచి మాట తోడ మనుజుల వంచించు

ప్రతిభ లేనివాడె ప్రగతి జూపు

రమ

 

 

అంశం  .. కాల మహిమ

 సీసం.... 

  కాలమహిమచే  నెల్లలోకములలో నెలమూడు వానలు నెలవు గొలిపె

నే  కాలమహిమచే నెక్కుబెట్టగ విల్లు మైథిలి ముదమొంది మాలవేసె

యే  కాలమహిమచే నెఱిగియు, జానకి బంగరు జింకకై బట్టుబట్టె

యే  కాలమహిమచే  పోగాలమున్ రాగ దశకంఠు శౌర్యమ్ము దారిదప్పె

 

తేటగీతి.... 

కాల మహిమను దప్పింప గాదుతరము

జీవ రాశుల కిటులనె జీవనమ్ము

దైవ కృపయె మనకెల్ల దారితెన్ను

భాగ్య మెంతైన జగతిని బ్రతుక వలయు..

పి.ఎల్.నాగేశ్వరరావు

 

 

ఆ. వె.

ధర్మ నిరతి లేక ధరణి నేలు ప్రభువుల్

ప్రజను కష్ట పెట్టి పరిఢవిల్లు

 పాటవికుని రాజ్య పాలన జూడంగ

ప్రతిభ లేనివాడె ప్రగతి జూపు

 

కం.

సతమాలోచించు ఘనులు

వెతల కెదవడి వెనుకడుగు వేయగ, దుష్టుల్

జితులౌ క్రౌర్యము నెరపుచు

ప్రతి భనునది లేనివాడె ప్రాజ్ఞుం డిలలో

 

కం.

అతిగ ధనము వెచ్చించగ

ప్రతినిధు లౌతురని నేటి పాలకు లరయు

న్నతు లెన్నిక కెడవగుదురె

ప్రతి భనునది లేనివాడె ప్రాజ్ఞుం డిలలో

వెంకట్.సి హెచ్

 

 

ఆ వె

చదువు లేని జనుల సంతోష బెట్టుచు

నాటకముల నాడె నోటు కొరకు

మోసగింప దలచి మోమున నవ్వుతో

ప్రతిభ లేని వాడె ప్రగతి జూపు

 

కం||

మితి మీరిన చేష్టలతో

నతిగా తా గొప్ప యనుచు నార్భాటముతో

గతి దప్పిన జనులందున్

ప్రతిభ నునది లేనివాడె ప్రాజ్ఞుండిలలో!!

కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి

 

 

తేటగీతి

వారసత్వపు పోకడల్ వ్యాప్తి చెంద,

భాగ్యపుముసుగును ధరించి వట్టివారు,!

గట్టివారుగ దరణిని గణుతి కెక్క,

ప్రతిభనునది లేకున్నను ప్రాజ్ఞు డిలను!!


 **************

 

తల్లిదండ్రులు మారాలి  (సేకరణ)

పిల్లల్ని గారాబంగా చూసుకోవడం మంచిదే కానీ, అది మరీ శృతిమించితే మొత్తానికే నష్టం వస్తుంది.. .

 

పిల్లల పట్ల తల్లిదండ్రులు చూపిస్తున్న అతి ప్రేమనే వారిని చాలా వరకు బద్దకస్తుల్ని చేస్తుంది.

 

ఇప్పుటి తరం పిల్లలు..

(10 సంవత్సరాలు దాటిన వాళ్ళు)

 

🔥 మంచి నీళ్ళు, పాలు, కిరాణా సరుకుల కోసం బయటికి వెళ్ళమంటే వెళ్లరు..

🔥  లంచ్ బ్యాగ్ లు, స్కూల్ బ్యాగులు శుభ్రం చేసుకోరు..

🔥  కనీసం ఇంటి దగ్గర చిన్న చిన్న పనులలో సహాయం చేయరు...

🔥 రాత్రి 10 గంటల లోపు పడుకుని, ఉదయం ఆరు లేదా ఏడు గంటల లోపు నిద్ర లేవ మంటే లేవరు...

🔥  గట్టిగా మాట్లాడితే ఎదురుతిరగబడి సమాధానం చెబుతారు..

🔥  తిడితే వస్తువులను విసిరి కొడతారు..

 

ఆడపిల్లలు అయితే -

🔥  తిన్న కంచం కూడా కడగటం లేదు..

🔥  ఇల్లు ఊడ్చమంటే కోపాలు వచ్చేస్తున్నాయి..

🔥  అతిథులు వస్తే కనీసం గ్లాసుడు మంచి ఇవ్వాలన్న ఆలోచన లేని అమ్మాయిలు కూడ ఉన్నారు..

🔥 20 సంవత్సరాలు దాటిన చాలామంది ఆడపిల్లలకు వంట కూడా చేయడం రావటం లేదు..

