12, ఫిబ్రవరి 2021, శుక్రవారం

30.01.2021, శనివారము, పుస్తక సమీక్ష, శ్రీ కాళహస్తీశ్వర శతకం

 


30.01.2021, శనివారము, పుస్తక సమీక్ష

 

ధూర్జటి మహాకవి విరచిత శ్రీ కాళహస్తీశ్వర శతకం, శ్రీ కాళహస్తీశ్వర మహత్యం కావ్యంలో మీకు నచ్చిన పద్యాలు / ప్రభావితం చేసిన పద్యాలు పంచుకోగలరు.

 

 

మీలో చాలా మంది ఈ రష్యన్ జానపద కథల సంగ్రహం చదివే ఉంటారు. చిన్నతనంలో ఈ కధలోని కల్పన ( మాయాగుఱ్ఱం - మేటి గుఱ్ఱం), ఊహానుభూతి అత్యద్భుతం అని చెప్పగలను. 

 మాయ గుర్రం కథని చెప్పిన వారు ఎమ్. బులాతొవ్. టి. మావ్రిన దానికి తగినట్లుగా అందమైన బొమ్మలు గీసారు. ఈ కథకి ఇంగ్లీషులో చెస్ట్‌నట్ గ్రే అని పేరు.

 

అందరూ వెర్రివాడనుకునే కుర్రాడు రాజుగారి అల్లుడయ్యేలా చేస్తుంది ఓ మాయగుర్రం. ఎంతో ఆసక్తికరమైన చిన్న కథ... వీలైతే ఆస్వాదించండి.   

 

ఈ కథలకి అద్భుతమైన వర్ణమిశ్రమంతో వేసిన అందమైన బొమ్మలని చూస్తుంటే పిల్లలే కాకుండా పెద్దలు సైతం మైమరిచిపోతారు అంటే ఎంత మాత్రం అతిశయోక్తి కాదు.  

 

తెలుగు తేనియలలో రష్యన్ సాహిత్యమేమిటా అనుకోవద్దు... తెలుగులో అనువాదం జరిగి లక్షలాది మంది అనుభూతి చెందిన అందమైన చిట్టి కథ.

 

మాయాగుఱ్ఱం- మేటి గుఱ్ఱం  రష్యన్ జానపద కథ

ఈ పద్యం చూసిన తరువాత ధూర్జటి గారి ప్రఖ్యాతమైన పద్యం పంచుకోవాలని అనిపించింది.

 

ధూర్జటి గారికి ప్రకృతి లో ఏమి చూసినా కాళహస్తీశ్వరుడు గుర్తురావడానికి ఇదొక తార్కాణం మాత్రమే... కాళహస్తీశ్వర మహత్యం లో కనిపించే అందమైన పద్యం. తూర్పు దిక్కులో ఉదయించిన సూర్యోదయం చూసి పరవశించి ఆయన చెప్పిన పద్యము..

 

 ll

ఉదయగ్రావము పానవట్ట, మభిషేకోదప్రవాహంబు వా

ర్ధి, దరధ్వాంతము ధూపధూమము, జ్వలద్దీపప్రభారాజి కౌ

ముది, తారానివహంబు లర్పితసుమంబుల్ గాఁ దమోదూరసౌ

ఖ్యదమై శీతగభస్తిబింబశివలింగంబొప్పెఁ బ్రాచీదిశన్

 

ఆ పద్యం మరొకసారి గమనించండి.         

 

ఉదయగ్రావము పానపట్టముఁ  =  సముద్రంలో దూరంగా కనిపించే కొండ, మహాశివుని పానపట్టము లాగా కనిపించింది (ఆయన కూర్చునే పీఠము, గద్దె లాగా)

అభిషేకోదప్రవాహంబు + వార్ధి =  అభిషేకం చేయగా , క్రింద పడిన నీరు కాస్త సముద్రంగా మారిపోయిందిట

ధరధ్వాంతము ధూపధూమము = అప్పుడే కమ్ముకుంటున్న ముసురు చీకట్లు.. శివాలయం లో వేసిన ధూపం లాగా కనిపించాయి 

 జ్వలద్దీప ప్రభారాజి కౌముది = గర్భాలయం లో ఉండే దీపం కాంతి లాగా వెన్నెల నీకు ఈ ఆలయానికి దీపం లాగా ఉంది 

తారానివహంబులర్చిత  సుమంబులు‌గా  = ఆకాశంలో ఉండే నక్షత్రాలు, నీకు పూజ చేసిన తరువాత చెల్లాచెదురుగా పడిన పుష్పాల వలె చెల్లా చెదురుగా పడి ఉన్నాయి

 తమోదూర సౌఖ్యదమై = మనసులో తమస్సుని దూరం చేసి, సూఖ్యము కలిగించే రీతిలో ఆ శివలింగం కనిపించిపించింది ఈ తూర్పు దిశలో అని ఆయన ఉద్దేశం.


