22, ఫిబ్రవరి 2021, సోమవారం

చిత్ర కవనం 86, 04.02.2021 గురు వారం

 


04.02.2021 గురు వారం

చిత్ర కవనం 86

పై చిత్రానికి మనోహరమైన పద్య/ వచన కవితలను అందించగలరు.

 కవులు/కవయిత్రులు తమ మనోఫలకము మీద తారాడెడు రమణీయ భావనలను వెలికి తీసి, సుమనోహర వన్నెయల నద్ది తేనియల దిటవు తెలిపెడి కవితలల్లి, సమూహాము తేజరిల్లు నట్లు ఘనత చేకూర్చగలరని విన్నపము.

 

 

చిత్ర కవనం 86

కం.

ఉత్తరము లివియె జ్ఞాపక

చిత్తరము లివియె మరచిన చేవ్రాలులివే

చిత్తము రమించెడు సకల

పొత్తములివె ముడుగుపడిన మోహనములివే

వెంకట్.సి హెచ్

 

 

చిత్ర కవనం 86

హో.. ఇది లేఖ...

ప్రేమలేఖ...

మధుర స్మృతుల..బదులుగా..

నీ మనసు రాసిన లేఖ..

పెరటి తోటలో.. పండువెన్నెల...

జాజిపువ్వుల.. పరిమలాలతో.. ఈ లేఖ.

నీ రాక తెలుపున లేఖ...

బదులు కోరెన లేఖ...

గురుతు గురుతుగా.. గుండె గూటెలో...

గూడు కట్టే లేఖ.

సుఖము పంచెన... బాధ తీర్చున...

బదులు తెలిపే లేఖ...

ఓ.. ఇది లేఖ...

ప్రేమలేఖ...

నిన్నే తలిచిన... నీతో నడిచిన...

నన్నే... మరికొన్నే..

ఏరి కోరి దాచి పెట్టిన ఈలేఖలన్ని క్షణాలే..

అక్షరాలు నాకు దీపాలే...

నీ రాక తెలుపు లేఖ...

నీ చూపు కోసమొక లేఖ..

దారిలోన ఒక లేఖ..

ఓదార్పు తెలుపు నీ లేఖ...

ఏన్నేన్ని దాచినాననో..

నీ గురుతుగా.. గంపెడు ఆశతో..

గడియకోకటి చొప్పున చదివిన తనివితీరని లేఖ..

ఓ.. ఇది లేఖ...

ప్రేమలేఖ......

సూర్య తాడిపూడి

 

 

చిత్ర కవనం 86

ఆటవెలది..

పోస్టు కార్డు వ్రాసి పొందగ విషయమ్ము

తరచి చూచి, చదివి, మరల చదువు

మమత లెల్ల బెంచు మల్లెలై మదిలోన

తిరుగు జాబు వ్రాయ తిరుగులాడు....

పి.ఎల్.నాగేశ్వరరావు

 

 

చిత్ర కవనం 86

పోస్ట్ కార్డు

ఒకప్పటి విలువైన జ్ఞాపకం

మరపు రాని మధురమైన  స్మృతి

పోస్ట్ అన్న కేక మనసు పొరల్లో

విస్తృతమైన భావనకు నాందీ ప్రస్తావన

చిరునామా మనదైనా పంపినవారికై ఆత్మీయ వెతుకులాట

నీది నాది అని కాక రాసిన ఆ స్వేచ్ఛా ఉత్తరంలో

అక్షర అక్షరం చదువుతుంటే రాలుతున్న ఆ ఆనందభాష్పాలు.........

శాస్త్ర సాంకేతిక రంగంలో పురోగతితో  కనుమరుగవుతున్న సంప్రదాయ లేఖలు

ఉత్తరం బట్వాడా

అలుపెరుగని పోస్టుమాన్ జీవన పోరాటం

కళ్ళదుటే సాక్షాత్కారం

కనుమరుగవుతున్న అక్షర కార్డు ముక్క

గుర్తు చేసింది నా బాల్యాన్ని మరొకసారి......

కోవూరి

 

 

చిత్ర కవనం 86

తేటగీతిలో..

మనసు సేదదీర్చు కబుర్ల మమత తోడ

దరిని జేర్చు గుండియలను దవ్వులౌగ

కష్టసుఖములందున్ పొందుకాడు కాగ

చిన్నదైనను యీముక్క చింతలుడుపు.

