21, జులై 2020, మంగళవారం

08.07.2020 పద్యములను వ్రాయవలదు వ్యర్ధము సుమ్మీ!!


 

కంద పద్యములు  

విద్యను నేర్వక నెప్పుడు
విద్యను బూజించ కుండ ప్రీతిగ నిలలో
విద్యకు విలువీయనపుడు
పద్యములను వ్రాయవలదు వ్యర్ధము సుమ్మీ!!

కళ్యాణ్ చక్రవర్తి ....  

 

హృద్యమగు మాతృ భాషన
వద్యంబగు రీతులుండ భావము దెలుపన్
సద్యము చందస్సెరుగని
పద్యములను వ్రాయవలదు వ్యర్ధము సుమ్మీ!

వాణిశ్రీ నైనాల .... 

 

పద్యము రమణీయంబై    
హృద్యముగను మనసులందు నింపుగ నిజమే
పద్యపు పొంకము నేర్వక  
పద్యములను వ్రాయువలదు వ్యర్ధము సుమ్మీ
 
పద్యము ఛందోబద్ధము !
గద్యమునందున కవితయు కలకాలముగా
హృద్యముగ నిలుచు, యూరక
పద్యములను వ్రాయువలదు వ్యర్ధము సుమ్మీ

కస్తూరి శివ శంకర్  

 

సద్యోహృద్యముగన్కవి
సేద్యము సాగవలయుసురుచిర సహృదయ నై
వేద్యముగను భాసించని
పద్యములను వ్రాయవలదు సుమ్మీ!

చల్లా దేవిక  
 

 తేటగీతి పద్యములు

 
పెద్ద వారల గాంచక ప్రేమతోడ;
పతనము దలచి పదుగురి బాగు వీడి
పుస్తకమ్ముల జదువక పుడమినందు
విద్య గల్గిన మనుజుడు వింత పశువు
కళ్యాణ్ చక్రవర్తి .....

 

స్వార్ధ బుద్ధిని వదలక సంకుచితము
తోడ మనుజులు ధరణిలో తొంగలించి,    
విద్యలెన్నియో మౌఢ్యము పెంచి నపుడు
మానవాళికి ద్రోహము మొనయు నపుడు
విద్య గల్గిన మనుజుడు వింత పశువు
శ్రీదేవి.... 

 

 
భావయుక్తముగ సలిపె పద్య కవన
మె పలువురి మెప్పుపొందును; యెంచి తెలుప
కుత్సితపు మనసుకలిగి గుణమెరుగని
విద్య గల్గిన మనజుడు వింత పశువు.
వెంకట్.సిహెచ్.... 

 

వృద్ధ మాతాపితలపైన శ్రద్ధ లేని;
చదువు లెన్నియో గల్గు విజ్ఞానఖలుఁడు;
విద్య కలిగిన మనుజుడు వింత పశువు !
****
యంత్ర సృష్టితో తామారె యాంత్రికముగ
 బుద్దిబలమున్న మనసేమొ మొద్దు బారె
మూఢ నమ్మకములు నమ్మి మూర్ఖు డవగ
మనసును బలహీన పరచు మంత్ర, క్షుద్ర
విద్య గల్గిన మనుజుడు వింతపశువు
 వాణిశ్రీ నైనాల 

 

చదువు లెన్నియో నేర్చిన చపల చిత్త
దుర్గు ణంబులు గలిగిన దుర్మదుండు
 దౌష్ట్య మృగముగా తనరుచు దైన్య ముగను
విద్య గల్గిన మనుజుడు వింత పశువు
గీతాశైలజ 

 


నీతి నియమ సంస్కారము నేర్చుకొనగ
నాటి విలువైన విద్యకు సాటి యేది?
చదువులందు సంస్కార సంపదలు లేక 
పొట్టకూటి కొఱకు నేర్చునట్టి నేటి
విద్య గల్గిన మనుజుడు వింత పశువు
కస్తూరి శివ శంకర్

 

 బుద్ధి కుశలత జూపక పుడమి లోన 
సజ్జనుడికి  కీర్తియు ప్రాప్తి చదువు వలన
విద్య నేర్చి ద్రోహులు నేడు వినుతి కెక్కు
విద్య గల్గిన మనుజుడు వింత పశువు
కస్తూరి శివ శంకర్ 

 

పద్య గద్యము లెన్నియొ ప్రాభవముగ
కడిగి రచనల జేయుచు ఘనత నొంది
కలుషమనము గల్గిన వాని గని తలచిరి
విద్య గల్గిన మనుజుడు వింత పశువు
చల్లా దేవిక

 

భావ కవితలు
 
చదువు చదివి బీదల రక్షింపగ లేని ,
వృద్ధ మాతాపితల సేవ చేయగ లేని ,
చదువులన్ని చదివి సద్బోధ లేకున్న,
విద్య కలిగిన మనుజుడు వింత పశువు
 కె మల్లికార్జునరావు

 

కలములతో సృజించే
కవి కుమారులారా
పద్యములు వ్రాయవలదు
వ్యర్థము సుమ్మీ  "మీరెంచుకున్న"
కవితాస్తువైన మనుజుడు
ఎమ్.ఎ చదివినను
పదవులెన్ని పొందినను
సన్మానాలవరదలలో తేలియాడినను
ఆలి వంకవారు అభిమానించినా
అమ్మానాన్నలకు కడివెడంత
కూడందించని కుమారుడైతే
విద్య గల్గిన మనుజుడైనా
వింతపశువే కదా ఉర్విపైన
ఆర్.వి.రమణమూర్తి