ప్రకృతి లో ఏమి చూసినా శివలింగం కనిపించడం అనేది ఆయన భక్తికి సిసలైన నిదర్శనం.  అందుకే కాళహస్తీశ్వర శతకం, కాళహస్తీశ్వర మహత్యం ఇన్ని వందల సంవత్సరాలైనా మన  నాల్కల మీద నాట్యమాడుతుంటాయి   

 

సరళంగా చెప్పే పదాలలో సైతం, గాంభీర్యమైన భావన అందంగా గోచరిస్తుంది ధూర్జటి గారి పద్యాలలో.


అందుకే శ్రీకృష్ణదేవరాయలు సైతం స్తుతమతి అయిన ఆంధ్రకవి ధూర్జటి పల్కులకేల కల్గెనీ యతులితమాధురీ మహిమ ? అని రాయలు వారు ప్రస్తుతించారు.

 

అది ప్రాతః కాలము.

ఆ సూర్యోదయ సమయాన,  తూర్పు దిక్కున, తూరుపు కొండ పానవట్టములాగా, సముద్రము అభిషేక జలములాగా, ((సూర్యోదయమవుతూ ఉండడం వలన,అప్పుడప్పుడే తొలగిపోతున్న) రేచీకటులు  శివాలయములో వేసిన ధూపపు  పోగలాగా,(ఉదయము అవుతూ ఉండడం వలన మెల్లగా అస్తమిస్తున్న చంద్రుని) లేలేత వెన్నెల, గర్భాలయంలోని లేలేత దీప కాంతిలాగా, (సూర్యోదయం వలన చెల్లాచెదురౌతున్న) తారాసమూహము, పూజా పుష్పాలలాగా ఒప్పుతుండగా.. చీకట్లను దూరము చేసి, సౌఖ్యం కలింగించే విధంగా.. ఆ  శీత,  *చల్లని ఉదయకాలపు  సూర్యబింబము, శివలింగము లాగా, తూరుపు దిక్కున ప్రకాశించినది...

 

అద్భుత వర్ణణ.. అంతకు మించిన అద్భుత శివభక్తి తత్త్వమూను.

*****

 

కాళహస్తీశ్వర శతకం లోనినాకు నచ్చిన  పద్యం.

 

పవి పుష్పంబగు,నగ్నిమంచగు,  నాకూపారంబుభూమీస్థలం

బవు శత్రుండతిమిత్రుఁడౌ,విషము దివ్యాహారమౌ నెన్నఁగా

నవనీమండలిలోపలన్ శివ శివేత్యా భాషణోల్లాసికిన్

శివ ! నీనామముసర్వవశ్యకతమౌ శ్రీకాళహస్తీశ్వరా !

 

భావం : శివ, శివ యనరాదా !

శివనామమే చేదా?

భవసాగరమీద దుర్భర వేదన

లేదా?

కరుణాళుడు కాదా !అనువిధముగానీనామజపము  మాకువజ్రాన్నిపువ్వులాగామెత్తగా, అగ్నినిమంచులాగ చల్లగా

సముద్రాన్నిభూమిలాగనివాస

యోగ్యాంగా, శత్రువునిమిత్రునిగ, విషాన్ని

మృష్టాన్నంగా చేస్తుంది.

హేమలత

 

శ్రీ కాళహస్తీశ్వరమహత్యం లోని 7 వ పద్యం 

 

|| 

దివిజక్ష్మారుహధేను రత్న ఘనభూతి ప్రస్ఫురద్రత్న సా

నువు నీ విల్లు; నిథీశ్వరుండు సఖు డర్ణోరాశి కన్యా విభుం

డు విశేషార్చకు డింక నీ కెన ఘనుండుం గల్గునే? నీవు చూ

చి విచారింపవు; లేమినెవ్వడుడుపున్? శ్రీకాళహస్తీశ్వరా!    

 

భావము 

దివిజ+క్ష్మా+రుహ+ధేను +రత్న "ఘనభూతి" కల్పవృక్షము, కామధేనువు, చింతామణి మొదలైన ఐశ్వర్యప్రదములైన వస్తువులతో నిండియున్న బంగారు పర్వతము నీకు విల్లు కదా ! 

 

ఘనభూతి (ఘనమైన సంపదలు ఆధీనంలో ఉన్నకుబేరుడు) నవనిధులకు నాయకుడైన కుబేరుడు నీకు ప్రియమైన మిత్రుడు. 