గౌరీనందన్, బెంగుళూరు

 

 

చిత్ర కవనం 86

మనసు మాటలు తెలుపగ మంచి గాను

మమత సమతల వారధి మరపు రాని

మధుర  గురుతులు నిలపగ మంచి నావ

కుశల ములుతెచ్చు పెళ్లిని గుర్తు చేయు

విజయ మునుతెచ్చు, ఇచ్చును  వీర చక్రము

కొలువు సందేశ మిచ్చును కొసరి మనకు

 

 

చిత్ర కవనం 86

పోస్ట్ కార్డు

ఆత్మ బంధాలకు అను బంధాలకు

ఉత్తమ రాయబారిగా కొన్ని తరాలకు

సేవ జేసి విశ్రమించిన వీరుడు పోస్ట్ కార్డు.

మహారాజశ్రీ తో మొదలైన శుభ సందేశము

చదువుట నారంభించగనే హృదయము

ప్పొంగగ మోమున ముదము కదలాడు.

భవదీయుడు తో ముగింపైన సందేశము

అపుడే అయిపోయిందా యను భావము

దయించి  మనసునందు  ఉస్సురనిపించు.

ఎన్నో ఎదురుచూపుల శాంత పరుచగ

తోకలేని పిట్ట గా పేరు గొన్నదీ పోస్ట్ కార్డు.

CA కె మల్లికార్జునరావు

 

 

చిత్ర కవనం 86

ఆటవెలది

చేతిరాత తోడ చేరునందరికిని

కార్డు, చిన్న పెద్ద కవరు లైన

రాగభావములను రాతలు ప్పొంగించు

పాత జాబులన్ని పఠన జేయ.

హేమలత

 

 

చిత్ర కవనం 86

సీసము

శ్రీ కారమును జుట్టి క్షేమంంబు ప్రశ్నించు ప్రత్యుత్తరంబిచ్చు వరకు దిగులు

ప్రియమైన వారిని ప్రేమతో పిలిచెడి వరుసలు కలిపెడి పథముఁ దెలుపు

అక్షరంబులఁ జూచి యాంతర్య మెరిగెడి విశ్వ గ్రహణ విద్య విశద పరచు

ప్రేమజంటల మనో వేదన చల్లార్చి యన్యోన్య రాగాల నధిక పరచు

 

ఆటవెలది

ఉత్తరంబు నాటి యుత్తేజ భరితంపు

జ్ఞాపకాల వార్ధి జగముకెల్ల

ఉత్తరంబు నేడు పత్తానె లేదురా

కాలగర్భమందు కలిసి పోయె

ఆదిభట్ల సత్యనారాయణ

 

 

చిత్ర కవనం 86

తే. గీ.

మనసు పొరలను చూపించు మాధ్యమమ్ము

తీపి గుర్తుల నెద నింపు తేనెపట్టు

ఉరుకు వార్తల నందించు నుత్తరమ్ము

ఉరుము వార్తల మదిజీల్చు నుత్తరమ్ము.

డి.రామ నాగేశ్వరరావు

 

 

చిత్ర కవనం 86

హితుల మనసు దెల్పగ సన్నిహితుల జేసి

యాగమన శుభవార్తలన్ హాయినిచ్చి

తోడు నిల్చు నాత్మీయుల జాడదెల్పి

యొంటరి తనము బోగొట్ట జంటనిల్చి

మర్మ మెరిగించు తానొంటి మసిని జూపి

చావ సిద్ధమై కొనివచ్చు చావువార్త

స్నేహ సౌరభాల్ వెదజల్లు చిట్టి నేస్తి

ఉట్టి కెక్కగ నిన్నెవరుద్దరించు!!

 వాణిశ్రీ నైనాల

 

 

చిత్ర కవనం 86

గుండెకొట్టుకుంటున్నది

సుదీర్ఘనిశ్శబ్దవిరామాన్ని

పాఠంగొంతుగ ఎత్తుకునేందుకు,

గుండెకొట్టుకుంటున్నది

బాలల ముఖాలను చదువులరంగులతో

అలంకరించగ, గుండెకొట్టుకుంటున్నది

బడి ,సందడియై వందలబాల్యోదయాలను

ఒకేసారి దర్శించగ, గుండెకొట్టుకొంటున్నది

నిదురోయిన తరగతిగదికి

పద్యాలసుప్రభాతమవగ,

గుండెకొట్టుకుంటున్నది

సగమైన ఉపాధ్యాయస్నేహం సంపూర్ణరాగమాలపించ,

గుండెకొట్టుకుంటున్నది

బడిగంటకు ప్రాణం వస్తుందని

చాకుపీసు చెంపలనిమరొచ్చని,

నల్లబల్ల నుదురుపై అక్షరముద్దులు పెట్టొచ్చని,

మైదానం ఆటలవేషం కడ్తుందని,

గుండెకొట్టుకొంటున్నది

గుండెకు గుండెతనం వచ్చిందనీ

రాంమోహన్ నిజామాబాద్

 

 

చిత్ర కవనం 86

ఆ. వె

కార్డు ముక్కలవియె కాపురాల్ నిలిపేను

కార్డు ముక్కలనగ కాజ సమము

కార్డు సేద తీర్చు కాసారముల తీరు

కార్డు వచ్చినపుడు కనులు మెరయు.....