 

శారదా మాత కృప లేక, చిత్తశుద్ధి లేక,
గురువు కరుణ లేక, సంఘ హితము లేక,
సంపదలు కోరి, ప్రభువుల ప్రాపు కొరకు,
పద్యములను వ్రాయవలదు వ్యర్థము సుమ్మీ
 కె. మల్లికార్జునరావు

 

జనహితముమరచి
పద్య మాధుర్యంబు
పక్కనపెట్టి
ప్రాస కొరకు ప్రయాస పడుచూ
వాసికంటే
రాసికొఱకు మిగుల తపత్రయపడుచు
పద్యములను వ్రాయవలదు వ్యర్ధము సుమ్మీ!!
****
తాచదివిన చదువుల సారమంత
సాటివారిని ఏరితిగ
దోచుకు తినవలెనన్న
తలపు తో సతతము సతమతమైయ్యెడి
వాడిని చూచినవేళ అనుపించునీరీతిగా
విద్య గల్గిన మనుజుడు వింతపశువు
రమ

 

వాసి  కంటే  రాశి కే  విలువ నిచ్చి
భావమ్ము కంటె  పదముల కూర్పుకే  బలము నిచ్చి
పేరు ప్రఖ్యాతులే మిగుల  ప్రీతి  యనుచు
చదువరుల కొకింత హాయి  నీయక
జీవము లేని  పేలవపు కవితలు,
పద్యములను  వ్రాయవలదు వ్యర్థము సుమ్మీ
 
విద్యలెన్నియో మిన్నగ నేర్చినావు,
వింతలెన్నియో  చూపించగ
ఒండొరులకు మేలు  చేయని
విద్యలెన్నియో  నీవు  నేర్చినావు
ప్రకృతి మర్మమ్ముల నేర్వ.
జగతి జాగృతముల వీడి
మనుజ  ధర్మమ్ముల మరిచి
మానవాళి నాశమునకే హేతువయినావు
 
అడ్డదారుల ఆస్తులు  పెంచంగ
ప్రపంచాధిపత్యమునకే ప్రాకులాడివిలయ తాండవ
సృష్టి కర్తయే నీవు కాగ
విద్య కలిగిన వింత పశువే నీవు
అవళూర్ సీత

 

పదముల విరిచి కుదించి గణముల సరిపెట్టగ
పద్యములను వ్రాయవలదు, వ్యర్ధము సుమ్మీ !
విద్య గల్గిన మనుజుడు వింత పశువు,
గానీ విద్య లేని మనుజుడు మరింత పశువు !!
గాంగేయ శాస్త్రి
(ఛందో బద్ధం కాదు)

 

బాష పై మక్కువ లేని మూర్కులకున్
నీతి భావంబు నీవు మేటిగా కూర్చినా
విలువ తెలియని సాటి మనుజుల కొరకున్
పద్యములను వ్రాయవలదు వ్యర్ధము సుమ్మీ
 
పితృ దేవతలను పూజింప లేనివాడు
గౌరవ మర్యాదలెరుగక అమర్యాద పరుచువాడు
మోక్ష మార్గము లెరుగని మూర్ఖులెల్ల
విద్య కల్గిన మనుజుడు వింత పశువు
 
 వి.వి.శ్రీనివాస్

 

 సీస పద్యములు

 

రెండు సమస్యలు సీసములో తెలుపు చిరు ప్రయత్నం
 
తెలుగు సాహిత్యపు వెలుగు జిలుగులన్ని
  పద్యమందుండునె ప్రాభవముగ
పద్యకవనముకు బహుశోభనిచ్చెడి
  ప్రఖ్యాత ఛందస్సు పసయెరుగని
కవి పద్యములను వ్రాయవలదు వ్యర్థము
  సుమ్మీ, సుమధురంబె శోభితముగ
మధువులొలికెడి సుమధుర పద్యకవుల
  కవనంబు; సర్వదా ఘనతతెచ్చె!
కె మల్లికార్జునరావు ....

 

తెలుగు సాహిత్యపు వెలుగు జిలుగులన్ని
      పద్యమందుండగ ప్రాభవముగ,
పద్యకవనముకు బహుశోభనిచ్చెడి
      ప్రఖ్యాత ఛందస్సు పసయెరుగని
కవి పద్యములను వ్రాయవలదు వ్యర్థము
      సుమ్మీ, సుమధురంబె శోభితముగ
మధువులొలికెడి సుమధుర పద్యకవుల
       కవనంబు; సర్వదా ఘనతతెచ్చె
భావయుక్తముగ సలుపు పద్య కవన
       మె పలువురి మెప్పుపొందును; యెంచి తెలుప
కుత్సితపు మనసుకలిగి గుణమెరుగని
       విద్య గల్గిన మనుజుడు వింత పశువు.

 

 వెంకట్. సి.హెచ్ 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

15.03.2021 సోమవారం దత్తపది -87, హిమము -సుమము -సమము -భ్రమము

  15.03.2021 సోమవారం దత్తపది -87 హిమము -సుమము -సమము -భ్రమము మనోహరమైన పద్య/ వచన కవితలు   దత్తపది :  హిమము  ,  సుమము  ,  సమము  ,  భ్రమ...