🔥  బట్టలు పద్ధతిగా ఉండాలి అంటే ఎక్కడలేని కోపం వీరికి..

🔥  కల్చర్, ట్రెండ్, టెక్నాలజీ పేరిట వింతపోకడలు..

 

 వారిస్తే వెర్రి పనులు..

తల్లిదండ్రులే పిల్లలచేత అవన్నీ చేయించడం లేదు. ఇందుకు కారణం

అహం, పరువు, ప్రతిష్ట, అతి ప్రేమలు అడ్డొస్తున్నాయి..

 

చూసేవాళ్లకు  మంచి హోదాలో ఉండాలి, రిచ్ లుక్, స్టేటస్ మెయింటైన్ చేయాలి అని భ్రమలో ఉన్నారు తల్లిదండ్రులు..

 

గారాభంతో పెరిగిన పిల్లలు మధ్యలో మారమంటే మారడం అస్సలు జరగదు..

వారిని కష్ట పెట్టమని కాదు ఇక్కడ చెప్పేది..

కష్టం గురించి తెలిసేలా పెంచండి

కష్టo, డబ్బు, సమయం, ఆరోగ్యం విలువ తెలియకపోతే.. వారికి జీవితం విలువ తెలియదు..

 

ఇలాగే ఉంటే కొంత కాలానికి తల్లిదండ్రులను గౌరవించే పద్ధతి కూడా లేకుండా పోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు..

 

భార్యకు వంట వండటం సరిగా రాదని నేటి యువత బిర్యానీలు, కర్రీ పాయింట్ ల వెంట పడుతూ చిన్న వయసు లోనే గ్యాస్టిక్ అల్సర్, గాల్ బ్యాడర్ స్టోన్స్ , కిడ్నీ స్టోన్ ల బారిన పడుతున్నారు.

 

కాలేజీ పిల్లలు అయితే సరిగ్గా ఒక పిడికిలి పట్టేంత టిఫెన్, లంచ్ చిన్న బాక్సు రైస్..

చాలామంది ఫ్రూట్స్ అసలు తినరు...

 

గర్భవతులు అయిన తరువాత వారి బాధలు వర్ణనా తీతం.. పూర్తిగా మందుల మీద  ఆధారపడడం , 100 లో 90 మంది సిజేరియన్ ద్వారా పిల్లల్ని కంటున్నారు అంటే వారి శారీరక పటుత్వం ఎంత పడిపోయిందో ఆలోచించండి..

 

అలా ఉంటే పుట్టే పిల్లలు కూడాఏదో ఒక జన్యులోపంతో పుడుతున్నారు..

3వ తరగతి పిల్లాడికి సోదబుడ్డి లాంటి కళ్ళద్దాలు..

5వ తరగతి వారికి అల్సర్, బీపీ లు..

10 వ తరగతి దాటేలోపు ఎన్నో ఆరోగ్య సమస్యలు వచ్చేస్తున్నాయి..

 

వీటన్నికి కారణం తల్లిదండ్రులు పిల్లలను సరైన పద్ధతిలో పెంచకపోవడమే..

అందుకే తల్లిదండ్రులు మారాలి..

రేపటి సమాజానికి ఏమి నేర్పుతున్నాం...?

 ఒక్కసారి ఆలోచన చేయండి...

 సంస్కృతి సాంప్రదాయం అంటే ఏమిటి...?

 

కేవలం గుడికి వెళ్లో, చర్చికి వెళ్లో, మసీదుకు వెళ్ళో  పూజలు, ప్రార్థనలు చేసి మన సంస్కృతి సాంప్రదాయం అని పిల్లలకు అలవాటు చేస్తున్నాము, ఇది మాత్రమే కాదు సాంప్రదాయం అంటే..

 పిల్లలకు.. నేర్పించాల్సిన సంప్రదాయం👇

 

👉  బాధ్యత

👉  మర్యాద

👉  గౌరవం

👉  కష్టం

👉  నష్టం

👉  ఓర్పు

👉  సహనం

👉  దాతృత్వం

👉  ప్రేమ

👉  అనురాగం

👉  సహాయం

👉  సహకారం

👉  నాయకత్వం

👉  మానసిక ద్రృఢత్వం

👉  కుటుంబ బంధాలు

👉  అనుబంధాలు   

👉  దేశ భక్తి

👉   ప్రతి విషయంలో వాస్తవం ఆలోచించడం

👉    *భ్రమల్లో నుండి  బయటకు రావడం*

 

కొంచెం కష్టమైనా సరే ఇవి తప్పక చిన్న వయసులోనే పిల్లలకు అలవాటు చేయాలి..  ఇవన్ని అలవాటు అయితే ఆరోగ్యం, మానసిక పరిస్థితి, సామాజిక సృహ, ఉత్తమ జీవన విధానం వారికి అందించిన వారమవుతాం..

మనం కూడా మమేకమవుదాం.


******* 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...