జైకర్ విశ్వేశ్వర్ టోణ్ పె, థానే, ముంబయి

 

 

చిత్ర కవనం 86

మహారాజశ్రీ.......

అమ్మాయే పుట్టిందని పెద్దోడికి బ్యాంకు వుద్యోగం

వచ్చిందని నవ్య పెళ్ళికి అందరూ రావాలని

 

బాబ్జికి ఇంజినీరింగ్ లో, వాడి చెల్లెలు

సుష్మకి వైద్య కళాశాలలో ప్రవేశాలు వచ్చాయని

 

బామ్మ చనిపోయి నాల్గు రోజులయింది

  వారం ఆంతా మైలే అని కబుర్లే కబుర్లు .

 మధ్యాహ్నం వుత్తరం కోసం తొంగి తొంగి చూసుకోవడం

 రాగానే నేను, నేను అంటూ ఎగబడటం

చదివిందే చదివాక  అమ్మ, ఆ కబుర్ల పూసలన్నీ

పులమాలల్లగా ఓ గొడుగు చువ్వకి గుచ్చి దాచేది .

 అలా నవరసాల కబుర్ల కలయిలే మన అప్పటి ఉత్తరాలు !

జి మురళీ మోహన్ రావు

 

 

చిత్ర కవనం 86

ఉభయ కుశలోపరి యనుచు నూరడించి ,

ఊరు మట్టి వాసన దెచ్చి ఊత మిచ్చు !!

జాజి పూల పరిమళమౌ జాబు లోని

పలకరింపులు !! లేఖలో ప్రాణ సఖుల

మోము కనువిందు చేయు సమ్మోహ నముగ !!

అయిన వారిచేతిస్పర్శ ఆనవాళ్లు

తడిమి చూడ తపన దీరు తన్మయముగ !!

రమ


 

చిత్ర కవనం 86

సీ.

దేశ సేవ యొనర్చు ధీరుని కుశలపు వార్త లందించెడు పత్రములివె

పెద్దల పేర్మి దీవెన లిచ్చి సమ్ముదము సమకూర్చెడు స్వస్తిముఖములివియె

ప్రియురాలి మధుర సంప్రీతిని ప్రియుని కొసంగెడి హృదయంగ జాబు లివియె

చేవ్రాలు తోడ సుశ్రేష్టముగ హితుల రూపు జూపించెడు రుక్క లివియె

దూర తీరములను దునుమాడి స్నేహ సౌరభములు  వెదజల్లు  వ్రాత లివియె

ద్యుతి నొసగి నిరుద్యోగుల కష్టాల నుజ్జగించెడు విశేష యుత్తరములె

జగతి నలరు చేసి చరవాణి ధాటికి కనుమరుగై జ్ఞాపకముగ మిగిలె

 

గీ.

హితుల,సన్నిహితుల మధ్య హితముగూర్చి

దూర భార మెరుగుకనె ద్యూతిక వలె

వార్త లందించి రహిగ విస్ఫార మొంది,

పోస్టుకార్డు భూతలమున బ్రుంగువడినె

వెంకట్.సి హెచ్

 

 

చిత్ర కవనం 86

ఆ వె

క్షేమ విషయమిచ్చి సేదను దీర్చుచు

నొక్క కార్డు మనకు నూరటిచ్చు

ఎదురు చూచు వారి మధురానుభూతుల

నిత్య సాక్ష్యమదియె సత్యమిదియె

 

 

చిత్ర కవనం 86

కం||

తెలుపగ వార్తను నిరతము

తలపున తోచేది కార్డు తక్షణ మెపుడున్!

అలవోకగ మన విషయము

తలచిన మన వారికెపుడు తానే జేర్చున్!!

 

కం||

ఉత్తర ప్రత్యుత్తరముల

చిత్తము తా తనువు మరచి చిందులు వేయన్

హత్తెరి! నేనిచ్చిన యీ

దత్తపది ని మరచెనేమి తగదిది మీకున్!!

కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి

 

 

చిత్ర కవనం 86  - శీర్షిక:

మీ జాబుకు నా జవాబు

 

ఈ పోస్ట్ కార్డు చూడగానే.. రేపల్లెలో..నా చిన్ననాటి నేస్తం, విద్యాసాగర్ ఠక్కున గుర్తుకొచ్చాడు... నేను, మా నాన్నగారి బదిలీ కారణంగా, నా 10 వ తరగతి మధ్యలో... తెనాలి వెళ్లిపోయి, వాడు,నేనూ  విడిపోతే...... వాడు ఓ పోస్ట్ కార్డు ఉత్తరం, ఎంతో ప్రేమతో రాసాడు నాకు...