లక్ష్మీపతియైన నారాయణుడు నీ పరమభక్తుడు. ఇన్ని యున్న నీకంటె ఘనుడెవ్వడు? వీరిలో ఏ ఓక్కరితోనైన చెప్పి నా దారిద్య్రము దీర్చగల సామర్థ్యము నీకున్నది. అయినా ఆ పని చేయవు. నిన్ను మఱ్చిపోవుదునని భయమా?

నాయెడల నీ యనుగ్రహ దారిద్యమును దీర్చువాడవు నీవే తప్ప ఇంకెవరున్నారు కాళహస్తీశ్వరా ?

 

ఇంకా లోతైన భావన : 

నీకు ఆత్మీయులైన వారు, నీ భక్తులైన వారు కూడా ఎంతో ఉత్తమోత్తమములు.. వారి స్నేహం, వారికి నీపై ఉన్న భక్తి ఉన్న నీవే ఏంటో ఘనుడవు    ఇంతమంది ఐశ్వర్యవంతులు నీ వాళ్ళున్నారు. వారిలో నెవరు నీ దారిద్ర్యమును పోగొట్టుగలరని యెప్పుడును ఆలోచించవు. 

అదే నీ ఘనత. ద్వాతీతులైన సుఖములు/దుఃఖములు కలిమిలేముల సామాన్యవిషయములను మాతో చెబుతున్నావా కాళహస్తీశ్వరా !

కస్తూరి శివ శంకర్

 

 

ధూర్జటి మహాకవి తాదాత్మ్యం చెంది రచించిన శ్రీకాళహస్తీశ్వరా శతకము లోని ఈ పద్యము నాకు చాలా బాగా నచ్చింది.

 

నీకున్, మాంసము వాంఛయేని కఱవా? నీ చేత లేడుండగా

జోకైనట్టిగా కుఠారముండ, ననలజ్యోతుండ, నీరుండగా

పాకరంబొప్ప ఘటించి, చేతిపునుకన్ భక్షింప కా బోయచేఁ

చేకొంటెంగిలి మాంసమిట్లు తగునా శ్రీకాళహస్తీశ్వరా!

 

తాత్పర్యము: ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! మాంసమే నీకు రుచించిన, నీకేమి కఱువు? నీ చేతియందు లేడి కలదు. ఇంకొక చేతియందు వాడియైన గొడ్డలి ఉన్నది. ముఖమున అగ్నిజ్వాలలు కురిపించే నేత్రం ఉన్నది. తలపై గంగ ఉన్నది. ఈ సామగ్రి గల నీవు శుచిగా వండుకొని నీ చేతిలోనే ఉన్న పుఱ్ఱెలో తినక ఒక బోయవాని ఎంగిలికూటినేల తింటివి?

 

ఈ పద్యములో ధూర్జటి మహాకవి యొక్క చమత్కారమైన నిందా స్తుతి కనిపిస్తుంది. పరమేశ్వరుని తనలో నిక్షిప్తం చేసుకున్న కవియే ఇలా తన దైవాన్ని ప్రశ్నించగలడేమో అనిపించేలా ఉంది. భక్త పరాధీనుడవైన నీకు  ఆ బోయయందు గల వాత్సల్యమే కాని నిజముగా మాంసం తినాలనే కోరిక కాదుగా అని చెప్పడం కవి భావన. భక్తితో సేవించే వారి పట్ల భోళా శంకరుడు ఎంతటి ప్రసన్నతను వ్యక్త పరుస్తారో ఈ పద్యము ద్వారా కవి తెలుపుతున్నారు.

వెంకట్.సి హెచ్

 

 వాణీవల్లభ దుర్లభంబగు భవద్ద్వారంబున న్నిల్చి, ని

ర్వాణశ్రీఁ చెరపట్టఁ చూచిన విచారద్రోహమో, నిత్య క

ళ్యాణ క్రీడలఁ బాసి, దుర్దశలపాలై, రాజలోకాధమ

శ్రేణీ ద్వారము దూరఁ జేసి తిపుడో శ్రీకాళహస్తీశ్వరా!     2

 

నిను సేవింపగ నాపదల్పొడమనీ, నిత్యోత్సవం బబ్బనీ,

జనమాత్రుండననీ, మహాత్ముడననీ, సంసార మోహంబు  పై

కొననీ, జ్ఞానము గల్గనీ, గ్రహగతుల్ కుందింపనీ, మేలు వ

చ్చిన రానీ, యవి నాకు భూషణములే శ్రీ కాళహస్తీశ్వరా!     12

 

ఈ  పద్యములు రెండు చాలా ఉపయోగమని తెలుసుకున్నాను .