"ఒరే రమణా ! నువ్వు బాగున్నావా ? వగైరా.. వగైరా.. వగైరా...." అని రాసి...మనకందఱికీ ఎంతో ప్రియమైన  *P. S.(Post Script ) గా...............

ఏమి రాసాడో తెలుసాండీ ??

"ఈ కార్డు ముక్క అందినదీ, """లేనిదీ"" తెలియఁ జెయ్యి!" అని.......

వాడి చతురతో, మరి, అమాయకత్వమో...నేటికీ మర్చిపోలేను వాడ్ని, వాడి జాబు ని..నేను.

 

 

చిత్ర కవనం 86

సీ.

"తోక లేనిది పిట్ట;తొంబది యామడల్ పోవునెద్ది ?"యనెడు పొడుపు కథను

జ్ఞప్తికి దెచ్చెనీనాటి 'చిత్ర కవిత'! తెలుగు వాచకమొండు వెలిగె మదిని !

పూర్వము హంస, కపోత ముల్జేసెడి రాయబారమ్ముల, 'రాచ వర్త

మాన' 'లేఖలు'ను, 'కమ్మల', 'చీటి'.. 'బట్వాడ   పఱచు'నిపుడు తా  'తపాల శాఖ' !

ఊరినుండొక హితుడుత్తరమును వ్రాసి, "అందెనో ? లేదొ ?"యనడిగె దెలుప !

దూరదర్శనమందు వారము కొకమారు ప్రసరించుచో, చాల ప్రజ్ఞ జూపి,

ఓలేటివారు ప్రశ్నోత్తర కార్యక్ర మమును జేసియె, మన మనము గెలిచె !

 

తే. గీ.

ప్రియమయిన తెల్గు తేనియ పెద్ద లార !

'ఉభయ కుశలోపరి'; అట, బాగున్న వారె ?

అడిగితి జెలియండ్రన్నల,నమ్మ నాన్న;

లిట్లు, మీ 'వెంకట రమణ' !ఇంక నుందు!!

ఇప్పటికి సెలవ్......

వట్టెం వెంకట రమణ

 

 

చిత్ర కవనం 86

అమ్మా ...చూడాలని ఉంది 

 

కం 1

అమ్మా బాగున్నావా !

నెమ్మించు మమతలతోడు నీహారములన్ 

సమ్మర్షమునే నేర్పుగ     

కమ్మని జోలలవి కైతగా ప్రభవించెన్ !

 

నాన్నకు ప్రేమతో 

కం 2️

నాన్నా బాగున్నావా !

ఎన్నాళ్లయ్యింది కలిసి ! ఈ ఉత్తరమే  

చాన్నాండ్లకు సాంత్వనమై 

కన్నీళ్ళని తుడిచి లేఖగా మారెనులే !

 

 

చిత్ర కవనం 86

మరి నా ప్రియురాలి నుండి ప్రేమలేఖ రాలేదని హృదయవేదన  కూడా చెప్పాలి కదా.

  ll

చెలియా ! మోహనమైన !నా హృదయమే చింతిల్లె దుఃఖార్తియై.!

లలనా ! నీ హృదయమ్ములో చెలువమై లగ్నంబు జేతున్ మదిన్

పలుకుల్ పల్లవమై కనుంగవలలో పల్కించు భావంబులో  

జిలుగుల్ చిందగ లేఖలో నగవులై చెంగల్వపూదండలై  !

 

మరి ఆఖర్లో శుభం కార్డు వెయ్యాలి కదా...

అప్పుడు జవరాలి ఉత్తరం చూసిన తరువాత... ఆ అనుభూతి ఎలా ఉందంటే   

 

 ll

ఉత్తరమే మనోజ్ఞము ! ప్రదోషములో నను పల్కరించగన్ !

పుత్తడిబొమ్మ నొక్కపరి పొంకపురీతిగ వ్రాయులేఖలై   

క్రొత్త పసిండి సోయగపు కూర్మిసరాగము పంచువేళలో 

చిత్తము చిద్విలాసముగ చిందులువేయగ ప్రేమరాగమై

 

చం 1️

అలసిన వేళలో కుసుమహాసవిలాస కరాంచలమ్ములన్    

కలతలులేని మానసము కమ్మనివార్తలతో ప్రసన్నమై  

నెలతల వన్నెచిన్నెలకు నిగ్గులపద్యము జూపగావలెన్  

తెలతెలవారు రాగమున తీయగమీటు సుమాళజావళుల్ 

లలన మనస్సులో జిలుగు లాస్యములై మరి మ్రోగినట్లుగన్ 

వలచిన వన్నెలాడికయి పంచిన ప్రేమసరాగభావమై  

కస్తూరి శివశంకర్


15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...