 కొందరు ఉద్యోగములలో చేరగానే ఉన్నతాధికారితో స్నేహం కోసం ,వారి కరుణ కోసం చాలా సమయం వృధా చేసుకుంటారు. ఈ  నేపథ్యంలో వారి విధి నిర్వాహణను ,వారి విజ్ఞాన అభివృద్ధిని పూర్తిగా విస్మరిస్తారు. .అటువంటివారు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే లాగా వుండి  పోతారు .

 నిందలను విస్మరించక , పొగడ్తలను విని వదిలేస్తూ ,

విధినిర్వహణే  కర్తవ్యంగా భావించాలి .వచ్చిన ఉద్యోగం మంచిగా చేస్తున్నా ఇచ్చిన పనిని ఆరాధిస్తూ చెయ్యాలి.

 జి మురళీ మోహన్ రావు




వందల వందల తల్లుల రక్తతర్పణం

మనం పీల్చే ఈ స్వేచ్చా వాయువులు 

వేల వేల ఉరికంబపు ఉగ్గుపాల ప్రతిఫలం

మనం తిరుగాడే నేలతల్లి పునర్జీవనం

బానిస సంకెళ్లు ఉప్పుఅంగళ్ళు దాటుకొని

మహాత్ముని బాట పట్టి సత్యాగ్రహం పట్టుబట్టి

బుద్ధుని ధ్యానం స్మరించుకొని అహింసా

మార్గం ఎంచుకొని నీవు కన్న కలలలో

స్వేచ్ఛా జీవుల్లా మేమంతా!


తొలిమంచు పరిచయం

లేలేత పచ్చని  పచ్చదనం

నులివెచ్చని భానుని ఉష్ణం

చెలి ఎదకై నిలిచిన రూపం

పరిష్వoగనకై వడి వడి తేజం

 


నీవు చూపిన మార్గం అనుసరణీయం

ఎవరు ఆచరిస్తున్నారు బాపూ!

చేత కర్ర పట్టి సాగే నీ నడక సదా స్మరణం

ఎవరు నడుస్తున్నారు జాతిపిత!

ఆ బోసి నవ్వుల వెనుక అంతర్మధనం

ఎవరు నడుస్తున్నారు గాంధీజీ!

బక్కపలచని రూపం మేరునగ ధీరత్వం

ఎవరు అంచనా వేస్తున్నారు కరంచంద్!

కోవూరి

గాంధీ వర్ధంతి సందర్భంగా

శీర్షిక: గాంధేయ మే ఆదర్శ మైతే( వచన కవిత)

 

" సత్యశోధన" గాంధేయం అదే ఆదర్శమైతే

అసంఖ్యాక మహాత్ముల ఆవిర్భావం

"అహింసాయుధమే"గాంధేయం అదే ఆద ర్శ మైతే

ప్రపంచ శాంతి సులభ సాధ్యమే

"సత్యాగ్రహ పోరాటమే" గాంధేయం

అదే ఆధర్శమైతే కర్కశ నిరంకు శులూ దాసోహమే

"మద్య నిషేధమే" గాంధేయం అదే ఆదర్శ మైతే

ఇల్లాళ్ల రక్త కన్నీటికి సెలవే "మత సామరస్యమే"

గాంధేయం అదే ఆదర్శమైతే

సర్వమత సోదర భావ సుందర స్వప్నం సాకారమే

"విదేశ వస్తు బహిష్కారమే" గాంధేయం అదే ఆదర్శ మైతే

డ్రాగన్ లాంటి దేశాల తోకల కత్తిరింపే

"స్త్రీ పూజ్యతే" గాంధేయం అదే ఆదర్శ మైతే

ఆడపిల్లల తల్లిదండ్రులకు నిశ్చిం తే

"గ్రామా భ్యుదయ మే" గాంధేయం అదే ఆదర్శ మైతే

" పల్లేసీమల అభివృద్ధి పరుగులే

"నిస్స్వార్ధ సేవే" గాంధేయం అదే ఆదర్శ మైతే

కలికాలంలోనూ రామరాజ్యం సాక్షాత్కారమే

"స్వచ్ఛ భారతమే" గాంధేయం అదే ఆదర్శ మైతే

ఆరోగ్య భారతం సమస్త విశ్వానికి ఆదర్శ మే.

డి.రామ నాగేశ్వరరావు

 

భ్రమ

తను చూస్తున్నాడు నేను

వడి వడి గా వెళ్లాను తనకు దగ్గరగా

ఆశ్చర్యం వెక్కిరించింది "తను" నా భ్రమ

 

రిక్తహస్తలు నాకేసి చూపిస్తున్నాయి

ఆహ్వానం పలుకుతున్నట్లుగా

శూన్యం ఆవరించింది "రిక్తహాస్తాలు" నా భ్రమ

కోవూరి 


 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...